ఇరాన్ నుంచి ఊహించని ప్రతిఘటన
అంతర్జాతీయ రాజకీయాల్లో తగ్గిన భారత్ ప్రాముఖ్యత : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ – ఖమ్మం/వైరాటౌన్
అమెరికా సామ్రాజ్యవాద అహం కారానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సాధించేందుకు, వనరులను దోపిడీ చేయాలనే ఉద్దేశంతో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై దాడులకు దిగాయని విమర్శించారు. శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవన్‌లో జరిగిన సీపీఐ(ఎం) జిల్లా స్థాయి ప్లీనంలో మాచర్ల భారతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్‌ను రాతియుగానికి తీసుకెళ్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ అహంకారానికి తగిన గుణపాఠం దక్కిందన్నారు. చైనా సాంకేతిక సహకారంతో బలహీన దేశమైన ఇరాన్.. ప్రపంచ పోలీస్‌గా భావించే అమెరికాను ఎదిరించి నిలబడటం విశేషమన్నారు.
ఇరాన్ పాలన పై అమెరికా లేదా ఇతర దేశాలకు నిర్ణయం తీసుకునే హక్కు లేదని, ఆ హక్కు అక్కడి ప్రజల దేనని స్పష్టం చేశారు. వియత్నాం యుద్ధాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. ఆయుధ బలంకన్నా ప్రజల సంకల్ప బలం గొప్పదని చరిత్ర చెబుతోందన్నారు. 20 ఏండ్లపాటు సాగిన యుద్ధం తర్వాత అమెరికా వెనక్కి తగ్గాల్సి వచ్చిన పరిస్థితిని గుర్తుచేశారు. ఇరాన్ ప్రదర్శించిన సమర శీలత ప్రపంచానికి మార్గదర్శకమని చెప్పా రు. అమెరికా, ఇజ్రాయిల్ చర్యలకు నాటో దేశాలు కూడా పూర్తి మద్దతు ఇవ్వక పోవడం ఇరాన్‌కు నైతిక విజయమని అన్నారు. చైనా, రష్యా అండతో ఇరాన్ నిలబడిన సందర్భంలో అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ ప్రాముఖ్యత కోల్పోయిందని విమర్శించారు. అమెరికా అనుసరణలో నడిచే విధానాల వల్ల భారత దేశ స్థాయి దిగజారిందని, పాకిస్తాన్ మధ్య వర్తిత్వానికి అవకాశం కలిగిందని అన్నారు. సామ్రాజ్యవాద కాంక్షతో అమెరికా రాక్షస ప్రవృత్తిని అనుసరిస్తోందని, ఆ దేశానికి మద్దతుగా ”రామరాజ్యం” జపం చేస్తూ వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ ”రావణ రాజ్యం” నడుపుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు విమర్శించారు.
వెనిజులా అధ్యక్షులు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియాపై జరిగిన చర్యలను కూడా మోడీ ఖండించలేదని విమర్శించారు. చమురు వనరుల దోపిడీ కోసం అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్‌పై యుద్ధానికి దిగినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. భారత నౌకాదళంతో సంబంధం ఉన్న సందర్భంలో ఇరాన్ నౌకపై దాడి జరిగి సైనికులు మరణించినా కేంద్రం మౌనం వహించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలే ముఖ్యమని, దేశ ప్రజలు, రైతుల సమస్యలు పట్టడం లేదని అన్నారు. ప్రపంచ శాంతి కోసం సోషలిస్టు దేశాలే కృషి చేస్తున్నాయని, చైనా, రష్యా మద్దతుతోనే ఇరాన్ అమెరికాకు ఎదురు నిలిచిందని అన్నారు.
మోడీ పాలనలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులపై దోపిడీ పెరిగిందని, 26 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకొచ్చి హక్కులను హరించారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచడం, విత్తన చట్టంతో విదేశీ కంపెనీల ఆధిపత్యం పెరగడం, విద్యుత్ సంస్కరణలతో ప్రయివేటీకరణ వేగవంతం అవుతున్నాయని తెలిపారు. ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి వామపక్ష ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. దేశం, ప్రజలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం విస్తృతస్థాయిలో ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఎదుర్కొని ఓడించడం కమ్యూనిస్టుల ప్రధాన కర్తవ్యమని అన్నారు.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వామపక్ష వాదులు, పౌర హక్కుల నేతలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులపై దేశద్రోహం కేసులు పెట్టడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిదర్శనమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. మాస్ లైన్ నాయకులు పోటు రంగారావుపై దేశద్రోహం కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. పౌర హక్కులను హరిస్తూ దేశద్రోహం కేసులు పెట్టి ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని అన్నారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్ని గ్రామాల్లోనూ వెంటనే ఏర్పాటు చేయాలని, ఎకరానికి 25 క్వింటాళ్ల పరిమితి నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2026 ఆగస్టు నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 21 సంవత్సరాలు గడిచినా నిర్మాణం పూర్తి కాకపోవడంపై జిల్లాకు చెందిన మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, బుగ్గవీటి సరళ, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, భూక్య వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, మెరుగు సత్యనారాయణ, మడుపల్లి గోపాలరావు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.



