Thursday, May 29, 2025
Homeబీజినెస్ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు భారీ దెబ్బ

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు భారీ దెబ్బ

- Advertisement -

– 5,484 విద్యుత్‌ బస్సుల టెండర్‌ నిలిపివేత
– మహారాష్ట్ర రవాణా శాఖ నిర్ణయం..!
– 14 శాతం పతనమైన షేర్‌
నవతెలంగాణ- హైదరాబాద్‌

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఓజీఎల్‌)కు మహారాష్ట్ర రవాణా శాఖ ఊహించని షాక్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు ఇచ్చిన 5,484 ఎలక్ట్రిక్‌ బస్సుల టెండర్‌ను రద్దు చేసింది. రూ.10 వేల కోట్ల విలువైన ఈ కాంట్రాక్టులో బస్సుల సరఫరాలో ఆలస్యం జరగడంతో ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌ తెలిపారు. గడువులోగా బస్సులు డెలివరీ చేయకపోవడంతో టెండర్‌ రద్దు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. 2024 జనవరిలో ఒలెక్ట్రాతో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు 2,000 బస్సులను డెలివరీ చేయాల్సి ఉందన్నారు. వీటితో ప్రజలకు సేవలందించాలనుకున్నామన్నారు. కానీ ఇప్పటి వరకు ఓలెక్ట్రా కేవలం 220 బస్సులను మాత్రమే అందించిందని ఓ వార్త సంస్థతో పేర్కొన్నారు. ”2025 మే వరకు కనీసం 1200 బస్సులను అందిస్తారని భావించాము. ఇంకెంత కాలం ఎదురు చూడాలి. ఇప్పటికే పలు సార్లు నోటీసులు జారీ చేశాము. కాంట్రాక్టు రద్దు కోసం లీగల్‌ సలహా తీసుకుంటున్నాము.’ అని సర్నాయక్‌ వెల్లడించారు.
మహారాష్ట్ర రవాణ శాఖ నుంచి భారీ కాంట్రాక్టు రద్దు అయ్యిందన్న వార్తలతో ఒలెక్ట్రా షేర్‌ భారీగా పతనమయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 14 శాతం క్షీణించి రూ.1,160 స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత కొంత కోలుకుని తుదకు 6.65 నష్టంతో రూ.1,255.90 వద్ద ముగిసింది. విద్యుత్‌ బస్సుల సరఫరాలో విఫలమైన ఒలెక్ట్రాకు ఏడు సార్లు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఒప్పంద ఉల్లంఘనలు, ఆలస్యం కారణంగా సుమారు రూ.4 కోట్ల జరిమానాలు కూడా విధించారనే రిపోర్టులు ఆ కంపెనీ షేర్‌పై ప్రతికూలతను పెంచాయి.
క్యూ4లో 219 ఎలక్ట్రిక్‌ వాహనాల డెలివరీ
గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.139.21 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 39 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్యూ4లో ఒలెక్ట్రా 219 ఎలక్ట్రిక్‌ వాహనాలను పంపిణీ చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరంలో పంపిణీ చేసిన 131 వాహనాలతో పోలిస్తే 67 శాతం ఎక్కువ. గడిచిన క్యూ4లో కంపెనీ ఆదాయం రూ.448.92 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు కంపెనీ 2,718 ఎలక్ట్రిక్‌ వాహనాలను డెలివరీ చేసినట్లు వెల్లడించింది. ‘మా తయారీ సామర్థ్యాన్ని పెంచడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడంపై మా దృష్టి కొనసాగుతుంది. మా ఆర్డర్‌ బుక్‌ బలీయంగా ఉంది. ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పరిశ్రమలో మేము నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాము.” అని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ సిఎండి కెవి ప్రదీప్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -