Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఐటిసి కంపెనీ స్టాక్‌ యార్డులో భారీ అగ్నిప్రమాదం

ఐటిసి కంపెనీ స్టాక్‌ యార్డులో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం రామవరం-గండిగుండం రోడ్డులోని ఐటిసి కంపెనీ స్టాక్‌ యార్డులో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో మొదలైన మంటలు వేగంగా వ్యాపించడంతో రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానికులు, అధికారుల కథనం ప్రకారం… ఉప్పు, గోధుమలు, చాక్లెట్లు, సిగరెట్లు, అగరబత్తీలు వంటి నిత్యావసర వస్తువులు ఈ గోదాములో నిల్వ చేసి ఒడిశా తదితర రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటారు. అగ్నిప్రమాదంతో ఆ సరుకులన్నీ కాలిపోయాయి. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుంచి పది అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటల అదుపునకు తీవ్రంగా శ్రమించాయి. మంటలు అధికంగా వ్యాపించడంతో సహాయక చర్యలు ఆదివారం ఉదయం వరకూ కొనసాగాయి. గ్రామ సర్పంచ్‌ గండ్రెడ్డి శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సహకారం అందించారు. గోదాం మేనేజర్‌ విశాఖలో ఉండడంతో గేట్లు తెరవడం ఆలస్యమైంది. స్థానిక యువకులు గేట్లు తెరిచి మంటలను కొంతవరకు అదుపులోకి తెచ్చారు. ఈ స్థలం టిడిపి అవనిగడ్డ ఇన్‌ఛార్జి వికృతి శ్రీనివాసరావుకు చెందినది. నిర్వహణను కోల్‌కత్తాకు చెందిన బాబీ ఘోష్‌ సహా మరికొంతమంది చూస్తున్నట్టు సమాచారం. కంపెనీలో భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉండడం, ఫైర్‌ సేఫ్టీ లేకపోవడం ప్రమాద తీవ్రతకు కారణమని అధికారులు తెలిపారు. కంపెనీలో గుట్కా, ఖైనీ, పాన్‌పరాగ్‌ తదితర నిషేధిత ఉత్పత్తులు భారీగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదస్థలాన్ని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు పరిశీలించారు. కంపెనీ యాజమాన్యం పూర్తి స్థాయిలో వివరాలను అందించడం లేదు. ఇది స్టాక్‌ యార్డు కావడం, అర్ధరాత్రి ప్రమాదం జరగడం, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదు. సహాయక చర్యల్లో అగ్నిమాపక రీజనల్‌ డైరెక్టర్‌ నిరంజన్‌, డిఎఫ్‌ రేణుక, చిట్టివలస ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరాజు, ఆనందపురం సిఐ వాసునాయుడు, ఎస్‌ఐ సంతోష్‌ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad