Saturday, October 11, 2025
E-PAPER
Homeజాతీయంప్రతిపక్షం లేకుండానే పార్లమెంట్‌ సంయుక్త కమిటీ?

ప్రతిపక్షం లేకుండానే పార్లమెంట్‌ సంయుక్త కమిటీ?

- Advertisement -

అవకాశాలను పరిశీలిస్తున్న మోడీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : జైలులో ఉన్న మంత్రుల పదవీచ్యుతికి సంబంధించి గత పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టిన మూడు బిల్లులను పరిశీలించడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కమిటీకి ప్రతిపక్ష పార్టీలు ఇంకా తమ సభ్యులను నామినేట్‌ చేయలేదు. దీంతో ఎన్డీఏ సభ్యులు, కొన్ని చిన్న చిన్న పార్టీలకు చెందిన ఎంపీలు, స్వతంత్రులతోనే కమిటీని ఏర్పాటు చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. సభ్యులను నామినేట్‌ చేయాల్సిందిగా ప్రతిపక్ష పార్టీలకు అనేక సార్లు గుర్తు చేశామని, అయితే సంయుక్త కమిటీకి సభ్యులను నామినేట్‌ చేస్తారా లేక దానిని బహిష్కరిస్తారా అనే విషయాన్ని ఆ పార్టీలు ఇంకా స్పీకర్‌కు తెలియజేయలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

ఆగస్టు 20వ తేదీన తీవ్ర గందరగోళ దృశ్యాల నడుమ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లు, జమ్మూకాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లుల ప్రకారం ఏ మంత్రి అయినా…ప్రధాని కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర రాష్ట్ర మంత్రులు కావచ్చు…కనీసం ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశమున్న నేరాల్లో అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే పదవులు కోల్పోతారు.

భిన్నాభిప్రాయాలు
ఈ బిల్లుల్ని రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. బిల్లుల్ని అధ్యయనం చేసేందుకు పార్లమెంట్‌ సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చేసిన ప్రకటనపై ప్రతిపక్షాల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కమిటీలో చేరాలని వామపక్షాలు భావిస్తుండగా తాము బషిష్కరిస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించాయి. కాంగ్రెస్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ కమిటీ ఓ ఫార్స్‌ అని తృణమూల్‌ వ్యాఖ్యానించింది. కాగా కమిటీలో చేరే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. ఇండియా కూటమిలోని ఇతర పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయానికి వస్తామని తెలిపారు.

విశ్వసనీయత ఏముంటుంది?
ప్రతిపక్షాలు లేకుండా సంయుక్త కమిటీని ఏర్పాటు చేయడం అసాధారణమే అవుతుంది. ప్రతిపక్షాలు లేని కమిటీ విశ్వసనీయత మసకబారుతుందని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ పీడీటీ చారి తెలిపారు. ‘స్పీకర్‌ నామినేట్‌ చేసే సభ్యులందరితో కమిటీ ఏర్పడుతుంది. స్పీకర్‌ ఇప్పటి వరకూ ఈ కమిటీకి ఎవరినీ నామినేట్‌ చేయలేదు. సంఖ్యాబలం ఆధారంగా వివిధ పార్టీలకు చెందిన సభ్యులు కమిటీలో ఉండాలి. అందువల్ల పాక్షిక కమిటీని స్పీకర్‌ ఏర్పాటు చేయలేరు. కేవలం అధికార కూటమి నుంచే కమిటీలో సభ్యులు ఉంటే దానిని పూర్తి స్థాయి కమిటీగా చెప్పలేము. కీలక ప్రతిపక్ష పార్టీల నుంచి సభ్యులెవరూ లేనప్పుడు కమిటీకి విశ్వసీయత ఉండదు’ అని ఆయన వివరించారు. అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సంయుక్త కమిటీకి సభ్యుల్ని నామినేట్‌ చేసేలా నచ్చచెప్పాలని స్పీకర్‌కు ఆచారి సూచించారు. దీనివల్ల అసాధారణ పరిస్థితిని నివారించవచ్చునని చెప్పారు. ఏకాభిప్రాయంతోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -