రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) వందేండ్లు (1925-2025) ఉత్సవాల్ని ప్రారంభిస్తూ ఈ దేశప్రధాని దేశ ప్రజలకు ఒక గొప్ప సందేశమిచ్చారు. ”స్వాతంత్య్ర పోరాటంలో ఆరెస్సెస్ వీరోచితంగా పోరాడిందనీ, ఎంతోమంది బలిదానాలు చేశారని” ఢంకా బజాయించారు. పదకొండేండ్లుగా ఆయన అలా బజాయిస్తున్నందు వల్లనే ఈ దేశ ప్రజలు ప్రేమగా అబద్దాల విశ్వగురువుగా కీర్తిస్తున్నారు. ఒకప్పుడు మాటి మాటికీ బ్రిటీష్ ప్రభుత్వపు – ఆ తర్వాత నెహ్రూ, ఇందిరా గాంధీ ప్రభుత్వాల కాళ్లవేళ్లా పడి క్షమాపణలు కోరుతూ వారి దయాదాక్షిణ్యాల మీద బతికిన ఆరెస్సెస్ వారు ఇప్పుడు చరిత్రను వక్రీకరించాలను కుంటున్నారన్న మాట! ఆ సందర్భంలోనే కావాలనే ప్రధాని అలా మాట్లాడారన్న మాట!! ఆ సందర్భంలోనే ఆయన విడుదల చేసిన వంద రూపాయల నాణాన్ని జాగ్రత్తగా గమనించండి. నాణెం మీద భారతమాత జాతీయ జెండాకు బదులు ఆరెస్సెస్ జెండా పట్టుకుని ఉంది.
కింద ఇంగ్లీషు స్పెల్లింగ్ గమనించండి. రాష్ట్రీయ స్వం – సేవక్ అని ఉంది. అందులో వై, ఎ – అక్షరాలు తప్పిపోయాయి. అందుకే స్వయం కాలేకపోయింది. అంటే దాన్ని ఎవరో ఎంటైర్ పొలిటికల్ సైన్స్‌లో ఎం.ఎ. డిగ్రీ సృష్టించుకున్న వాడే- ఇంగ్లీషు రానివాడే రాసి ఉంటాడు. ఇకపోతే, గత ఎన్నికల్లో ఓట్ల(చోరీ) – దొంగతనం భారీ ఎత్తున జరిగిందనీ, సి.సి.ఫుటేజ్ బయట పెట్టాలని రాహుల్ గాంధీ, ఇంకా ఇతర ప్రతిపక్షాలూ డిమాండ్ చేశాయి. దాంతో ఈ ఆరెస్సెస్-బీజేపీ- ఎన్డీయే కూటమి అక్రమంగా ఎలా అధికారంలోకి వచ్చిందో ప్రపం చానికి తేటతెల్లమయింది. మొన్న సుప్రీంకోర్టులో ఛీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై బూటు విసరడానికి ఒక లాయరు ప్రయత్నించడం వెనక తప్పక ఈ సంఘ్ పరివార్ కుట్ర దాగి ఉంది. ఈ సంఘటనను దేశం యావత్తూ ముక్తకంఠంతో ఖండిస్తూ ఉంది. సందర్భం వచ్చింది గనక, ఆరెస్సెస్ ఆవిర్భావం- స్వాతంత్య్ర పోరాటంలో దాని పాత్ర గురించి ఈ దేశ ప్రజలు తప్పక వాస్తవాలు మాట్లాడుకోవాలి! ఆ అవసరాన్ని ప్రధానే కల్పించారు మరి!! ఒక్కసారి చరిత్రపుటలు వెనక్కితిప్పి ఈ దేశానికి ఆరెస్సెస్ చేసిందేమిటో బేరీజు వేసుకుందాం!
దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులు భగత్‌సింగ్, సచ్చీంద్రనాథ్ సన్యాల్, చంద్రశేఖర ఆజాద్, సుఖ్‌దేవ్ థాపర్లు. వీరంతా కలిసి, నాటి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి 1928లో న్యూఢిల్లీలోని ఫిరోజుషా కోట్లలో ఒక విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఆర్‌ఏ) దీన్నే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ- అని కూడా వ్యవహరించేవారు. నాటి యువకులంతా ఎక్కువ సంఖ్యలో ఆకర్షింపబడి, ఇందులో భాగస్వాములయ్యేవారు. అలా సభ్యుడయిన వాడే కేశవ్ బలిరామ్ హెడ్గేవర్. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మనస్తత్వమున్న హెడ్గేవర్ త్వరలోనే తన బుద్ధి బయట పెట్టుకున్నాడు. తను ఉన్న హెచ్‌ఎస్‌ఆర్‌ఏ వివరాలన్నీ రహస్యంగా బ్రిటీష్ అధికారులకు చేరవేయడం ప్రారంభించాడు. ఆ రకంగా బ్రిటీష్ గూఢచారిగా మారిపోయాడు. నాటి బ్రిటీష్ వారి ప్రోద్బలంతో 27 సెప్టెంబర్ 1925న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) స్థాపించాడు. ఇది నాటి బ్రిటీష్ పాలకులకు అనుకూలంగా పనిచేయడానికి ఏర్పడిన సంఘం. హిందుత్వను బలపరచడం దాని ధ్యేయం. హెచ్‌ఎస్‌ఆర్‌ఏకు పూర్తి వ్యతిరేకం!
బ్రిటీష్‌కు వ్యతిరేకంగా ఎవరూ ఏవిధమైన ఉద్యమాలు చేయకుండా అరికట్టడం అనాటి ఆర్‌ఎస్‌ఎస్ విధి! అందువల్ల నాటి స్వాతంత్య్రోద్యమాన్ని దొంగదెబ్బ తీసినవాడు కేశవ్ బలరామ్ హెడ్గేవార్. దొంగే.. దొంగా దొంగా అని గగ్గోలు పెట్టినట్టు అనాటి నుంచి, ఈ నాటి వరకు ఇలాంటి దేశద్రోహులే తమని తాము దేశభక్తులుగా ప్రకటించుకుంటున్నారు. పైగా మిగతా వారెవరూ దేశభక్తులు కారని, అది తమకు మాత్రమే చెందిన పేటెంట్ హక్కు అయినట్టు వ్యవహరిస్తున్నారు. 9 ఆగష్టు 1925న జరిగిన ‘కకొరి రైలుదోపిడీ’కి సంబంధించిన విచారణలో హెడ్గేవర్ బ్రిటీష్‌వారికి పూర్తి సహకారం అందించాడు. రాంప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, రాజేంద్రనాథ్ లహరి, అశ్ఫఖుల్లా ఖాన్‌లకు 19డిసెంబర్ 1927న మరణ శిక్షలు పడడానికి కారణమయ్యాడు. మరో 16 మందికి దీర్ఘకాలిక జైలుశిక్షలు, మరో నలభై మందికి వివిధ శిక్షలు పడడానికి కారణమయ్యాడు. ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వానికి ఊడిగం చేసిన ఈ ఆర్‌ఎస్‌ఎస్ దేశభక్తులు నేడు దేశభక్తి మీద భాషణలిస్తున్నారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ప్రకటించిన మ్యానిఫెస్టో ”దరెవల్యూషనరీ” కకొరి కుట్రకేసులో బ్రిటీష్ వారికి ఒక సాక్య్షమైంది. మరణ శిక్షను అనుభవించిన బిస్మిల్, అశ్ఫఖుల్లాలు విప్లవకవులు. వీరి రచనల్ని భగత్‌సింగ్ అభిమానించేవాడు.
స్వాతంత్య్ర సమరంలోకి దూకి తమ ప్రాణాల్ని సైతం అర్పించడానికి సిద్ధపడ్డ భారతీయ యువకుల్ని అదుపు చేయడానికి వారి ధ్యేయాన్ని, గమ్యాన్ని మార్చడానికి హెడ్గేవర్ అనే ”దేశ భక్తుడు” చాలా శ్రమించాడు. అహింసా సిద్ధాంతంతో బ్రిటీష్ తుపాకి తూటాలకు సైతం భయపడక ఎదురొడ్డి నిలబడ్డ దేశప్రజల మనోధైర్యం ముందు హెడ్గేవర్- ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలు పని చేయలేదు. స్వాతంత్య్రం ప్రకటించబడింది!! మూడు రంగుల జెండాను జాతీయ పతాకంగా స్వీకరించడం జరిగింది. విధిలేక మొదటి సంవత్సరం జాతీయ జెండాను ఎగరేసిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ హెడ్గేవర్.. మరుసటి సంవత్సరం నుండి దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం ప్రారంభించాడు. ఆర్‌ఎస్‌ఎస్ అధికారిక పత్రిక ‘ఆర్గనైజర్’ 14 ఆగష్టు1947 సంచికలో ఈ విధంగా ప్రకటించారు. ”ఏదో అదృష్టం కలిసొచ్చి స్వాతంత్య్రం సాధించుకుకున్న వీరికి మరో ముఖ్యమైన విషయమేదీ కనబడలేదు. ఓమూడు రంగుల జెండాను జాతీయజెండాగా ఆమెదించుకున్నారు. ఆ జెండాను హిందువులు ఎన్నటికీ గౌరవించరు. మూడు అనే సంఖ్య చాలా అశుభమైంది. జాతీయ పతాకం మీద ఉన్న మూడు రంగులు దేశ ప్రజల మానసికస్థితి మీద తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపగలదు. ఫలితంగా దేశ భవిష్యత్తు దుర్భరంగా ఉంటుంది”- అని!
ఇన్నేండ్ల స్వతంత్ర భారత దేశంలో త్రివర్ణపతాకంతో దేశం ఎప్పుడూ ఎక్కడా కష్టాలు ఎదుర్కోలేదు. స్వతంత్రంగా గర్వంగానే నిలబడింది. ఇక కష్టాలంటే అవి ఆర్‌ఎస్‌ఎస్- బీజేపీల అనాలోచిత నిర్ణయాల వల్ల వచ్చినవే-వస్తున్నవే! జాతీయ జెండాపై వారి అభిప్రాయం అలా ఉంది కాబట్టే, ప్రధాని మోడీ ఒక యోగాడే సందర్భంగా జాతీయ జెండాతో చెమట తుడుచుకుని దేశాన్ని… దేశ ప్రజల మనోభావాల్ని అవమానపరిచారు. ఎంతైనా ఆయన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త కదా? హెడ్గేవర్ వారసత్వం ఎక్కడికి పోతుందీ? కేశవ్ బలరామ్ హెడ్గేవార్ తర్వాత మాధవ్ సదాశివ్(ఎమ్మెస్) గోల్వాల్కర్ సంఫ్‌ుచాలక్ బాధ్యతలు (1940) తీసుకున్నాడు. ఈయన హెడ్గేవర్ కన్నా మరో అడుగు ముందుకేశాడు. బ్రిటీష్ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తడంతో పాటు, దేశప్రజల మనసుల్లో విషబీజాలు నాటాడు. దేశంలో అత్యధికులు హిందువులు కాబట్టి, వారిని ఏకం చేయడం కోసం అల్పసంఖ్యాకుల పట్ల ద్వేషభావం వ్యాప్తి చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం దేశభక్తి కాదని, హిందూమతాన్ని, సంస్కృతిని పరిరక్షించుకోవడమే దేశభక్తి – అని నూరిపోశాడు.
దేశమంతా క్విట్‌ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతూ ఉంటే.. అందులో పాల్గొనగూడదని తన సంఘ్ పరివార్ సభ్యులకు గోల్వాల్కర్ పిలుపునిచ్చాడు. అది కొంతవరకు పనిచేసింది. ఫలితంగా ”1942లో బ్రిటీష్ వ్యతిరేక తిరుగుబాటును అణచివేయడంలో రాష్ట్రీయ స్వయం సేవకులు అందించిన తోడ్పాటు చాలా గొప్పది – అని నాటి బ్రిటీష్ ప్రభుత్వం బొంబాయిలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఒక ప్రశంసా పత్రం అందించింది-ఇవి చరిత్రలోని వాస్తవాలు! పుస్తకాలు చదివినా, ఇంటర్నెట్‌లో వెతికినా ఈ వివరాలన్నీ దొరుకుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆర్‌ఎస్‌ఎస్ – బీజేపీ ఆ మూల సూత్రాలతోనే పనిచేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆర్‌ఎస్‌ఎస్ చరిత్రను గ్రంథస్తం చేసిన సి.పి. బిషకర్ పుస్తకం చదివినా ఈ విషయాలన్నీ తెలుస్తాయి. హిట్లర్, ముస్సోలినీల భావజాలాన్ని సంఘ్ పరివార్ ప్రముఖులు ఇష్టపడే వారని తెలియజేసింది ఈయనే! గాంధీజీ హత్య నేపథ్యంలో 4 ఫిబ్రవరి 1948న ఆర్‌ఎస్‌ఎస్ రెండోసారి ఈ దేశంలో నిషేధానికి గురయ్యింది.
అప్పుడు- ”భారత రాజ్యాంగానికి విధేయులమై ఉంటామనీ, జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని” ప్రతిజ్ఞ చేసి, గోల్వాల్కర్ నేతృత్వంలో 11 ఏప్రిల్ 1949న నిషేధాన్ని ఎత్తి వేయాల్సిందిగా అభ్యర్థిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ ప్రాధేయపడింది. మూడునెలల తర్వాత నెహ్రూ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తేసింది. అయినా కూడా, తన ప్రతిజ్ఞకి తానే విలువ లేకుండా చేసుకున్న సంఫ్‌ు పరివార్, ఈ రోజుకు కూడా జాతీయ జెండాను గౌరవించదు. రాజ్యాంగానికి విరుద్ధంగా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉంది. దేశాన్ని ముక్కలు చేయడంలో ఆనాడు ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య భూమికను పోషించింది. విభజన తర్వాత కూడా దేశంలో అశాంతి నెలకొల్పుతూనే ఉంది. స్వాతంత్య్రోద్యమంలో కలిసి పోరాడిన హిందూ, ముస్లింల మధ్య ద్వేషాన్ని రగిలించి, మత కలహాలు సృష్టించింది. ప్రస్తుతం కూడా ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉంది. స్వాతంత్య్రం సాధించుకుని 77 ఏండ్లు పూర్తయినా ఆరెస్సెస్ మాత్రం అభివృద్ధి నిరోధక శక్తిగా నిలిచే ఉంది.
భారత రాజ్యాంగం పట్ల ఆరెస్సెస్‌కు ఎలాంటి అభిప్రాయ ముందో చూద్దాం! వారి అధికారిక పత్రిక ‘ఆర్గనైజర్’ 30 నవంబర్ 1949 నాటి సంచికలో ఇలా ప్రకటించుకుంది. ”భారత దేశానికి కొత్తగా రాజ్యాంగం రాయాల్సిన అవసరమే లేదు. పురాతన కాలంలో మనువు రాసిన గొప్పగొప్ప సూత్రాలు మనకు ఉండనే ఉన్నాయి. నేటి రాజ్యాంగంలో వాటి ప్రస్తావన లేకపోవడం విచారించదగ్గ విషయం. ప్రపంచానికి దారి చూపగల ‘మనుధర్మ శాస్త్రం’:- ఈరాజ్యాంగ నిపుణులకు కనీసం గుర్తుకురాకపోవడం – ఈ దేశం చేసుకున్న దౌర్భాగం!” అన్న ఆర్‌ఎస్‌ఎస్, అంతటితో ఆగలేదు-6 ఫిబ్రవరి 1950 నాటి సంచికలో ”హృదయాలను పరిపాలించే మనువు” శీర్షికతో ఒక వ్యాసం ప్రచురించింది. అందు లో ఇలా ఉంది – ”ఈ దేశంలో మనువుకు రోజులు చెల్లిపోయాయి – అని డా.బి.ఆర్. అంబేద్కర్ బొంబాయిలో అన్నట్టు తెలిసింది. కానీ, అది జరగని పని! దాన్ని జరగనివ్వం కూడా!! ప్రతి హిందువు మనసులో మనువు ఎల్లప్పుడూ ఉంటాడు. మనువు సూత్రాలు జనజీవితంలో కొనసాగుతాయి. శూద్రులు కూడా మనువును పూజిస్తారు. సమానత్వం గనక ఆచరణలోకి వస్తే, దేశం బలహీనపడుతుంది. వ్యక్తులు దుర్బలులవుతారు.”
26 జనవరి 1950న రాజ్యాంగాన్ని ఆమోదించిన సంద ర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ”మన రాజ్యాంగం దేశంలో సమానత్వాన్ని సాధిస్తుంది” అని అన్నందుకు ఆర్‌ఎస్‌ఎస్‌పై విధంగా స్పందించింది. రాజ్యాంగ వ్వతిరేకతను బాహాటంగా ప్రకటించింది. తమకు మనుధర్మ శాస్త్రమే అనుసరణీయమని చెప్పుకుంది. అందుకే చూడండి. బలహీన వర్గాలు ఆర్‌ఎస్‌ఎస్ కోసం ఎన్ని త్యాగాలు చేసినా, దాని అధినేతలుగా కేవలం బ్రాహ్మణులే కొనసాగుతూ ఉండడం ఇప్పటికీ మనం చూస్తున్నాం. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకుండా పాల్గొనే వారిని అడ్డగించి, ఎంతోమంది దేశ భక్తుల మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ఆర్‌ఎస్‌ఎస్ వారు, తమకు తాము దేశ భక్తులమని ప్రకటించుకోవడాన్ని ఈ దేశప్రజలు..అంగీకరిస్తారా? గాంధీజీ హంతకుడికి తమ సంస్థకు ఎలాంటి సంబంధమూ లేదని ఆనాడు ప్రకటించుకుని, తర్వాత కాలంలో మరి ఎందుకు నాథూరామ్ గాడ్సేను ఆరాధిస్తున్నారూ?
ఇవన్నీ చూస్తే, దేశంలో హిందుత్వ ఉగ్రవాదం పెచ్చరిల్లిపోవడానికి, దేశ ఆర్థికప్రగతి దిగజారుతూ పోవడానికి, అతి పెద్ద ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోవడానికీ ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీలే కారణమని ఈ దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. తీవ్రవాదులు, దేశద్రోహులూ కలిసి తమకు.. తాము ‘దేశభక్తులుగా ప్రకటించుకుంటూ ఉంటే అసహ్యంగానూ, వికారంగానూ ఉంది. పైగా దేశభక్తులెవరన్నది వాళ్లే నిర్ణయిస్తూ ఉండడం వికృతాలలో కెల్లా వికృతం, వీళ్లు దేశభక్తి – అనే పదానికే అర్థం మార్చేశారు. వారి కుట్రలను ఛేదించడం ఈ దేశ ప్రజల తక్షణ కర్తవ్యం! భిన్నత్వంలో ఏకత్వం సాధించుకున్న ఈ దేశం, తన అస్తిత్వాన్ని కోల్పోకముందే దేశప్రజలు అప్రమత్తులై సమాయత్తమవ్వాలి. ఈ దేశాన్ని సర్వహిత, సమభావంతో సమున్నతంగా నిలుపుకోవాలి! తప్పదు.
రచయిత: సుప్రసిద్ధ సాహితీవేత్త,జీవశాస్త్రవేత్త
డాక్టర్ దేవరాజు మహారాజు