Sunday, October 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఉద్యోగం బాధ్యతే కాదు..భావోద్వేగం

ఉద్యోగం బాధ్యతే కాదు..భావోద్వేగం

- Advertisement -

తెలంగాణ రైజింగ్‌ 2047లో భాగస్వాములు కండి
ప్రజల నమ్మకాలు, ఆశయాలకనుగుణంగా పని చేయండి
తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతంలో కోత
గత ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచింది
శ్రీకాంతాచారి, యాదయ్యల బలిదానాలను సొమ్ముచేసుకుంది
15 ఏండ్ల పాటు ఒక్క గ్రూప్‌ పోస్టును భర్తీ చేయలేదు
మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలిచ్చాం
సెంటిమెంట్‌ రగిల్చి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు : గ్రూప్‌-2 విజేతలకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”ఉద్యోగం బాధ్యత మాత్రమే కాదు.. భావోద్వేగం..నేడు నియామక పత్రాలు అందుకుంటున్న మీరంతా ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ను ముందుకు నడిపించండి. మూడు ట్రిలియన్ల ఆర్థిక లక్ష్యాన్ని ఛేదించే యత్నంలో భాగస్వాములు కండి. అప్పుడు నేనున్నా లేకున్నా మీరంతా ఉంటారు. సర్కార్‌ నిర్ణయాలకనుగుణం గా నిబద్ధతతో పని చేయండి” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌ లోని శిల్ప కళావేదికలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..”ఈ వేదికను పంచుకుంటున్న మీరందరూ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసిన వారే. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన పోరాటంలో ఎందరో అమరులయ్యారు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, ఈషాన్‌రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. యూనివర్సిటీల్లో ఉంటూ వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆనాటి రాజకీయ పార్టీల నాయకులు.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలను, తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షను ఆయుధంగా మార్చుకొని పదేండ్లు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించారు. కానీ, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. 15 సంవత్సరాల పాటు గ్రూప్‌-1 నియామకాలను చేపట్టలేదు. తాము అధికారం చేపట్టిన వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం. మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలిచ్చాం.

త్వరలో గ్రూప్‌-3, గ్రూప్‌-4 ఉద్యోగాలను భర్తీ చేస్తాం” అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పోరాటాలు, బలిదానాలతో సిద్దించిన తెలంగాణ ఆకాంక్షలను గత ప్రభుత్వం సొమ్ము చేసుకుందని విమర్శించారు. ”వాళ్ల కుటుంబ సభ్యులు, బంధు వర్గాన్ని ధనవంతుల్ని చేయటం కోసమే పాలన సాగింది. ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం..కూలేశ్వరం అయ్యి ఉండేది కాదు. రూ.లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు మూడేండ్లకే కూలిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఫామ్‌హౌస్‌లో ఎకరా పంటపై రూ.కోటి ఆదాయం వస్తుందని ఒక పెద్దాయన చెప్పారు. ఎకరాపై రూ.కోటి ఆదాయం వచ్చే విద్యను యువత, ప్రజలకు ఎందుకు చెప్పలేదు. తమ అవసరం కోసం ఏదైనా చెప్పడం వారికే చెల్లింది” అని సీఎం విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు..
ప్రభుత్వ పాఠశాలలో చదవిన నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీ ఆశీర్వాదాలే కారణమని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ”రూ.3 కోట్లు తీసుకుని గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చారని గత పాలకులు ఆరోపణలు చేశారు. పేదింటి బిడ్డలు రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా? కష్టపడి చదివిన వారిని అవమానించేలా మాట్లాడారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం చిత్త శుద్ధితో ముందుకు పోతుందని స్పష్టం చేశారు. 30 ఏండ్ల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ముగింపు పలికామన్నారు. దేశంలోనే మొదటి సారిగా కులగణన చేయడంతో… జనగణనతో పాటు కులగణన చేసేలా కేంద్రానికి తప్పనిసరి పరిస్థితి కల్పించామని అన్నారు. ”కొత్తగా ఉద్యోగంలో చేరిన మీరందరూ తెలంగాణ పునర్‌ నిర్మాణంలో భాగస్వాములు కండి. మీరు, మేము వేరు కాదు.. మీరే మేము.. మేమే మీరు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్‌ 1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశాం.

గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్‌ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి వ్యవస్థ మాకు లేదు. మా వ్యవస్థనే మీరు. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు మీరు సామాన్యులు. ఈ రోజు నుంచి అధికారులు. మీ వద్దకు వచ్చే నిస్సహాయులకు సాయం చేయండి. వారి సమస్యలను పరిష్కరించండి. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. అదే సందర్భంలో మీ కుటుంబ బాధ్యతను మరవొద్దు. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు.

వారిని మరిచిపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. మీ జీతం నుంచి 10 నుంచి 15 శాతం వారికి ఇచ్చేలా త్వరలో చట్టం తెస్తాం” అని సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి కొత్తగా ఎంపికైన అధికారులను సభ్యులుగా చేర్చి కమిటీ వేయాలని సీఎస్‌ రామకృష్ణారావుకు సూచించారు. ”గత పాలకులు సెంటిమెంట్‌ను రగిల్చి తిరిగి అధికా రం పొందేందుకు కుట్రలు పన్నుతున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారు. హాస్టళ్లలో విద్యార్థు లకు ఫుడ్‌ పాయిజన్‌ అయితే వాళ్లు పైశాచిక ఆనంద ం పొందుతున్నారు. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్‌ పాయిజన్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి. సమర్థవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలి” అని సీఎం వారికి దిశానిర్దేశం చేశారు.

నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం: భట్టి
కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే విషయం మరోసారి రుజువైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఒకేసారి గ్రూప్‌-2కు చెందిన 783 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడం దేశ చరిత్రలో మొదటి సారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడ్డా ఉద్యోగాల నియామకాల్లో వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా అనేక ప్రణాళికలు రచించామని భట్టి పేర్కొన్నారు.

అందులో భాగంగానే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు, స్కిల్‌ యూనివర్సిటీ లాంటి ఆధునిక విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అటు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రయివేటు, కార్పొరేట్‌ ప్రపంచంలో తెలంగాణ ప్రతిభ వెలుగొందాలనేదే తమ సర్కార్‌ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, హర్కర వేణుగోపాల్‌, వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌ రెడ్డి, అద్దంకి దయాకర్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న పిట్ట కథ
గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన పిట్ట కథ ఆకట్టుకుంది. ” త్రిలింగ దేశమనే రాజ్యానికి రాజు చంద్రసేనుడు. అతనికి కుమారుడు రామసేనుడు, అల్లుడు హరిసేనుడు ఉన్నారు. రామసేనుకి ఒకటే కోరిక… ఎలాగైనా అధికారంలోకి రావాలని… అందుకోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన అధికారానికి తన బావ హరిసేనుడు అడ్డుగా ఉన్నాడని భావించి ఓ ఊడల మర్రి చెట్టుకింద కఠోర తపస్సుకు ఉపక్రమించాడు. విషయం తెలుసుకున్న హరి సేనుడు కూడా అదే మర్రి చెట్టు మీద కూర్చుని తపస్సు ప్రారంభించాడు. దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకో అనడంతో తెలివిగల హరి సేనుడు తన ఒక కన్ను తీసేయన్నాడు.

అలాగే చేసిన దేవుడు చెట్టు కింద కూర్చున్న రామసేనుడి దగ్గరికెళ్లి ఆయననూ వరం కోరుకోమన్నాడు. వెనకా ముందు ఆలోచించకుండా రామసేనుడు మా బావకు ఏ వరం ఇచ్చారో నాకు రెండు రెట్లు ఇవ్వాలని కోరాడు. హరి సేనుడు ఒంటి కన్ను పోగొట్టుకుంటే, రామ సేనుడు రెండు కండ్లు పోగొట్టుకున్నాడు. దాంతో దిక్కుతోచని స్థితిలో వారు పెద్దల సలహా అడిగారు. వారు చెప్పిన ప్రకారం గుడి, మజీదు, చర్చిల ముందు అడుక్కోవడానికి వస్తున్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి” అని సీఎం తన కథను ముగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -