Sunday, April 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాకు గర్వభంగం

అమెరికాకు గర్వభంగం

- Advertisement -

24 గంటల్లో రెండు యుద్ధ విమానాలను కూల్చిన ఇరాన్‌
పైలట్‌ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు
టెహ్రాన్‌ అణు స్థావరాలు, పెట్రో కెమికల్‌ కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులు
నిలిచిన దౌత్య యత్నాలు

నవ తెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌
పశ్చిమాసియా పోరు అంతకంతకూ తీవ్ర రూపు దాలుస్తోంది. అమెరికా-ఇజ్రాయిల్‌ ఉధృతంగా దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్‌ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా యుద్ధ క్షేత్రంలో అగ్రరాజ్యానికి అనూహ్యంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలను ఇరాన్‌ కూల్చివేయగా ఇరాన్‌లోని పెట్రోకెమికల్‌ కేంద్రాలు, అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా-ఇజ్రాయిల్‌ సేనలు దాడులు చేశాయి. ఐదు వారాలుగా సాగుతున్న యుద్ధంలో తొలిసారిగా 24 గంటల వ్యవధిలోనే అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలను ఇరాన్‌ కూల్చివేసింది. ఏ-10 యుద్ధ విమానాన్ని శుక్రవారం హార్ముజ్‌ జలసంధి సమీపంలో కూల్చివేసిన ఇరాన్‌ తాజాగా ఎఫ్‌-15ఈ స్రైక్‌ ఈగల్‌ విమానాన్ని కూల్చింది. ఇందులో ఇద్దరు సిబ్బంది ఉండగా వారిలో ఒకరి ఆచూకీ తెలియడం లేదు. అతని కోసం ఇరాన్‌, అమెరికా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

గాలింపు చర్యలు చేపట్టిన రెండు అమెరికా బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లపై కూడా ఇరాన్‌ దాడి జరిపింది. అయితే అవి ఇరాన్‌ గగనతలం నుంచి దూరంగా వెళ్లిపోయాయి. శత్రు దేశాలకు చెందిన వారిని గుర్తించి సమాచారం ఇచ్చినా లేక చంపినా తగిన పారితోషికం అందజేస్తామని ఇరాన్‌ అధికారులు ప్రకటించారు. వ్యూహాత్మక జలసంధి పరిసరాలలో దక్షిణ దిశగా సంచరిస్తున్న ఏ-10 విమానాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్‌ దానిని కువైట్‌ గగనతలంలో కూల్చివేసింది. ఆయుధ వాహనాలపై, శత్రు సైనికులపై భూతల దాడుల కోసం ఈ విమానాన్ని అమెరికా ఉపయోగిస్తోంది. ఇస్ఫహాన్‌ రాష్ట్రంపై అమెరికా ప్రయోగించిన ఎంక్యూ-1 డ్రోన్‌ను అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) కూల్చివేసిందని ఫార్స్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది.

ఇదిలావుండగా ఇరాన్‌లోని బుషెహర్‌ అణు కేంద్రం సమీపంలో అమెరికా వైమానిక దాడి జరిపింది. ఈ ఘటన లో ఓ సెక్యూరిటీ గార్డు చనిపోగా అక్కడి భవనం దెబ్బ తిన్నది. యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్‌ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం ఇది నాలుగోసారి. దక్షిణ ఇరాన్‌లోని ఖుజెస్థాన్‌ రాష్ట్రంలో ఉన్న రెండు పెట్రోకెమికల్‌ కేంద్రాలపై అమెరికా- ఇజ్రాయిల్‌ సేనలు జరిపిన దాడులలో ఒకరు మరణించారు. దక్షిణ ఇరాన్‌లోనే ఉన్న సిమెంట్‌ ప్లాంటుపై కూడా శనివారం దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయ పడ లేదని, ప్లాంటు లో కార్యకలాపాలు యధావిధిగా కొన సాగుతున్నా యని హర్మోజ్‌గన్‌ రాష్ట్ర డిప్యూటీ గవర్నర్‌ నఫీసి చెప్పారు. కాగా తూర్పు లెబనాన్‌లోని బ్రిడ్జిని ధ్వంసం చేసిన ఇజ్రాయిల్‌ సైన్యం తాజాగా ఓ ప్రకటన విడుదల చేస్తూ బీరుట్‌లోని హెజ్బొల్లా మౌలిక స్థావరాలపై దాడులు మొదలు పెట్టామని తెలిపింది. ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా బీరుట్‌లో అరగంట వ్యవధిలోనే రెండు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆకాశంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. లితానీ నదిపై నిర్మించిన మరో రెండు బ్రిడ్జిలను కూడా కూల్చేస్తామని ఇజ్రాయిల్‌ సైన్యం హెచ్చరించింది.

ఆ జలసంధిని కూడా మూసేస్తాం : ఇరాన్‌ అక్రమ యుద్ధానికి ముగింపు పలకాలన్నదే మా అభిమతం
ఇరాన్‌లో రెండో వ్యూహాత్మక జలసంధి అయిన బాబ్‌-ఎల్‌-మందేబ్‌లో కూడా నౌకల రవాణాను అడ్డుకుంటామని పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘర్‌ ఖలీబఫ్‌ హెచ్చరించారు. 32 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ జలసంధి ఎర్ర సముద్రాన్ని గల్ఫ్‌ ఆఫ్‌ అదెన్‌, హిందూ మహా సముద్రంతో కలుపుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఇది ఒకటి. సముద్రం ద్వారా సరఫరా అవుతున్న చమురులో పదో వంతు దీని మీదుగానే రవాణా అవుతోంది. నాలుగో వంతు కంటెయినర్‌ నౌకల రవాణా కూడా దీని ద్వారానే జరుగుతోంది. కాగా సంప్రదింపుల విషయంలో తమ వైఖరిని అమెరికా మీడియా వక్రీకరిస్తోందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఆరోపించారు. దౌత్య యత్నాలు జరుపుతున్న పాకిస్తాన్‌కు కృతజ్ఞులమై ఉంటామని, ఇస్లామాబాద్‌ పర్యటనను తాము ఎన్నడూ నిరాకరించలేదని ఆయన తెలిపారు. తమ దేశంపై రుద్దిన అక్రమ యుద్ధానికి ముగింపు పలకాలన్నదే తమ ఉద్దేశమని, దీనికి సంబంధించిన విధివిధానాలపై తాము దృష్టి పెట్టామని చెప్పారు. ఇదిలావుండగా ఇస్ఫహాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో రెడ్‌ క్రీసెంట్‌ సిబ్బంది ఒకరు చనిపోయారని ఇరాన్‌కు చెందిన ఫార్స్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలియజేసింది.

ఇది యుద్ధం కదా : ఎదురు దెబ్బలపై ట్రంప్‌
తమ దళాలు చవిచూస్తున్న ఎదురు దెబ్బలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తేలికగా తీసుకుంటున్నారు. ఇరాన్‌తో జరుపుతున్న చర్చలపై వీటి ప్రభావం ఉంటుందా అని విలేకరులు ప్రశ్నించగా ‘లేదు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది యుద్ధం’ అని చెప్పారు. యుద్ధ విమానాలను ఇరాన్‌ కూల్చివేసిందని అమెరికా ధృవీకరించినప్పటికీ పెంటగాన్‌ కానీ, సెంట్రల్‌ కమాండ్‌ కానీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇరాన్‌ గగనతలంపై అమెరికా దళాలు పూర్తి పట్టు సాధించాయంటూ ట్రంప్‌ గతంలో చేసిన వాదనలో ఏ మాత్రం పస లేదని తాజా ఘటనలు నిరూపించాయి. అమెరికాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యమవడం ఆందోళన కలిగిస్తోందని సైనిక నిపుణులు అభిప్రాయపడ్డారు.

సడలని ఉద్రిక్తత
ఘర్షణలు రోజురోజుకూ ఉధృతమవుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత ఏ మాత్రం సడలే పరిస్థితి కన్పించడం లేదు. ఇస్లామాబాద్‌లో అమెరికా అధికారులతో తిరిగి చర్చలు ప్రారంభించే ప్రశ్నే లేదని ఇరాన్‌ తేల్చి చెప్పింది. దీంతో పాకిస్తాన్‌ నేతృత్వంలో జరుగుతున్న కాల్పుల విరమణ ప్రయత్నాలు నిలిచిపోయాయి. యుద్ధానికి 48 గంటల పాటు విరామం ఇద్దామంటూ ట్రంప్‌ చేసిన తాజా ప్రతిపాదనను కూడా ఇరాన్‌ తోసిపుచ్చింది. ఇజ్రాయిల్‌-అమెరికా సేనలను, గల్ఫ్‌ దేశాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ దాడులను ముమ్మరం చేస్తోంది. కువైట్‌లోని ఇంధన కేంద్రాలు సహా కీలక మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తోంది. చమురు సరఫరాలకు దీర్ఘకాల ఆటంకం ఏర్పడవచ్చునన్న అనుమానాల మధ్య వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోంది. అమెరికా యుద్ధ విమానాల కూల్చివేత, ఆచూకీ తెలియకుండా పోయిన పైలట్‌ కోసం జరుగుతున్న గాలింపు చర్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి.

గల్ఫ్‌పై భీకర దాడులు
ఇరాన్‌ దాడులతో గల్ఫ్‌ భీతిల్లుతోంది. దుబారులోని పలు భవనాలపై శకలాలు పడిన తర్వాత గల్ఫ్‌ దేశాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. బహ్రెయిన్‌లో సైరన్లు మోగించారు. సౌదీ అరేబియాలో పౌర రక్షణ హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్‌ ప్లాంట్లు, రిఫైనరీలు సహా కీలక మౌలిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు జరుపుతోంది. హార్ముజ్‌ జలసంధిపై సమర్థవంతమైన నియంత్రణ సాధించిన ఇరాన్‌…వేలాది నౌకల రవాణాను అడ్డుకుంటోంది. దీంతో పలు దేశాలు కాళ్లబేరానికి వస్తున్నాయి. నిత్యావసరాలను, మానవతావాద సాయాన్ని రవాణా చేస్తున్న నౌకలను ఇరాన్‌ అధికారులు అనుమతిస్తున్నారు.

అమెరికా – ఇజ్రాయిల్‌ ఇరాన్‌ అణు విద్యుత్‌ కేంద్రంపై దాడి
అమెరికా – ఇజ్రాయిల్‌ ఇరాన్‌పై క్షిపణి దాడికి పాల్పడింది. శనివారం దక్షిణ ఇరాన్‌లోని బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రం సమీపంలో అమెరికా – ఇజ్రాయిల్‌ క్షిపణి దాడికి పాల్పడింది. ఈ దాడి ఘటనలో ఒక భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇరాన్‌ వార్తా సంస్థ తస్నిమ్‌ వెల్లడించింది. ఈ దాడి వల్ల ప్లాంట్‌లోని ప్రధాన భాగాలకు నష్టం జరగలేదు. కానీ ఈ ప్లాంట్‌ సహాయ భవనం దెబ్బతింది అని మీడియా వెల్లడించింది. ఈ దాడికి ముందు ఇరాన్‌లోని నైరుతి ఖుజెస్తాన్‌ ప్రావిన్స్‌లోని మహ్‌షహర్‌ పెట్రో కెమికల్‌ జోన్లపై అమెరికా – ఇజ్రాయిల్‌లు వైమానిక దాడికి చేయగా.. ఐదుగురు గాయలపాలయ్యారు.

భారత్‌కు మరింత ఊరట
హార్ముజ్‌ దాటిన ఏడో ఎల్పీజీ నౌక
ఇంధన సరఫరాల విషయంలో భారత్‌కు మరింత ఊరట లభించింది. మన దేశానికి చెందిన పతాకంతో ఏడో ఎల్పీజీ నౌక ‘గ్రీన్‌ సాన్వీ’ హార్ముజ్‌ జలసంధిని దాటింది. అయితే ఇప్పటికీ 17 నౌకలు ఇరాన్‌ అనుమతి కోసం హార్ముజ్‌లో ఎదురు చూస్తున్నాయి. కాగా పర్షియన్‌ గల్ఫ్‌లో ఇరాన్‌ ఓడరేవుల వెలుపల కొన్ని నౌకలు అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయని తెలుస్తోంది. అనుమతి పొందడానికి ఈ నౌకలకు కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతాపరమైన సమస్యలే దీనికి కారణం. నిలిచిపోయిన నౌకలకు ఎప్పుడు అనుమతి లభిస్తుందనే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది.

సమయం మించిపోతోంది
48 గంటలే మిగిలింది.. : ఇరాన్‌కు ట్రంప్‌ వార్నింగ్‌
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు. వారితో ఒప్పందం చేసుకోవడానికి, హార్ముజ్‌ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ఇచ్చిన పది రోజుల గడువు దగ్గర పడిందన్నారు. సమయం మించిపోతోందని, విధ్వంసానికి 48 గంటల సమయమే ఉందంటూ ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. మరోవైపు అమెరికాకు చెందిన ఎఫ్‌-15 యుద్ధవిమానాన్ని ఇరాన్‌ కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగించినట్టు ఇరాన్‌ వెల్లడించింది. తమ గగనతలంపై పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్‌ సైన్యం పేర్కొంది.

చర్చలను తిరస్కరించలేదు..
మరోవైపు, పాకిస్తాన్‌లో చర్చలను తాము ఎన్నడూ తిరస్కరించలేదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి స్పష్టం చేశారు. ఈ విషయంలో టెహ్రాన్‌ వైఖరిని అమెరికన్‌ మీడియా తప్పుగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. అయితే, ఎటువంటి చర్చలైనా.. యుద్ధా నికి శాశ్వత ముగింపు పలికేలా ఉండాలని స్పష్టం చేశారు. అమెరికా షరతులు పెడుతుండటమే ఆందోళన కర అంశమని అబ్బాస్‌ అరాగ్చి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -