పండుగ అంటే ఒక ఆత్మీయ కలయిక. జ్ఞాపకాల గీతాలాలపించే పిల్లనగ్రోవి. ధనుర్మాసం మొదలవగానే పల్లెలన్నీ సంక్రాంతి శోభలను సంతరించుకుంటాయి. మన పండుగలు అన్ని ప్రకతితో మమేకమయి ఉంటాయి. వరి పంటకు కోతలు, నూర్పిడి అయిపోయి, ధాన్యాన్ని ఇంటి గాదెలలో నింపుకుంటూ, కష్టఫలితం చేతికొచ్చిన ఆనందంలో రైతులు జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి.
అందుకే సంక్రాంతిని తెలుగు నాళ్ళలో పెద్ద పండుగగా భావిస్తారు. ఇంటి నిండా బంధువులు, గుమ్మాలకు పచ్చని తోరణాలు, ముంగిళ్ళలో ముగ్గులు, హరిదాసు కీర్తనలు, కొత్త బట్టలు, కోడిపందేలు, కోలాటాలు, గంగిరెద్దుల సన్నాయిలు, గాలిపటాలు, పొట్టేళ్ల పందాలు, కోలాటాలే కాక అరిసెలు, కారప్పూస, జంతికలు, గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహోర అన్నీను.
సంక్రాంతి పండుగ అంటే పల్లె ప్రజలకు ఒక ఆనందమైన అనుభూతి. చదువుల కోసమో, ఉద్యోగం కోసమో వెళ్ళిన పిల్లల రాకతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. అత్తగారింటికి వెళ్లిన కూతుళ్ళు భర్తతో కూడి పుట్టింటికి వస్తుంటారు. కొత్త అల్లుళ్ల, బావ-మరదళ్ళ సరదాలతో ఇల్లు కోలాహలంగా ఉంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజులపాటు ఈ వేడుక జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం సూర్యుడు నెలకు ఒక రాశి మారతాడు. అంటే ఏడాదిలో నెలకొక రాశి చొప్పున పన్నెండు రాశులలోకి మారతాడు. ఇలా కొత్త రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటాము. అయితే పుష్య మాసంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రమణాన్ని మాత్రం మనం సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము. ముంగిట్లో ఆవుపేడతో కల్లాపి చల్లుతారు. గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. ద్వారాలకు మామిడి తోరణాలు కడతారు. అందాల రంగవల్లుల మధ్య బంతి, గుమ్మడి పూలతో అలంకరించుకున్న గొబ్బెమ్మలు మంచు దుప్పటి తెరతీసి వెలుతురు బాట పరుస్తుంటాయి. వీణలు మీటుతూ అక్కడక్కడ హరిదాసు సంకీర్తనలు వీనుల విందుగా వినిపిస్తూ ఉంటాయి.
సంవత్సరం అంతా ఎప్పుడూ కనిపించని హరిదాసులు, గంగిరెద్దు మేళాలు వంటి గాయక భిక్షవులు ఈ పండుగ రోజులలో మనకు దర్శనం ఇస్తారు. బుడబుక్కల వాళ్ళు, పగటి వేషగాళ్ళు, పిట్టలదొరలు, కాటికాపరులు ఇంకా ఎందరెందరో జానపద కళాకారులు ఈ పండుగ రోజులలో సందడి చేస్తుంటారు.
పట్టణాలలో పండుగ సెలవులకు తమ ఊరికి తరలి వెళ్లే వారితో రహదారులన్నీ నిండి ఉంటాయి. పట్టణాలు పల్లెకు పయనం అవుతాయి.

డుడు.. బసవన్న
ఎద్దులతో సహవాసం చేయడం పంట భూముల్లో ఒక విధంగా ఉంటుంది. అదే ఎద్దును మచ్చిక చేసుకోవడం మరోలా ఉంటుంది. మామూలుగా అయితే అది కాళ్లతో తొక్కినా, కొమ్ములతో కుమ్మినా మన ప్రాణాలకే ప్రమాదం. కానీ ఓర్పుగా దానిని మచ్చిక చేసుకున్నప్పుడు అది తన బరువైన శరీరాన్ని సైతం తేలిక పరుచుకొని అనేక రకాల నాట్య విన్యాసాలను ప్రదర్శిస్తుంది.
కోడె గిత్తలను తీసుకువచ్చి వాటిని మచ్చిక చేసుకొని, ముక్కుతాడు బిగించి వాటికి రకరకాల నత్య విన్యాసాలు నేర్పుతారు. డోలు సన్నాయి వంటి వాయిద్యాల లయకు అడుగుణంగా అది ఆడేలా చూస్తారు. ముందు కాళ్లు ఎత్తి సలాం చేయటం, మాటలకు తలను ఊపటం వంటివి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. వాటికి అద్దాలతో మెరిసే బట్టలను బొంతలుగా కుట్టి దాని మూపూరం నుంచి తోక వరకు కప్పుతారు. కొమ్ములకు ఇత్తడి తొడుగులు తొడుగుతారు. నుదురు భాగంలో కుచ్చులు, మూతికి తోలుతో కుట్టిన ‘శిఖమారు’ కడతారు. పూసల దండలు, చమ్కీ కాగితాలతో అలంకరిస్తారు. కాళ్లకు చిరుగజ్జెలు, మెడలో గంట కట్టి నందీశ్వరుని స్వరూపంగా బసవన్నను కొలుస్తారు.
ఇదివరకు ఊరి మధ్యలోగానీ, నాలుగు రోడ్ల కూడలిలోగాని ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి ఆ ఇంటి గహపతులను పొగుడుతూ ధాన్యము, బట్టలు, డబ్బులు తీసుకుంటున్నారు. ఈ లోకంలో మనిషైనా, పశువైనా ఆహారం కోసం అనేక విధాలుగా జీవితం గడపడం అనివార్యం అనే సందేశం మనకు ఇక్కడ కనిపిస్తుంది.
గంగిరెద్దులాట గురించి తెలియాలి అంటే పల్లా దుర్గయ్య రాసిన ‘గంగిరెద్దు’ కావ్యం లో తమ జీవిక కోసం పడే అవస్థలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. గంగి అంటే పూజనీయమైనది అని అర్థం. గంగిగోవుతో పాటు గంగిరెద్దును కూడా పూజనీయమైనదిగా భావిస్తాము. శతాబ్దాల చరిత్ర గల ఈ గంగిరెద్దుల ఆట ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.

రంగవల్లులు
పండుగ రోజుల్లో ఇంటి ముంగిట ముగ్గులు హరివిల్లు వర్ణాలు పులుముకుంటాయి.
వీటిలో చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, మెలికల ముగ్గులు వంటి రకరకాల ముగ్గులు ఉంటాయి. శ్రీకష్ణదేవరాయల ఆముక్తమాల్యద, శ్రీనాథుని పల్నాటి వీరచరిత్ర వంటి కావ్యాలలో కూడా ఈ ముగ్గుల ప్రసక్తి వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాలలో మహిళలకు ముగ్గుల పోటీలు పెడుతుంటారు.
ఆవు పేడను క్రిమిసంహారిణిగా భావిస్తారు. కళ్ళాపి చల్లి సూక్ష్మ క్రిములను ఇంట్లోకి రానివ్వకుండా చేస్తారు. బియ్యప్పిండితో ముగ్గు వేయటం వల్ల ఉడుతలు, చీమలు వంటి వాటికీ ఆహారం అందుతుంది. పిచ్చుకలు వంటి వాటికోసం గుమ్మాలకు వరికంకుల్ని కడతారు. సున్నపురాయితో వేసిన ముగ్గుకు గాలిలోని కార్బన్డయాక్సైడ్ ను పీల్చేగుణం ఉండటం వల్ల పరిసరాలలోని గాలి శుభ్రపడుతుంది.
సంక్రాంతి సమయానికి రైతులకు పంట ఇంటికి వస్తుంది. ఇల్లంతా ధాన్యంతో కళకళలాడుతూ ఉంటుంది. కొత్త బియ్యంతో చేసిన పిండి వంటలు ఆరోగ్యానికి మంచిది. ఈ పండుగకు ముఖ్యంగా తడి బియ్యప్పిండి, బెల్లం, నువ్వులు చేర్చి అరిసెలు తయారు చేస్తారు. అవి ఒంటికి శక్తినివ్వడంతో పాటు చలికాలాన్ని తట్టుకోగల శక్తిని శరీరానికి అందిస్తాయి. ఈ పండుగ సమయంలో చేసుకునే పరమాన్నం పులిహౌర, కలగూరపులుసు వంటివి కూడా ఆరోగ్యవంతమైనవే. ఈ పండుగకు వండే పిండి వంటల్లో ఎక్కువగా నువ్వులను వాడుతుంటారు. వైద్యశాస్త్రం ప్రకారం చలికాలంలో నువ్వులను తినటం మంచిది.
విష్ణు దాసులు ఈ హరిదాసులు
నుదుట ఊర్ధ్వపుండ్రం, తలపాగాపై కదలకుండా అమర్చిన అక్షయపాత్రతో తంబురా వాయిస్తూ, చేతుల్లో చిడతలు వాయిస్తూ, కాళ్లకు చిరుగజ్జెలు, పంచెకట్టుతో కూడిన హరిదాసు వేషధారణ చూడముచ్చటగా ఉంటుంది. ”హరి.. హరిలో రంగహరి” అంటూ ఒకసారి తమ ఇంటి దగ్గర నుండి మొదలుపడితే వారు తమ కీర్తనలను, పదనర్తనలను ఆపరు. అంతటి భక్తిశ్రద్ధలను ప్రదర్శిస్తారు. హరిదాసుని అక్షయపాత్రలో బియ్యం వేయడానికి బాలబాలికలు పోటీ పడుతుంటారు. భక్తి గీతాలను ఆలపిస్తూ ఇల్లిల్లు తిరుగుతుంటారు.
జన సందోహం పెరిగిపోయి, విపరీతంగా విస్తరించిన నగరాలలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తిరగడానికి ఇప్పుడు హరిదాసులు మోటారు వాహానాలను ఉపయోగిస్తున్నారు. రానురాను ఈ కళ పట్ల ఆదరణ తగ్గటం వల్ల జీవనభతి కష్టంగా ఉండటంతో చాలామంది వత్తిని మానేస్తున్నారు.
సంక్రాంతి కోలాటాలు
ఈ పండుగ వేళల్లో ప్రదర్శించబడే మరొక ముఖ్యమైన జానపద కళారూపం కోలాటం. కోల అంటే కర్ర. కర్రతో ఆడే ఆట కోలాటం. యువకులు, మహిళలు బృందాలుగా చేరి రెండు చేతుల్లో చిన్న కర్రలను పట్టుకొని ఒక కర్రను మరొక కర్రతో తడుతూ, వలయాకారంలో తిరుగుతూ, లయబద్ధంగా పాటలు పాడుతూ, ఆడుతుంటారు. ఈ పాటలలో ఎక్కువగా శ్రీకృష్ణుడి లీలలు లేదా జానపద కథలు ఉంటాయి. ఇది కేవలం వినోదమే కాకుండా, వ్యాయామం, భక్తి కలయికగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా భోగిమంటల దగ్గర లేదా పండుగ రోజు సాయంత్రం దేవాలయాల దగ్గర ఈ కోలాటాలు ప్రదర్శిస్తూ ఉంటారు.

భోగభాగ్యాల భోగి
సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటాము. భోగి రోజు అంటే దక్షణాయనంలో చివరి రోజని అర్థం. ఆరోజు వేసుకునే భోగి మంటలు కేవలం చలిమంటలే కాదు శీతాకాలన్నీ ఎదిరించే నూతన ఉత్తేజాన్ని కలిగించేవి. ఆ రోజు ఇళ్లలో పేరుకుపోయిన కలప సామాన్లు, చీపుళ్లను, తట్టలను తగలబెట్టి నూతన జీవితానికి కొత్తగా నాంది పలుకుతారు. భోగి రోజు భోగిమంటలు వేసి వాటి చుట్టూ తిరుగుతూ నత్యాలు చేస్తారు.
భోగిమంటలలో చలికాచుకునేటప్పుడు ఇంటిలోని పాత సామాన్లను అందులో వేయడానికి వస్తు ప్రేమను అధిగమించాలని కూడా.
భోగి మంటలలో రాగి కాగులపెట్టి నీటిని కాచుకొని వాటితో ఇంటిల్లిపాది తలంటు పోసుకుంటారు. అలా చేయడం ఆరోగ్యకరం అని భావిస్తారు.
భోగి రోజున పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. రేగుపళ్ళలో, పూలరేకులు, నాణేలు కలిపి పిల్లల తలపై పోస్తారు. స్తోమత కలవారు మూడు బంగారు రేగుపళ్ళను, మూడు వెండి చెరుకు ముక్కలను కలిపి పోస్తారు. ఇలా చేస్తే బాల్యరిష్టాలు తొలగుతాయని నమ్ముతారు. భోగి పండుగ నాడు గుమ్మడికాయ వంటకాలు ప్రత్యేకం. ఈ పండుగ రోజులలో కొందరు బొమ్మల కొలువును పెట్టుకుంటారు.
పుణ్య స్నానాలు
మకర సంక్రాంతి పండుగ రోజు నదులలోనూ, సముద్రాలలోను పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. భగీరథుడు గంగానదిని భూమికి రప్పించినది ఈ రోజేనని నమ్ముతారు. ఈ కాలంలో నదీనదాలలోని నీటి ఉష్ణోగ్రతలు తగుమాత్రంలో ఉండి శరీరానికి ఇబ్బంది కలిగించవు. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు కూడా చర్మానికి ప్రమాదం కలిగించని స్థాయిలో ఉంటాయి. సముద్ర స్నానం వలన ముఖ్యంగా రెండు ఉపయోగాలు ఉన్నాయి. సముద్రంలోని లవణాలతో శరీరం శుద్ధి అవుతుంది. సూర్యుని నుంచి లభించే విటమిన్ డి ఎన్నో చర్మవ్యాధులకు, కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది.
గొబ్బియల్లో.. గొబ్బియల్లో
ఈ నెల రోజులు తెల్లవారకముందే నిద్రలేచి ఇంటి ముంగిలిలో కళ్లాపి చల్లి అందమైన ముగ్గులు వేస్తారు. ఈ పండుగ రోజుల్లో కన్నెపిల్లలు తలార చన్నీటి స్నానాలు చేసి సాంప్రదాయ దుస్తులతో ముస్తాబవుతారు. ఆవు పేడతో తయారుచేసిన గొబ్బెమ్మలను మూడు, ఐదు, తొమ్మిది వరుసలలో సిద్ధం చేసుకుని వాటికి పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేస్తారు. వాటిని ఇంటి వాకిట్లో ఉన్న ముగ్గు మధ్య పెట్టి పూజ చేస్తారు. ఆ తర్వాత అందరూ చుట్టూ చేరి తిరుగుతూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ నత్యం చేస్తారు. కొందరు గొబ్బెమ్మలను గౌరీదేవిగా మంచి భర్తను ప్రసాదించమని కోరుకుంటే, మరికొందరు లక్ష్మదేవిగా తమ ఇంట కొలువై సర్వసుఖాలను అందించమని కోరుకుంటారు.
కొన్నిచోట్ల ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మ పెట్టి, దానిని కష్ణునిగా, చుట్టూ ఉన్న చిన్న గొబ్బెమ్మలన్నీ గోపికలుగా భావిస్తారు. కన్నెపిల్లలు, ముత్తైదువులు కలిసి పేరంటం జరుపుకుంటారు. దసరా సందర్భాలలో బతుకమ్మలను పేర్చి చుట్టూ తిరుగుతూ ఆడి పాడే తెలంగాణ ఆడపడుచుల సందడి, మనకు సంక్రాంతి గొబ్బెమ్మల చుట్టూ పాడుతూ తిరిగే అమ్మాయిల ముఖంలో విరబూస్తుంది. ఆట,పాట తరువాత గొబ్బి దేవతకు నైవేద్యం పెట్టి హారతులు ఇస్తారు. ధనుర్మాసం అంతా సాగే ఈ గొబ్బెమ్మల కోలాహలం సంక్రాంతి రోజుతో ముగుస్తుంది. సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతూ గొబ్బెమ్మలకు వీడ్కోలు చెబుతారు. ఈ నెల మొత్తం పెట్టిన గొబ్బిళ్ళను పిడకలుగా చేసి ఎండబెడతారు. వాటిని భోగి పండుగ రోజున దండలాగా గుచ్చి భోగి మంటలలో వేస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు దిష్టి తగలదని నమ్ముతారు. సంక్రాంతి పండుగ రోజున పెట్టిన గొబ్బెమ్మలను దాచి వుంచి రథసప్తమి రోజున వాటిని వెలిగించి పరమాన్నం చేసి సూర్య భగవానునికి నివేదన చేస్తారు.
తన కిరణాలతో జీవకోటికి ప్రాణం పోస్తున్న సూర్యుని ఆరాధించటమే సంక్రాంతి యొక్క ముఖ్య ఉద్దేశం.
మనం దీనిలో ఇంకొక కోణాన్ని కూడా చూడవచ్చు. సూర్యదేవుడి పుత్రుడు యముడు కనుక అపమత్యువును తప్పించుకోవాలంటే ఆయనను, ఆయన తండ్రిని ఇద్దరినీ ప్రసన్నం చేసుకోవాలి అనేది పూర్వీకుల ఆలోచన. ఈ పండుగ సమయంలో పూర్వీకులను స్మరించుకోవడం ఆనవాయితీ.

కోడిపందేలు
సంక్రాంతి అనగానే కోడిపందేలు గుర్తు రాక మానవు. మగవారందరూ ఊరి సమీపంలో ఒక చోటకి చేరి కోడిపందేలు ఆడతారు. ఈ పందేల కోసం కోడిపుంజులకు ప్రత్యేక ఆహారాన్ని అందిస్తూ వాటిని బలంగా తయారు చేస్తారు. వాటి రంగును బట్టి వాటికి కాకి, డేగ అంటూ పేర్లు పెడతారు. ప్రస్తుతం కోడిపందేలపై నిషేధం ఉన్నప్పటికీ అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. కోడిపందాలలో గెలిచిన వారికి ఏమి మిగిలింది అంటే.. మీసం మిగిలిందని నవ్వుకుంటారు. గెలిచినవారు బంధుమిత్రులతో కలిసి పండుగ చేసుకుంటారు. పందెం డబ్బంతా ఆ ఖర్చులకే అయిపోతుందని అర్థం. కోడి పందాలు లానే కొన్నిచోట్ల ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తుంటారు.
గాలిపటాలు
సంక్రాంతి సమయంలో మొదలయ్యే ఉత్తరాయణంతో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. పగటిపొద్దు పెరుగుతుంది. ఆకాశం ఆహ్లాదంగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి గాలిపటాలను ఎగురవేస్తుంటారు. ఒకప్పుడు రాజుల సరదాకి మాత్రమే వాడే గాలిపటాలు సంక్రాంతి సందడి లో భాగమై ప్రతి ఒక్కరినీ అలరిస్తుంటాయి.
మకర సంక్రాంతి
రైతులు ఆరుగాలం శ్రమించి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి పంటలను పండిస్తుంటారు విత్తునాటిన దగ్గర నుంచి కోత కోసే వరకు పైరును ఎన్నో తెగుళ్ళు నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. తన కిరణాలతో వాటిని నీరుగార్చి సహాయం చేసే సూర్యునికి కతజ్ఞతగా ఇంటి ఆవరణలో సూర్యునికి ఎదురుగా ముంగిట్లో ముగ్గు వేసి, పొయ్యి సిద్ధం చేసి, ఆవు పిడకలపై కొత్త కుండ ఉంచి, ఆవుపాలు, కొత్త బియ్యం, బెల్లం, కొబ్బరి తురుము, పెసరపప్పులతో పొంగలి వండి భాస్కరుడికి నివేదించి ఇంటిలిపాది దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు.
కనుమ
సంక్రాంతి తరువాతి రోజున కనుమ పండుగ జరుపుకుంటారు. దీనిని సంక్రాంతి పార్న అని పిలుస్తారు. పార్న అంటే పారణ అనే పదానికి రూపాంతరం. అంటే వ్రతం, ఉపవాసం తర్వాత మనం తీసుకునే తీర్థప్రసాదాలు. ఈ మధ్యకాలంలో కనుమ రోజున పూర్తిగా మాంసాహారం భోజనంగా మారింది. పంట చేతికొచ్చిన సమయం కావడంతో రైతులు కనుమ రోజున తనకు ఎంతగానో సహకరించిన పశువులకు కతజ్ఞతగా స్నానం చేయించి, పసుపు, కుంకుమ తో అలంకరించి పూజ చేస్తారు. పొంగలిని, ఇతర నైవేద్యాలను ఆహారంగా పెడతారు. ‘కనుమ పండుగ రోజు మినుములు తినాలనే’ నానుడి. అందుకే ఆరోజు గారెలు చేసుకుంటారు.
కనుమ పండుగ పశువుల పండుగగా ప్రతీతి. తమతో పాటు కష్టపడుతున్న పశువులను రైతులు తమ కుటుంబంలోని సభ్యులుగా భావిస్తారు. కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు అంటారు. ఈ రోజున పశువులకు విశ్రాంతినిచ్చి కుటుంబమంతా సంతోషంగా గడపడం అనేది దీని వెనుకనున్న ఉద్దేశ్యం కాబోలు.
ఇలా ఎన్నో సంతోషాలను మోసుకొచ్చే సంక్రాంతిని మన తెలుగు కవులు తమ రచనల్లో అద్భుతంగా వర్ణిస్తుంటారు. నన్నె చోడుడి ‘కుమార సంభవం’, వినుకొండ వల్లభుని ‘క్రీడాభిరామం’ లో సంక్రాంతి వర్ణనలు మనోహరంగా ఉంటాయి.
సంక్రాంతి పండుగ మీద కథలు కూడా చాలానే వచ్చాయి. మన్నవ రామారావు గారి ‘తగవులు తీర్చే సంక్రాంతి’ కథ నుంచి వేదుల మీనాక్ష దేవి, ఎస్వీ రంగారావు గారు రాసిన కథలు.. కాదంబరి వెంకటేశ్వరరావు గారు, మధురాంతకం రాజారాం, కావూరి నరసింహ శెట్టి వంటివారు రాసిన హాస్య కథలకైతే కొదవేలేదు. సరికొత్త హంగులతో ఈ తరం వారు కూడా ఎన్నో కథలు రాస్తున్నారు. ఎన్ని కథలనైనా సంక్రాంతి సంబరంగా ఆహ్వానిస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. పూదండగా మార్చుకుంటుంది.
నగరాలలో పండుగ కళ కొంత కనుమరుగవుతున్నప్పటికీ సంక్రాంతి శోభ పల్లెలను ఇప్పటికీ ఆత్మీయతతో అంటిపెట్టుకునే ఉంది. తరతరాల నుండి వస్తున్న ఈ ఆచారాలు, సంప్రదాయాలన్నీ మనం ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆచరించదగినవే. వీటివల్ల మనుషుల మధ్య, వారి మనసుల మధ్య ఆరోగ్యకరమైన భావనలు పెరుగుతాయి. అందువల్లనే వీటిని మన భవిష్యత్ తరాల వారికి అందించటం మన బాధ్యత అని గుర్తుంచుకోవాలి.
విశ్వైక
9550183143



