రూ.2780 కోట్లు విడుదల చేసిన సర్కారు
138 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో 2432 పనులకు ఆమోదం
వెంటనే టెండర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. 138 పురపాలికలకు రూ.2780 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాల్టీల్లో అభివృద్ధి పనులకు వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈమేరకు మున్సిపల్ శాఖ ఈ నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రైజింగ్ విజన్-2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రమంతటా ఉన్న పట్టణాలను గ్రోత్‌హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఉన్న మున్సిపాల్టీల విస్తరణతో పాటు కొత్తగా ఏర్పడిన వాటిలోనూ మెరుగైన పౌర సదుపాయాలతో పాటు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అభివృద్ధి పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలోని 138 మున్సిపాల్టీల్లో రూ. 2,780 కోట్ల ఖర్చుతో 2,432 పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపరిచిన నగరాభివృద్ధి నిధులతో పాటు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) పథకాల నుంచి ఈ నిధులను మంజూరు చేసింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాల్టీలకు రూ.15 కోట్లు, అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాల్టీలకు రూ. 20 కోట్లు, పాత మున్సిపాల్టీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు.
కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లకు రూ. 30 కోట్లు మంజూరు చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఈ నిధులను ఖర్చు చేయాలని మున్సిపల్ శాఖ మార్గదర్శకాలను రూపొందించింది. మున్సిపాల్టీల్లో విలీనమైన ప్రాంతాల అభివృద్ధి, అంతర్గత రహదారుల నిర్మాణం, వర్షపు నీరు, మురుగు నీటికి డ్రెయిన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, చెరువులు, కుంటల్లో కాలుష్య నివారణ, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిన ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణ పనులకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అన్ని మున్సిపాల్టీల్లో సంబంధిత విభాగాలు వెంటనే టెండర్లు పిలిచి ఈ పనులు ప్రారంభించాలని ఆదేవించారు. 2026 మార్చి నాటికి అన్ని పనులను పూర్తి చేయాలంటూ గడువు విధించారు.



