కంప్యూటర్లు, ఫైల్స్ దగ్ధం
పలు కీలక కేసుల ఆధారాలు ల్యాబ్‌లోనే..
ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల డేటా ఇక్కడే !
నవతెలంగాణ-మెహిదీపట్నం
హైదరాబాద్ నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది బయటకు పరుగులు తీసింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 5 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయని తెలిసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాదం గురించి తెలియగానే నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ల్యాబ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ల్యాబ్‌లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా దెబ్బతిన్నాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
ఏ వస్తువులు దగ్ధమయ్యాయో నిర్ధారణ కాలేదు : డీసీపీ శిల్పవల్లి
ల్యాబ్‌లో అగ్ని ప్రమాదంతో ఏ ఏ వస్తువులు దగ్ధమయ్యాయన్నది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదని ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైళ్లు, ఆధారాలు భద్రపరిచే ఎవిడెన్స్ లాబరేటరీ కార్యకలాపాలు ఈ భవనం నుంచే నిర్వహిస్తారని తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పనిచేస్తున్న వార్డు బాయ్ కృష్ణ మంటలను ఆర్పే ప్రయత్నంలో అపస్మారక స్థితిలోకి వెళ్లగా, అతడిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ల్యాబ్‌లో నలుగురు ఉద్యోగులు ఉన్నారని, మంటలను గమనించిన వెంటనే వారు బయటకు వచ్చేశారని అన్నారు.
కీలకమైన కేసుల ఆధారాలన్నీ ల్యాబ్‌లోనే..
నాంపల్లిలో ఉన్న స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో భారీ అగ్నిప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదంలో కీలకమైన ఆధారాలు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కీలక కేసులకు సంబంధించి ఆధారాలు కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాజకీయ ప్రకంపనలు సృష్టించిన అనేక కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు సైతం ఆ ల్యాబ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫైల్స్ అన్నీ అగ్నికి ఆహుతైనట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ డేటా విశ్లేషణ ఇక్కడే జరుగుతున్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌ల ఒరిజినల్ ఫైల్స్ ఇక్కడి కంప్యూటర్లలోనే నిక్షిప్తమై ఉన్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, వాటికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులు సైతం ఇక్కడే ఉన్నట్టు తెలుస్తోంది.



