Thursday, December 11, 2025
E-PAPER
Homeజాతీయం'ఇండిగో'పై న్యాయ విచారణ జరపాలి

‘ఇండిగో’పై న్యాయ విచారణ జరపాలి

- Advertisement -

కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్‌

న్యూఢిల్లీ : ఇండిగో విమాన సంక్షోభంపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర కార్మిక సంఘాల (సీటీయూలు) వేదిక డిమాండ్‌ చేసింది. సంక్షోభానికి బాధ్యులైన వారిని తీవ్రంగా శిక్షించాలని, బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. ‘కార్పొరేట్‌ సంస్థల అహంకారానికి ఇది పరాకాష్ట. కార్మికులు, ప్రయాణికుల భద్రత విషయంలో కనబరచిన నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోంది. ముఖ్యంగా వ్యూహాత్మక రంగాల ప్రయివేటీకరణ, గుత్తాధిపత్యంపై కేంద్ర కార్మిక సంఘాల హెచ్చరిక నిజమని తేలిపోయింది’ అని ఓ ప్రకటనలో వివరించింది. ఇండిగో ఉదంతం నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలని అంటూ విద్యుత్‌, పెట్రోలియం, రైల్వేలు, రక్షణ, టెలికం, బ్యాంకింగ్‌ వంటి రంగాల ప్రయివేటీకరణ యత్నాలను నిలిపివేయాలని ఆ ప్రకటన హెచ్చరించింది. కేంద్ర కార్మిక కోడ్స్‌కు వ్యతిరేకంగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో సార్వత్రిక సమ్మె జరపాలని కార్మిక సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 22న జరిగే సమావేశంలో సమ్మె తేదీని ఖరారు చేస్తామని అవి తమ ప్రకటనలో తెలియజేశాయి.

ఈ కోడ్స్‌తో కార్మికులకు ఎంతో గొప్ప ప్రయోజనం కలుగుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాయి. కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 8వ తేదీన సమావేశమై లేబర్‌ కోడ్స్‌ నోటిఫికేషన్‌పై చర్చించాయి. ఇండిగో విమానాలు పెద్ద ఎత్తున రద్దు కావడం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. గత నెల 26న లేబర్‌ కోడ్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగిందని కార్మిక సంఘాల సంయుక్త ప్రకటన తెలిపింది. లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌పై అన్ని ప్రతిపక్షాలు ఏకతాటి పైకి వచ్చాయని చెప్పింది. లేబర్‌ కోడ్స్‌ను ఉపసంహరించుకునే వరకూ దశలవారీగా నిరంతర ఆందోళన జరపాలని నిర్ణయించామని తెలియజేసింది. కార్పొరేట్‌ అనుకూల, మతతత్వ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి సంయుక్త కిసాన్‌ మోర్చతో సమన్వయం చేసుకుంటామని పేర్కొంది. సంయుక్త ప్రకటనకు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఏఐసీసీటీయూ, ఎల్‌డీపీ, యూటీయూసీ మద్దతు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -