అదుపుతప్పి కేఎల్‌ఆర్ ఇంజీనీరింగ్ కళాశాల బస్సు బోల్తా
బస్సులో సుమారు 40 మంది విద్యార్థులు
గాయపడిన వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-అశ్వాపురం
ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి పాల్వంచ కేఎల్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచలోని కేఎల్‌ఆర్ ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బస్సు రోజు మాదిరిగానే మణుగూరు నుంచి సుమారు 40 మంది విద్యార్థులను ఎక్కించుకొని కళాశాలకు బయలుదేరింది. అశ్వాపురం మండలం మొండికుంట సమీపంలోని సాయిబాబా గుడి దగ్గరికి రాగానే ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి కాలేజీ బస్సు పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో మణుగూరుకు చెందిన విద్యార్థులు స్వర్నాంబికకు తీవ్ర గాయాలుకాగా, తురక భవాని, నిమ్మగోట స్పందన, మానస, దివ్యకీ గాయాలయ్యాయి. మరి కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కళాశాల బస్సు ప్రమాదానికి గురైందన్న విషయం తెలిసిన వెంటనే మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి, అశ్వాపురం సీఐ జి.అశోక్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ యాట శీనుతో పాటు కొందరు స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను 108 వాహనం ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, బస్సు పల్టీ కొట్టిన సంఘటనలో విద్యార్థులందరూ స్వల్ప గాయాలతో బయటపడటంతో వారి తల్లిదండ్రులు, పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మణుగూరు డీఎస్పీ బస్సు ప్రమాదం జరిగిన చోటికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
తప్పిన పెను ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



