అనంతపురం: అనంతపురం జిల్లా శింగనమల మండలంలో దారుణం చోటు చేసుకుంది. అంగన్‌వాడీ టీచర్, ఆమె కుమారుడు సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు…శింగనమల మండల పరిధిలోని తరిమెల గ్రామానికి చెందిన దండోరా నల్లప్పకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య లక్ష్మీదేవికి కుమారులు ఓంకార్, జగజ్జీవన్, కుమార్తె ఉన్నారు. చిన్న భార్య యల్లమ్మ (38) అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తూ చిన్న కుమారుడు చిన్నా(22)తో కలిసి నివసిస్తున్నారు. భర్త మరణానంతరం లక్ష్మీదేవి, యల్లమ్మ కుటుంబాలు వేరువేరుగా అదే గ్రామంలోనే నివసిస్తున్నాయి. నల్లప్ప మరణించే సమయంలో తన పేరుపై ఉన్న ఎకరా భూమిని యల్లమ్మ పేరు మీద రాశారు. అప్పటి నుంచి ఈ పొలం విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి లక్ష్మీదేవి కుమారులిద్దరూ యల్లమ్మ ఇంటికి వెళ్లారు. వేటకొడవళ్లతో చిన్నాను హతమార్చారు. దీంతో యల్లమ్మ ఇంటి నుంచి పరుగులు తీశారు. వెంటాడి ఆమెనూ హతమార్చారు. అనంతరం ఆమె తలను చేతిలో పట్టుకుని గ్రామంలో తిరుగుతూ నిందితులు నానా హంగామా సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శింగనమల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని మీడియాకు ఎస్‌పి తెలిపారు. భూ తగదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ అయ్యిందని, దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.


