ఏ గట్టున నిలబడతామో ఆ గట్టునుండే మిగిలిన ప్రపంచాన్ని ఎవరైనా చూడగలుగుతారు. అందుకే ‘గట్టుమీదున్నోడు పిత్తపరిగి అంటే చెరువులో పట్టుకున్నోడు కొరమీను అన్నాడట (సామెత). అంటే అసలు విషయం దగ్గర వున్నవాడికి, అనుభవించేవాడికి మాత్రమే తెలుస్తుందని అర్థం.
హైద్రాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మార్పు కోసం మంచి సినిమా’ పేరుతో ఆగస్టు 10 ఆదివారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భిన్న భాషల లఘుచిత్రాల ప్రదర్శన జరిగింది. సినీరంగ ప్రముఖులు సి. ఉమామహేశ్వరరావు, కె.ఎల్.ఎన్.ప్రసాద్ వంటి వారితో పాటు కవులు, రచయితలు, రచయిత్రులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, రంగస్థల కళాకారులు, చిత్ర నిర్మాణంపై ఆసక్తి వున్న యువతీయువకులు గణనీయంగా పాల్గొన్నారు.
ప్రదర్శించిన చిత్రాలన్నీ వీక్షకులకు ఒక విధంగా భావ విస్పోటనం కలిగించాయి. సమాజం నిశితంగా చూడలేని అనేక అంతర్గత, బహిర్గత అంశాలనే ఈ సినిమాలు ఎత్తి చూపాయి.
సమస్యలు ఇలా వుంటాయా? సమాజం ఇలా కూడా వున్నదా? సినిమాలు ఇలా కూడా తీయవచ్చా..? అనే ఆశ్చర్యానికి లోనయ్యారు వీక్షకులు.
సహృదయ ప్రేక్షకులకు ప్రతి సినిమా నిజంగా ఓ అద్భుతమే. సినిమాకు కచ్ఛితమైన నిడివి వుండక్కర్లేదు. చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా మనసుకు హత్తుకునేలా చెప్పడానికి కొన్ని నిమిషాలు చాలు. గంటలు అక్కర్లేదు అని నిరూపించాయి.
ప్రతి సినిమా భిన్న ఆలోచనలు, ప్రతి ప్రేక్షకుడు/ ప్రేక్షకురాలు ప్రత్యేకమే అన్న రీతిలో సినిమా పై చర్చ జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ జరగడం స్ఫూర్తిదాయకం. సమన్వయకర్తగా వ్యవహరించిన గౌరవ్ ఇదే విషయాన్ని తేల్చి చెప్పాడు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక సమూహంగా సినిమాను వీక్షించడం, అనంతరం ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ జరగడం, సమాంతర చిత్రం (మంచి సినిమా) లక్ష్యంగా ఆయన చెప్పుకొచ్చారు. అంటే సినిమాల ద్వారా భావ విస్పోటనం జరగాలే తప్ప భావ దారిద్య్రంలో కూరుకుపోరాదని హెచ్చరించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సహేతుకమైన ఆలోచన గల మంచి సినిమానే భావ విప్లవానికి చోదకశక్తి అని అభివర్ణించారు.
కాగా మంచి సినిమా తన ప్రేక్షకుల్ని తానే సొంతంగా తయారు చేసుకోవాల్సిన బాధ్యతను గుర్తెరిగింది. కళాశాలల్లో, పాఠశాలల్లో నాటక గోష్టుల్లో విభిన్న సమూహాల్లో విరివిగా మంచి సినిమాలు చూపించవలసిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది.
ఓ మంచి సినిమాను కలసి చూడడం, చర్చించడం, తర్కించడం, సారం గ్రహించడం, తద్వారా మార్పుకు దోహదపడడం, ఆధునిక యుగంలో ఓ సంస్కృతిగా రూపుదిద్దుకోవాలనే ఆకాంక్షను చాలామంది వ్యక్తపరిచారు.
బ్రేబర్రీస్ రైపెన్ ఇన్ ద మాన్‌సూన్ (గర్హవాలి), గులార్ కె ఫూల్ (హిందీ), నో స్పేస్ టు ప్రే (ఉర్దూ), జోడి (బెంగాలి), ఫ్రీ యాజ్ బర్డ్ (హిందీ), గ్రీన్ గర్ల్ (కన్నడ), బ్యాలెడ్ ఆఫ్ మౌంటెన్ (హిందీ), లాంగింగ్ (పంజాబి), సీడ్ స్టోరీ (డాక్యుమెంటరీ), నైబర్స్ (భాషలేని), ఆలం (హిందీ), హర్‌దంగ్ (హిందీ), జస్ట్ లైక్ దట్ (హిందీ) మొదలైన చిత్రాలు ప్రదర్శించారు.
బ్యాలడ్ ఆఫ్ మౌంటెన్ (పర్వతగీతం) చిత్రం గురించి ప్రస్తావిస్తాను. తల్లిదండ్రులు లేని ఇద్దరు పాపలు. ఓ పాపకు 10 సంవత్సరాలు, ఇంకో పాపకు 5 సంవత్సరాలు. ఇద్దరూ ఓ చిన్న ఇంట్లో ఊరికి దూరంగా వుంటారు. చిన్న గొర్రెలు, మేకల మంద వారికి జీవనాధారం. సభ్యసమాజానికి బహిష్కృతులుగా జీవిస్తుంటారు. అయితే పెద్దపాపకు చదువుకుని ఎదగాలని ఆశ. తన ఆశలను, కలలను చిన్నపాపకు అర్థం అయినా కాకున్నా నిరంతరం చెబుతూనే వుంటుంది. కానీ తరగతి గదిలో మాస్టర్ దగ్గర నుండి ఇతర పిల్లల వరకు ఈ పాపను నిత్యం వివక్షతో వేధిస్తూ వుంటారు. కానీ ఈ పాప వాటిని ఏమీ పట్టించుకోకుండా అప్పుడప్పుడూ ధైర్యంగా ఎదుర్కొంటూ జీవిస్తుంటుంది. తన చెల్లెలుకు రక్షణగా నిలబడుతుంది.
ఒకరకంగా ఆ చిరు వయసులో ఆ పాప చేస్తున్న సాహసం ఎదురీతే. చివరకు ఇంట్లోని కరెంటు బల్బ్‌ను సరిచేసి వెలిగించుకుని, పాఠ్యపుస్తకంలో రాకెట్‌ను చూసి కాగితం రాకెట్‌ను తయారు చేసుకుని ఆ వెలుగులోకి దారంతో తన కాగితపు రాకెట్‌ను పంపుతూ ఆశగా చూడటంతో ముగుస్తుంది. నిడివి 16 నిమిషాలు. జీవితంలో ఆశను వీడకూడదని, ఎన్ని పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ముందుకే పోవాలని, జీవితంలో చదువు ఓ భాగమే తప్ప చదువే జీవితం కాదని, ఎవరు విన్నా వినకపోయినా, గమనించినా, గమనించకపోయినా తమ ఆశలను, కలలను స్వతహాగా వ్యక్తపరుస్తూనే వుంటారని… ఇలా ఎన్నో విషయాలు ఆ చిన్న సినిమా తెలిపింది. ఇలాంటి చిత్రాల ద్వారా అలాంటి వస్తు గతిదృష్టి (ఆబ్జెక్టివ్ అవుట్‌లుక్) ని అలవరచుకోగలం. తద్వారా సానుభూతిని, సహానుభూతిని పొంది మనిషిగా మిగలగలం.
తెలంగాణ ప్రజాసాంస్కృతిక కేంద్రం, ‘ముందగుడు’ కోల్‌కత్తా, మంచి సినిమా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కొలకత్తా ప్రజా చలనచిత్రోత్సవం జరిగింది. అభ్యుదయ దర్శకులు రిత్విక్ ఘటక్ శతజయంతి సందర్భంగా ఈ ఉత్సవం జరగడం ఎంతైనా అభినందనీయం కదా!
– కె.శాంతారావు, 9959745723
మార్పుకు మార్గదర్శి మంచి సినిమా
- Advertisement -
- Advertisement -