Saturday, December 20, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కాంగ్రెస్‌లో కొలువుల జాతర..

కాంగ్రెస్‌లో కొలువుల జాతర..

- Advertisement -

కార్పొరేషన్లలో ఖాళీల భర్తీకి సీఎం నిర్ణయం
ముఖ్యమంత్రితో మీనాక్షి నటరాజన్‌, భట్టి, మహేశ్‌ కుమార్‌ భేటీ
56 చైర్మెన్‌ పోస్టుల్లో 25 పదవులను నింపుదాం
కష్టపడే వారికి ఫలితం దక్కుతుందనే సంకేతాలిద్దాం
వారంలోగా భర్తీ చేసేందుకు యోచన

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌లో కొలువుల జాతరకు రంగం సిద్ధమైంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల గెలుపు జోష్‌లో ఉన్న అధికార పార్టీ… త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. పంచాయతీ పోరులో ప్రజలు తమకు అనుకూలంగా అత్యధిక పల్లెల్లో తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇదే ఊపులో… మిగతా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి, అక్కడ కూడా పట్టు సాధించాలనే వ్యూహంతో ఉంది. ఈ క్రమంలో పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ, పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికి తగు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా తట్టుకుని నిలబడ్డ వారిని గౌరవించాలని సీఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. అలాంటి నాయకులకు తగు ప్రాధాన్యతనిచ్చి, పదవులనివ్వటం ద్వారా క్యాడర్‌లో జోష్‌ నింపాలని ఆయన నిర్ణయించారు.

తద్వారా పని చేసే వారికి కచ్చితంగా పదవులు వస్తాయనే సంకేతాలను బలంగా పంపాలంటూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో పాటు ఇతర సీనియర్లకు తాజాగా సూచించారు. ఇలాంటి సంకేతాలను గ్రామ స్థాయి వరకు పంపగలిగితే రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు మరింత కష్టపడి పని చేస్తారని ఆయన దిశా నిర్దేశం చేశారు. ఇదే జరిగితే ఆ ఎన్నికల్లో కూడా పార్టీ పరంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవచ్చంటూ మార్గదర్శనం చేసినట్టు సమాచారం. కార్పొరేషన్‌ పదవులు, వాటి భర్తీపై చర్చించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌ రెడ్డి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటికి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం ప్రత్యేక సలహాదారుడు వేం నరేందర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఖాళీగా ఉన్న కార్పొరేషన్‌ చైర్మెన్ల పోస్టుల జాబితాను, ఆశావహుల లిస్టును పీసీసీ చీఫ్‌.. సీఎంకు అందజేశారు. మొత్తం 56 కార్పొరేషన్‌ చైర్మెన్ల పోస్టులు ఖాళీగా ఉండగా.. వాటిలో 25 పోస్టులను భర్తీ చేయాలంటూ సీఎం ఈ సందర్భంగా సూచించినట్టు తెలిసింది. ఆశావహుల జాబితాలో కొన్ని పేర్లకు టిక్కు కొట్టిన ఆయన.. ఏయే కార్పొరేషన్లను ఎవరెవరికి కేటాయించాలనే దానిపై కూడా సూచనలు, సలహాలను ఇచ్చినట్టు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. నింపాలనుకున్న 25 చైర్మెన్‌ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలంటూ సీఎం సూచించారు. కాగా శనివారమే సంబంధిత ఉత్తర్వులను విడుదల చేద్దామనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైందని ఓ సీనియర్‌ నేత తెలిపారు. అయితే ముహూర్తం మంచిగా లేని కారణంగా శనివారం జీవోలు విడుదల చేయొద్దంటూ కొందరు కోరినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం తర్వాత ఎప్పుడైనా ఎప్పుడైనా ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశముంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -