ఆమె శ్వాస భరత నాట్యం.. ఆమె ధ్యాస భరతనాట్యం.. ఈమె మరెవరో కాదు.. ఒద్దిరాజు విజయ్ కుమార్, రాధల ముద్దు బిడ్డ ఒద్దిరాజు సారణి. కండ్లతోనే ఎన్నో భంగిమలు పలికించగల కళాకారిణి. తన అందం, ఆహార్యంతో భరతనాట్యానికే వన్నె తెస్తుంది. విదేశాల్లో పుట్టి పెరిగినా భారతీయ కళల పట్ల మక్కువ పెంచుకుంది. దేశ విదేశాల్లో మన నాట్య శాస్త్రాన్ని ప్రచారం చేస్తుంది. మద్రాస్ కళాక్షేత్ర విద్యార్థినిగా ఇటీవలె సారస్వత పరిషత్‌లో అద్భుతమైన నాట్య ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను మంద్రముగ్ధులను చేసిన ఆమెతో మానవి సంభాషణ…
అమెరికాలో పుట్టి అక్కడే పెరిగిన సారణి మన దేశ సంస్కృతి సంప్రదాయాలను తు.చ తప్పక పాటిస్తుంది. ఆ పరంపరను కొనసాగించాలని నిర్ణయించుకుంది. నేటి ఆధునిక యుగంలో జీవితంలో ఉన్నంతంగా స్థిరపడేందుకు ఇంజనీరింగ్, ఎంబిబిఎస్, ఐఐటి లాంటి ఎన్నో కోర్సులున్నా అవి కాదనుకొని పట్టుబట్టి మరీ భరతనాట్యమే నేర్చుకుంది. ఆమె తన నాలుగేండ్ల వయసులో న్యూజెర్సీలోని శ్రీమతి జయశ్రీ కొత్తపల్లి దగ్గర భరతనాట్య శిక్షణ ప్రారంభించింది. ఆ తర్వాత పద్మా సుబ్రహ్మణ్యం శిష్యురాలైన బాలాదేవి చంద్రశేఖర్ దగ్గర చేరి శిక్షణ పొందింది.
రవీంద్ర భారతిలో ఆరంగేట్రం
2009 నుండి టి.బాలసరస్వతి – వజువూరి బి. రామయ్య పిళ్ళై శిష్యురాలైన ఆర్ని హేమమాలిని దగ్గర శిక్షణ పొందింది. 2020లో కళాక్షేత్రలో నాలుగేండ్ల డిప్లమా కోర్స్‌లో చేరింది. 30 మంది నాట్య విద్యార్థులలో రెండేండ్ల డిప్లమా కోర్స్‌లో రెండవ కళాకారిణిగా ఎన్నికయ్యింది. ప్రస్తుతం మద్రాస్ యూనివర్సిటీలో నృత్యకళలో ఎంఏ చేస్తుంది. 2016లో హైదరాబాదు రవీంద్ర భారతి వేదికగా నాట్యంలో ఆరంగేట్రం చేసింది. శిల్పారామంలో భారతీయ కళాసంస్కృతి వడ్డేపల్లి ప్రవీణ్ అధ్వర్యంలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. 2017లో కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలోని సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మరొక ప్రదర్శన చేసింది. అక్కడే ఇండియానాలోని మేరియన్ హానివెల్ సెంటర్‌లో కూడా ప్రదర్శన ఇచ్చింది.
కొరియోగ్రఫీలోనూ…
2018లో ఖమ్మం దగ్గర కూసుమంచి గ్రామంలోని రామాలయంలో మరో ప్రదర్శన ఇచ్చింది. 2020లో వారం రోజుల పాటు బెంగుళూరులో ఇందిరా కాదంబి అధ్వర్యంలో నడిచిన కార్యశాలలో పాల్గొంది. ‘వజువూర్’ బాణీలో (Vachuvoor style) నాట్య అభ్యాసం చేసిన సారణి భరతనాట్యమే కాకుండా కొరియోగ్రఫీ (choreography stage performance, Dance instruction History of Dance, Theory of Dance Tala aspects) లోనూ ప్రవీణురాలు. అంతే కాదు ఇతర నాట్యాల పట్ల కూడా మక్కువే. సారణికి భరతనాట్య శాస్త్రం గురించి పరిశోధన చేయాలని ఉందని తన ఆసక్తిని వెలిబుచ్చింది. అసలైతే ఈ భరతనాట్యం దక్షిణ భారతదేశంలో నాట్య శాస్త్రం రచించిన భరతముని పేరుతో పేరు పొందింది. పూర్వకాలంలో దేవాలయాలలో నృత్య ప్రదర్శన చేసేవారు.
చివరి తిల్లానా వరకు
సారణి అభినయం సర్వాంగాల్లోనూ ముఖ్యంగా కళ్ళల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. మొదలు పెట్టినప్పుడు ఎంత ఉత్సాహంతో మొదలుపెట్టిందో చివరి తిల్లానా వరకు అదే ఉత్సాహంతో అభినయం చక్కగా కొనసాగిస్తుంది. ఆమె ప్రదర్శన రోజు సారస్వత పరిషత్తు హాలు మొత్తం ప్రేక్షకులతో నిండి పోయింది. ప్రదర్శన జరిగినంత సేపు మంత్రముగ్ధుల వలె కూర్చొని చూసి ఆనందించారు. ఎందుకంటే సారణి వేదిక మీదకు వచ్చేటప్పుడు ఒక గ్రేస్‌తో కనపడి అవాక్కైయ్యేలా చేసింది. అన్ని అంశాలను విరామం లేకుండా నాట్యం చేసినా, ముఖంలో ఏమాత్రం అలసట అనేదే కనిపించనీయలేదు. నాట్యం పట్ల ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనం.
కంటి కదలికలతో…
భరత నాట్య కళాకారిణికి ఆహార్యం ఎంతో ముఖ్యం. సారణి అందమైన రూపం, దానికి తగిన ఆహార్యం, సాధారణ అలంకరణ ఆమెకు ఒక హుందాతనాన్ని ఇచ్చింది. అన్నన్ని కంఠాభరణాలు కానీ, హస్తాభరణాలు కానీ అక్కరలేదని సహజ సౌందర్యమే చాలని తెలిపింది సారణి అలంకరణ. తన కంటి కదలికలు ఎంతో బాగున్నాయి. అవి శిక్షణలో వచ్చినట్టుగా కనిపించలేదు. ఆమె సహజంగానే అలా కదిలించగలదని ఎక్కడా కృత్రిమత్వం లేదనిపించింది. ముఖ్యంగా తిల్లానా నృత్యం చేస్తున్నప్పుడు ఆమె కదలికల నుండి నేను చూపు మరల్చుకోలేకపోయాను.
శ్రద్ధతో నేర్చుకుంటే…
మద్రాస్ కళాక్షేత్రంలో సారణి నాట్య విద్య కొనసాగిస్తుంది. ఆ సంస్థను రుక్మిణి అరుండేల్ స్థాపించి అందులో శాస్త్రీయ నృత్యం, సంగీతం మొదలైన భారతీయ కళలను నేర్పిస్తున్నారు. ఇందులో చాలా ప్రదర్శనలు జరుగుతాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి. అందుకే అంతర్జాతీయంగా ఎంతో పేరు ఉన్న సంస్థ కళాక్షేత్ర. అందులో సారణి శిక్షణ పొందడం ఆమెకు దక్కిన మంచి అవకాశం. భరతనాట్యం పట్ల అభిరుచి ఉన్నా చాలా మంది నేర్చుకోవడానికి ప్రయత్నించరు. ఎందుకంటే ఎంతో కాలానికి కానీ తమకు గుర్తింపు రాదనుకుంటారు. కానీ శ్రద్ధతో నేర్చుకుంటే గుర్తింపు దానంతట అదే వస్తుందని సారణి నిరూపించింది. పాశ్చాత్యదేశంలో పుట్టి పెరిగిన సారణి భరతనాట్యాన్ని అభిరుచిగా కాక ప్రధాన విద్యగా ఎన్నుకోవడం అభినందనీయం. ఆమె మరెన్నో నాట్య ప్రదర్శనలు ఇవ్వాలనీ, త్వరలోనే నాట్య శాస్త్రంపై పరిశోధనా గ్రంథం రచించాలని కోరుతూ..
కళాక్షేత్ర విద్యార్థినిగా…
ఈ భరతనాట్యంలోని భంగిమలు ప్రాచీన దేవాలయాలలోని శిల్పాల భంగిమ ఆధారంగా నాట్యాన్ని సమకూర్చారు. భరతనాట్యంలో ముఖ్యమైనవి భావం, రాగం, తాళం. వీటిని నృత్యంశాలతో జోడిస్తూ కళాకారులు చక్కని హావ భావ ప్రదర్శన చేస్తారు. అలా అద్భుతమైన ప్రదర్శన ఇటీవల హైదరాబాదులోని సారస్వ త పరిషత్తు దేవులపల్లి రామానుజ రావు హాల్లో కళాక్షేత్ర నాట్య విద్యార్థినిగా సారణి ‘పూర్వక పుష్ప’ అనే శీర్షికన భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. భరత నాట్యం అన్ని రకాల నాట్యాలలో మంచి ప్రాధాన్యం ఉన్న నాట్యం. ఎందుకంటే ప్రేక్షకులందరిని
అలరిస్తుంది.
- రంగరాజు పద్మజ