Tuesday, December 30, 2025
E-PAPER
Homeసినిమాసృజనాత్మకతను వెలికి తీసే ఒక గొప్ప వేదిక

సృజనాత్మకతను వెలికి తీసే ఒక గొప్ప వేదిక

- Advertisement -

తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బతుకమ్మ యంగ్‌ ఫిలిం మేకర్స్‌ ఛాలెంజ్‌ 2025’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం రవీంద్రభారతి మెయిన్‌ ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పర్యాటక- శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎఫ్‌.డి.సి చైర్మన్‌ దిల్‌ రాజు, ఎఫ్‌.డి.సి ఎండీ ప్రియాంక, దర్శకులు దశరధ్‌, హరీష్‌ శంకర్‌, నటులు తనికెళ్ళ భరణి, సినిమాటోగ్రాఫర్‌ పిజి విందా, నిర్మాత-నటులు అశోక్‌ కుమార్‌, సింగర్స్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, మంగ్లీ, మోహన భోగరాజు, సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్‌, సినీ విమర్శకురాలు అయినంపూడి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాలపై పంపిన షార్ట్‌ ఫిలిమ్స్‌, పాటలలో ఎంపికైన ఉత్తమ ఫిల్మ్‌లకు, పాటలకు ముఖ్య అతిథుల చేతులమీదుగా నగదు బహుమతులు, సర్టిఫికెట్స్‌ అందజేశారు.

ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ,’ఇది తెలంగాణ గర్వించదగ్గ రోజు. మన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ ఎలా చేరుతున్నాయో ప్రపంచానికి చాటిచెప్పే బాధ్యతను మన యువ ఫిల్మ్‌ మేకర్ల చేతుల్లో పెట్టింది. టీఎఫ్‌డీసీ నిర్వహించిన ఈ పోటీ కేవలం ఒక పోటీ మాత్రమే కాదు. ఇది మన యువత మేధస్సుకు, సృజనాత్మకతకు ఒక గొప్ప వేదిక. రాష్ట్రం నలుమూలల నుండి, ముఖ్యంగా మారుమూల గ్రామాల నుండి వచ్చిన ఎంట్రీలను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.

మీరంతా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక చైతన్యవంతమైన వారధిలా నిలిచారు. పల్లెల్లో ఉన్న అపారమైన ప్రతిభను ఈ వేదిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం నాకు ఎంతో గర్వకారణం. మీ ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. తెలంగాణ భవిష్యత్తును మీ కళాత్మక దృష్టితో మరింత గొప్పగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘తెలంగాణ అంటేనే వీరత్వానికి, కళలకు పురిటిగడ్డ. మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప బాధ్యత యువత చేతుల్లో ఉందని నేను నమ్ముతున్నాను. మన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సామాన్యుడి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తున్నాయో మీ కెమెరా కంటితో చూపించడం నిజంగా అభినందనీయం’ అని పర్యాటక- శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -