– ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మూఢ నమ్మకాల నిరోధానికి అవసరమైన చట్టం తేవాలని శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ కోరారు. ఈ మేరకు సోమవారం మండలి సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మూఢ నమ్మకాల కారణంగా ఇప్పటికీ ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారు అవసరమైన ముసాయిదా బిల్లును రూపొందించారని తెలిపారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: విజయశాంతి
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి కోరారు. సోమవారం శాసనమండలిలో ఈ అంశాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉద్యమకారులకు మనం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల కోసం అడిగేందుకు వచ్చిన వారిని అరెస్టులు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ వేస్తే కాలయాపన అవుతుందనీ, హామీలను తక్షణమే అమలు చేయాలని సూచించారు. ఉద్యమకారుల పోరాట ఫలితంగానే స్వేచ్ఛగా తెలంగాణలో ఫలితాలు అనుభవిస్తున్నామని ఆమె అన్నారు. రెండేండ్లు గడుస్తున్నా వారికిచ్చిన ఒక్క హామీ నెరవేరలేదనీ, జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని ఇచ్చిన మాట అమలు కాలేదన్నారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అవుట్ డోర్ మీడియాలో పని చేస్తున్న 50 వేల మందిని ఆదుకునేలా జీవో 69ను సవరించాలని ప్రత్యేకం గా ప్రస్తావించారు. సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ భూగర్భ జలాలు ఎండిపోతున్నాయనీ, రైతులను ఆదుకోవాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ టెట్ క్వాలిఫయింగ్ మార్కులను తగ్గించాలని కోరారు. ఇప్పటికే బీహార్, తమిళనాడు రాష్ట్రాలు తగ్గించాయని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ మోడల్ స్కూల్ టీచర్లకు 010 క్రింద వేతనాలు చెల్లించాలని కోరారు.
3 లక్షల జనాభా ఉన్న జనహర్‌నగర్‌లో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిటిషన్ సమర్పించారు. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిటిషన్ ఇచ్చారు. అన్ని జిల్లాలకు రెగ్యులర్ జిల్లా విద్యాధికారులను నియ మించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పిటిషన్ ఇచ్చారు.
మూఢ నమ్మకాల నిరోధక చట్టం తేవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



