Sunday, March 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇంటికో పొయ్యి - మనిషికో కట్టె

ఇంటికో పొయ్యి – మనిషికో కట్టె

- Advertisement -

దేశంలో అదో ప్రముఖ పట్టణం! ఆ పట్టణానికి పెద్దాయన వస్తున్నారని, గ్యాస్‌ కొరతను ఎదుర్కొనేందుకు ఒక అమృత పథకాన్ని ప్రారంభించబోతున్నారని, ప్రముఖ సినిమా స్టార్‌ భక్షయ్ కుమార్‌ ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. దాంతో దేశమంతా ఆ అమృత పథకం కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నది! పట్టణంలోని ప్రముఖ కాలనీకి పెద్దాయన వచ్చాడు. అమృత పథకాన్ని ప్రారంభించే కాలనీ అదే! వందల కొద్దీ కెమెరాలు అన్నీ సిద్ధం! పథకం ప్రారంభించాల్సిన గదిని పూలతో బ్రహ్మాండంగా అలంకరించారు. అక్కడున్న ప్రజలే కాక దేవంలోని ప్రజానీకం అంతా ప్రత్యక్ష ప్రసారంలో అతృతగా ఎదురుచూస్తున్నారు! ఎందుకు చూడరు మరి? పశ్చిమాసియా యుద్ధం పుణ్యమా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరిగిపోయాయి. పెద్ద హోటళ్లలో గ్యాస్‌ సర్‌ఛార్జీ వేస్తున్నారు. రోడ్డుపక్క పెట్టుకున్న టిఫిన్‌ సెంటర్లు చాలా వరకు మూతపడిపోయాయి. పెద్దాయన ప్రారంభించే అమృత పథకం వల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశపడుతున్నారు!

పెద్దాయన రిబ్బన్‌కట్‌ చేసి లోపలికి వచ్చాడు! అక్కడ ఒక పొయ్యి. ఆ పక్కనే కట్టెలు! ”దేశంలో గ్యాస్‌ కొరత వస్తుందని దేశద్రోహులు ప్రచారం చేస్తున్నారు! గ్యాస్‌ విదేశీ సరుకు! అందుకే అది వద్దు! మన వేద శాస్త్రాలు పరిశోధించి స్వదేశీ ఇంధనం తయారు చేయటం తెలుసుకున్నాను. నిజానికి ఇది చాలా సులభమైన పద్ధతి! ఇదిగో మట్టితో చేసిన పొయ్యి! ఇదిగో వట్టి కట్టెలు! ఈ కట్టెలు పొయ్యిలో పెట్టి ఈ విధంగా మండించాలి! ఎంతో రుచికరమైన భోజనం తయారైపోతుంది! ఎంతో ఆరోగ్యం కూడా పైగా పూర్తిగా స్వదేశీ!” అంటూ పెద్దాయన కట్టెలపొయ్యి వెలిగించాడు! అంతా చప్పట్లు కొట్టారు! ”నేను చిన్నప్పుడు ఛాయి ఈ పొయ్యి మీదే చేశాను.

ఆ చాయి తాగటానికి గుంపులు గుంపులుగా వచ్చేవారు! దాంతో పోలీసులు వచ్చి లాఠీఛార్జి చేశారు! అప్పటి నుండి క్యూలో నిలబడి తమ వంతు వచ్చేదాకా ఎదురు చూసేవారు! ఈ అమృత పథకానికి ఇంటికే పొయ్యి మనిషికో కట్టె అని నామకరణం చేస్తున్నాను! ఈ పథకంపై ఎవరైనా పరిశోధనలు చేస్తే వారికి ప్రోత్సహకాలు ఇస్తాము!” అని ప్రకటించాడు పెద్దాయన. కట్టెల పొయ్యి వెలిగించిన తర్వాత మెల్లిగా పొగవచ్చింది. దాంతో కొందరు కళ్లు నలుముకుంటున్నారు! అందులో ఒక నడి వయస్సు వ్యక్తి కొద్దిగా ఎక్కువ కళ్లు నలుముకున్నాడు. అతన్ని ఒక మేడమ్‌ సిరియస్‌గా పరిశీలిస్తోంది! మెల్లిగా ఆ వ్యక్తి వద్దకు వెళ్లింది!

”సర్‌! మీరు కళ్లు నలుముకున్నారు కదా! ఎందుకు?” అని అడిగింది!
”ఈ కట్టెలపొయ్యి నుండి వచ్చిన పొగవల్ల!” అన్నాడు నడివయస్సు వ్యక్తి.
”ఆహా! ఇవి ఎన్ని వేళ్లో చెప్పగలరా?” అంటూ మేడమ్‌ మూడు వేళ్లు చూపించింది!
”ఆ మూడు వేళ్లు!” అన్నాడు నడివయస్సు.
”ఇంతకు ముందు నా వేళ్లు ఏమైనా కనిపించాయా?” ఆతృతగా అడిగింది మేడమ్‌.
”లేదు!” అని నడివయస్సు ఏదో చెప్పబోతుండగానే ”యూరేకా!” అని అరుస్తూ మేడమ్‌ పెద్దాయన దగ్గరకు పరిగెత్తింది!
”సర్‌! మీరు ప్రారంభించిన ఇంటికి పొయ్యి- మనిషికి కట్టె అమృత పథకం. ఇంధన కొరతనే కాదు! మరో అద్భుతమైన వైద్యపరమైన ఫలితాన్ని కూడా ఇచ్చింది! మీరు చెప్పిన వెంటనే పరిశోధన ప్రారంభించి కనుక్కున్నాను!” అని విన్నవించింది మేడమ్‌.

”ఏం కనుక్కున్నారు!” అడిగాడు పెద్దాయన.
వెంటనే నడి వయస్సు వ్యక్తిని చూపింది మేడమ్‌! అన్ని కెమెరాలు అటు తిరిగాయి!
”మన అమృత పథకం ప్రారంభం కాగానే పొగ వచ్చింది! అది మీరంతా చూశారు! ఆ పొగ వల్ల ఈ నడివయస్సు వ్యక్తి కళ్లు నులుముకున్నాడు! అంతకు ముందు ఈయనకు ఏమీ కనబడేది కాదంట! ఇప్పుడు అన్ని కనబడుతున్నాయంట! కావాలంటే మీరు కూడా చూడండి!” అంటూ నడివయస్సు వ్యక్తికి మూడు వేళ్లు చూపించి ”ఇవి ఎన్ని వేళ్లు?” అని అడిగింది మేడమ్‌.
”మూడు వేళ్లు!” అని చెప్పాడు నడివయస్సు.
”ఇంతకుముందు! నా వేళ్లు కనబడ్డాయా?” అడిగింది మేడమ్‌!
”లేదు!” అంటూ మళ్లీ ఏదో చెప్పబోయాడు. నడివయస్సు! అంతే ఆయన్ను పక్కకు నెట్టేసి ”ఇది వైద్య శాస్త్రంలోనే ఒక మిరకల్‌! కట్టెల పొయ్యి పొగవల్ల ఆ వ్యక్తి కంటి పొరలు నులుముకుంటే పోయాయి!” అంటూ పెద్దాయన వద్దకు వెళ్లింది మేడమ్‌!

పెద్దాయన ఎడం చేత్తో చప్పట్లు కొట్టాడు!
”ఇంతకూ మీరు ఎవరు?” అని అడిగాడు.
”నేనొక సైంటిస్టుని సర్‌! గోల్‌మాల్‌ యూనివర్సిటీలో రిసెర్చ్‌ చేస్తున్నాను! కట్టెల పొయ్యి మీద మరొక పరిశోధన కూడా చేశాను! మీరు అనుమతిస్తే అది కూడా ప్రదర్శిస్తాను” అన్నది మేడమ్‌.
”కానివ్వండి!” అన్నాడు పెద్దాయన.
”కట్టెల పొయ్యి నుండి వచ్చే పొగను, ఈ మోటార్‌ సైకిల్‌ ఆయిల్‌ ట్యాంకులోకి పెట్టాలి సర్‌!” అంటూ మోటార్‌ సైకిల్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ ఖాళీ చేసి, కట్టెలపొయ్యి పొగను ఆయిల్‌ ట్యాంక్‌లోకి పట్టింది! ఆ తర్వాత జనంలో నుండి ఒక వ్యక్తిని పిలిచి బైక్‌ స్టార్ట్‌ చేయమన్నది మేడమ్‌!
ఆ వ్యక్తి స్టార్ట్‌ చేయబోయాడు!
”ఆగండి!” అంటూ మేడమ్‌ సైగ చేసింది! అంతే కొందరు గోల్‌మాల్‌ యూనివర్సిటీ స్టూడెంట్లు తమ వెంట తెచ్చుకున్న ప్లేట్లు, గిన్నెలను గంటెలతో మోగించారు!
ఇక బండి స్టార్ట్‌ చేయమన్నట్లు చూసింది మేడమ్‌!

ఆ వ్యక్తి వెంటనే బండి స్టార్ట్‌ చేశాడు. ముందు కదిలించాడు! సైకిల్‌ మోటార్‌ వంద మీటర్ల దూరం వెళ్లి ఆగిపోయింది!
”ఎవరు కంగారు పడవద్దు! మా గోల్‌మాల్‌ యూనివర్సిటీ రెండో పరిశోధన కూడా సక్సెస్‌ అయ్యింది! అయితే వంద మీటర్ల దూరం వెళ్లిన తర్వాత బండి ఎందుకు ఆగిపోయిందనే అనుమానం రావచ్చు. బండి మీద వెనక మరొకరు కూర్చుని ఒక ప్లేట్‌ను గంటెతో మోగిస్తే చాలు బండి కదులుతుంది! మోగించడం ఆపేస్తే బండి ఆగిపోతుంది! అంతే! అన్నట్లు ఈ రెండు పరిశోధనలు పూర్తిగా మా గోల్‌మాల్‌ యూనివర్సిటీ సొంతం! ఎవరి నుండి కాపీ కొట్టలేదు! అందుకే పేటెంట్లకు అప్లై చేశాము!” విన్నవించుకున్నది మేడమ్‌.
‘షెహభాష్‌! ఇంటికి పొయ్యి – మనిషికో కట్టె అమృత పథకం మీద గొప్ప పరిశోధనలు చేసినందుకు మీకు అభినందనలు! మరిన్ని పరిశోధనల కోసం గోల్‌మాల్‌ యూనివర్సిటీకి పదివేల కోట్ల రూపాయలు గ్రాంట్‌ మంజూరు చేస్తున్నాం!” ప్రకటించాడు పెద్దాయన.

ఉషాకిరణ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -