Friday, January 2, 2026
E-PAPER
Homeక్రైమ్నంద్యాల జిల్లాలో పెను విషాదం

నంద్యాల జిల్లాలో పెను విషాదం

- Advertisement -

ఆర్థిక ఇబ్బందులతో నిండు కుటుంబం బలవన్మరణం
ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి భవన నిర్మాణ కార్మికుడి ఆత్మహత్య


ఆళ్లగడ్డ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉయ్యాలవాడ మండలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య మృతితో మానసికంగా కుంగిపోవడం, ఆర్థిక ఇబ్బందులతో భవన నిర్మాణ కార్మికుడు తన ముగ్గురు పిల్లలను విషమిచ్చి చంపారు. తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం… తుడుములదిన్నె గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర (34)కు, మహేశ్వరికి 2017లో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ (7), జ్ఞానేశ్వరి (4), సూర్యగగన్‌ (2) ఉన్నారు. సురేంద్ర భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గతేడాది ఆగస్టు 16న ఆయన భార్య మహేశ్వరి అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటినుంచి మానసికం గా ఇబ్బంది పడుతున్న ఆయన బుధవారం రాత్రి పాలల్లో విషం కలిపి తన ముగ్గురు పిల్లలతో తాగించడంతో వారు మృతి చెందారు.

ఆ తర్వాత చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని తాను ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం సురేంద్ర, పిల్లలు ఇంటి నుండి బయటకు రాకపోవడంతో వారి ఇంటి పక్కనే ఉంటున్న సురేంద్ర మారుతల్లి అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూశారు. ముగ్గురు పిల్లలు మంచంపై విగత జీవులుగా పడి ఉండడం, కుమారుడు ఉరి వేసుకుని వేలాడుతూ ఉండడం చూసి బోరున విలపించారు. ఆళ్లగడ్డ రూరల్‌ సిఐ రమణ, ఎస్‌ఐ రామిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నూతన సంవత్సరం రోజున వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -