Monday, June 2, 2025
E-PAPER
Homeచైల్డ్ హుడ్గాలిలో దీపం

గాలిలో దీపం

- Advertisement -

భావేష్‌ నాలుగవ తరగతి చదువుతుండె. ఇంకో నెల రోజుల్లో పరీక్షలు మొదలవుతాయి వాడికి. బడి నుంచి రాంగనే అమ్మ పెట్టిన సకినాలు తినేసి, పుస్తకాలు ముందేసుకుని కూర్చుండె. చదువు మీద కాస్త శ్రద్ద ఎక్కువే వాడికి. గుణకారం, భాగాహారం లెక్కలు ప్రాక్టీస్‌ చేసుకుంటుంటే అప్పుడు వచ్చిండు వాళ్ళ దూరపు చుట్టం ఒకాయన. వాళ్ళ అమ్మ అరుణ ఇచ్చిన కాఫీ తాగిండు. వాళ్ళ నాన్న సాయిలుతో కూర్చుని ఊరి ముచ్చట్లు చెప్తుండె. ముచ్చట్ల మధ్యల భావేష్‌ని దగ్గరకు పిలిచిండు ఆయన. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ‘భావేష్‌ నక్షత్రం ఏంటి’ అని సాయిలుని అడిగిండు. ఆయనేదో పేరు చెప్పిండు. ఇంక చుట్టపాయన గాల్లోకి చేతులు ఊపుతూ, వేళ్ళతో ఎవో లెక్కలు వేసి, ”అబ్బా..మీ వాడి జాతకం మస్తు మంచిగుంది ఈ సంవత్సరం. అసలు కష్టపడకుండానే విజయాలు వాడిని వెతుక్కుంటూ వస్తాయి” అని చెప్పిండు. తర్వాత ఏవేవో ముచ్చట్లు చెప్పి, పని ఉందంటూ వెళ్ళిపోయాడు.
ఆయన చెప్పిన మాటలు భావేష్‌ మనసులో నాటుకున్నాయి. నేను కష్టపడకుండానే నాకు విజయాలు వస్తాయి అని చెప్పిండు కదా. ఇంక ఎందుకు చదవాలి అనుకుని, ఆ రోజు నుంచి చదువు మీద శ్రద్ధ తగ్గించిండు. టీవీ ముందు కూర్చుని పుస్తకాలు తీస్తలేడు. ‘పిలగాని జాతకం బాగుందిలే’ అని వాళ్ళ అమ్మ కూడా వాడిని ఏమనలేదు.
పరీక్షలు అయిపోయి, ఫలితాలు వచ్చినై. ప్రతిసారి క్లాసుల ఫస్ట్‌, ఐదుమందిలో ఉండేవాడు. ఈసారి పదమూడో రాంక్‌ వచ్చింది. అన్ని సబ్జెట్లల్లా తక్కువ మార్కులు వచ్చినై. దాంతో భావేష్‌ చానా పరేషాన్‌ అయ్యిండు. ప్రోగ్రెస్‌ కార్డు ఇంట్ల చూపనీకి వాడికి భయమైంది. ‘జాతకం బాగుంటది, కష్టపడకుండానే విజయం వస్తుంది’ అని చెప్పిన చుట్టం పైని మస్తు కోపం వచ్చె. ఎప్పుడూ మంచి రాంక్‌ తెచ్చుకునే వాడికి తక్కువ మార్కులు వచ్చాయని భావేష్‌ ఫ్రెండ్స్‌ కూడా ఎగతాళి చేసిర్రు. భావేష్‌కి కోపం, బాధ ఒక్కసారిగా వచ్చి, ఏమి చేయలేక ఉక్రోషం ఆపుకోలేక పెద్దగా ఏడ్చిండు. అప్పుడే క్లాస్‌లోకి వచ్చింది లెక్కల టీచర్‌ అన్నపూర్ణ. భావేష్‌ ఏడుపుకి కారణం అడిగింది. ఇంటికి వచ్చిన చుట్టం చెప్పిన జాతకం ముచ్చట కూడా చెప్పిండు ఏడ్చుకుంటా.
కష్టపడితే వచ్చే ఫలితం గురించి చెప్పడానికి ఇదే మంచి సమయం అనుకుంది. ఆఫీస్‌ రూమ్‌ నుంచి ఒక కొవ్వొత్తి తెప్పించె. పిల్లలందరిని కూర్చోమని ముగ్గురు పిల్లలను టేబుల్‌ దగ్గరకు రమ్మంది. భావేష్‌ని కూడా పిలిచింది. కొవ్వొత్తిని వెలిగించమనె. భావేష్‌ కొవ్వొత్తి వెలిగించిండు. కొవ్వొత్తి వెలుగుతూ ఉండె. ఒక అబ్బాయిని ఫ్యాన్‌ స్విచ్‌ వేయమంది. ఫ్యాన్‌ స్విచ్‌ వెయ్యంగనే గాలికి వెలుగుతున్న కొవ్వొత్తి వెలుగు కాసేపు అటుఇటు ఊగినట్లై, ఆరిపోయింది.
”పిల్లలూ.. ఫ్యాన్‌ గాలికి వెలుగుతున్న కొవ్వొత్తి ఆరిపోయింది కదా. మరి గాలి వీస్తున్నా కూడా ఆరిపోకుండా కొవ్వొత్తి వెలగాలంటే మనం ఏం చేయాలి..?” టీచర్‌ అడిగె. పిల్లలు కొందరు ఏవేవో చెప్పిర్రు కానీ, సరైన జవాబు ఎవరూ చెప్పలేకపోయిర్రు. మీకు అర్ధం అయ్యేలా నేనే చెప్తాను అని మళ్ళీ కొవ్వొత్తి వెలిగించింది. ఈ సారి ఫ్యాన్‌ స్విచ్‌ వెయ్యగానే పిల్లలను కొవ్వొత్తి దీపం చుట్టూ చేతులను అడ్డుపెట్టమంది. ఇద్దరు పిల్లలు కొవ్వొత్తి వెలుగుకి చేతులు అడ్డుపెట్టిన్రు. దీపం ఆరిపోకుండా వెలిగె.
”చూసారు కదా పిల్లలు. గాలిలో దీపం పెడితే కొంతసేపటికి ఆరిపోతుంది. అదే దీపానికి అడ్డుగా మన చేతులను పెడితే దీపం ఆరిపోకుండా వెలిగింది కదా. ఈ చర్యలో ఒక మంచి అర్ధం ఉంది. మనం ఏదైనా సాధించాలి అనుకుంటే తప్పకుండా కష్టపడాలి. ఎలాగంటే గాలిలో దీపం పెట్టిన దీపానికి మన చేతుల అడ్డు ఉన్నట్లు, మనం సాధించాలనుకునే విజయానికి మనం పడే కష్టం, చేసే శ్రమ తోడుగా నిలిచి మన విజయానికి కారణం అవుతాయి.
అలాగే మీరు పరీక్షల్లో విజయం సాధించాలంటే చదువు మీద ఇష్టంతో శ్రద్ధ పెట్టి శ్రమించాలి. అంతే కానీ, జాతకం బాగుంది కాబట్టి చదవాల్సిన పని లేదు అనుకుంటే, ఇదిగో మన భావేష్‌కి మార్కులు తగ్గినట్లే అవుతుంది. అర్థమైందా..?” అని పిల్లలను చూసింది.
అర్థమైందని పిల్లలు తలూపిర్రు.
”ఏం భావేష్‌ ఇక జాతకాలు అని నమ్మకుండా కష్టపడి చదువుతావా..?” భావేష్‌ భుజం తట్టి అడిగింది టీచర్‌.
”ఇకనుంచి తప్పకుండా కష్టపడి చదువుతాను టీచర్‌” అనిండు భావేష్‌
– రోహిణి వంజారి, 9000594630

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -