బ్యాంకు ఖాతాల ‘ఫ్రాడ్’ ప్రక్రియపై స్టే రద్దు
బాంబే హైకోర్టు బెంచ్ తీర్పు
ముంబయి : పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి బాంబే హైకోర్టులో సోమవారం భారీ షాక్ తగిలింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు, అనిల్ అంబానీకి చెందిన బ్యాంకు ఖాతాలను మోసపూరితమైనవి (ఫ్రాడ్)గా వర్గీకరించే ప్రక్రియపై గతంలో ఉన్న స్టేను కోర్టు రద్దు చేసింది. గత డిసెంబర్‌లో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను చట్టవిరుద్ధం, విపరీతమైనవని చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు దాఖలు చేసిన అప్పీళ్లను సమర్థించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు స్టే ఇవ్వాలన్న అంబానీ తరపు న్యాయవాదుల అభ్యర్థనను కూడా ధర్మాసనం ఖచ్చితంగా తోసి పుచ్చింది.
ఈ పరిణామం అనిల్ అంబానీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. దాదాపు రూ.40వేల కోట్ల మేర రుణాలు మళ్లింపు, దుర్వినియోగం, మనీలాండరింగ్, జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులో తేలడంతో బ్యాంకులు ఇప్పుడు ఆ ఖాతాలను అధికారికంగా ఫ్రాడ్‌గా ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. ఆడిట్ చేసిన సంస్థకు సాంకేతిక అర్హత లేదని అనిల్ అంబానీ వాదించి నప్పటికీ.. నిధుల గోల్‌మాల్‌పై బ్యాంకుల వాదనతో కోర్టు ఏకీభవించింది. ఒకవేళ ఈ ఖాతాలు ఫ్రాడ్‌గా ఖరారైతే.. భవిష్యత్తులో అంబానీకి కొత్త రుణాలు లభించడం దాదాపు అసాధ్యం కావడమే కాకుండా.. దర్యాప్తు సంస్థల నుంచి ఆయన తీవ్రమైన చట్టపరమైన విచారణలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.



