సావిత్రిబాయి పూలే -తాటికొండ సీతయ్య..
నవతెలంగాణ-తుంగతుర్తి
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, మహిళల విద్యాభివృద్ధికి పాటుపడిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. సావిత్రిబాయి పూలే దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి, గొప్ప సామాజికవేత్త అని గుర్తు చేశారు. స్త్రీ విద్యావంతురాలు అయితే తన సంతానానికి విద్యను అందించడం ద్వారా కుటుంబం విజ్ఞానవంతమై గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని ఆమె ఆరోజుల్లోనే స్త్రీ విద్యకు పునాదులు వేశారని అన్నారు.
150 సంవత్సరాలు క్రితం స్వాతంత్రం లేని రోజుల్లో బ్రిటిష్ పాలనలో వాక్ స్వాతంత్రం లేని రోజుల్లో అగ్రవర్ణాల అధిపత్యంలో బలహీన వర్గాలకు చెందిన పురుషులనే చదువుకు దూరంగా ఉంచిన పరిస్థితులలో సొంతంగా బడుగు బలహీన వర్గాల బాలికలకు స్వంతంగా పాఠశాలను, వసతి గృహాలను నెలకొల్పి సావిత్రిబాయి ఫూలే విద్యను అందించారని అన్నారు. సమాజంలో ఉన్న అనేక రకాల సామాజిక అసమానతలు, మూఢనమ్మకాలు, అంటరానితనాన్ని, బాల్య వివాహాలను, సతీసహగమనాన్ని, భర్త చనిపోతే స్త్రీలకు శిరోమండలం చేయడాన్ని, వ్యతిరేకించి వాటిని రూపుమాపడంలో ఆమె పాత్ర ఎంతో కీలకమైంది అన్నారు.
నేటి సమాజం ఆమెను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు తునికి సాయిలు, పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్, రమేష్, వెంకన్న, మల్లికార్జున్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.



