ఇప్పటికీ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ ప్రజానీకం
కల్లలైన అమెరికా కలలు..
ట్రంప్, నెతన్యాహుకు చెమటలు పట్టిస్తున్న ఇరాన్
తొలిరోజే సుప్రీంలీడర్ హత్యతో ఆ దేశంలో పెరిగిన జాతీయవాదం
ఏకమైన ప్రజలు, గ్రూపులు ‘యుద్ధవిరామం’ అంటూ అమెరికా పిల్లిమొగ్గలు
నవతెలంగాణ-సెంట్రల్ డెస్క్
ఇరాన్ చమురు నిక్షేపాలను స్వాధీనం చేసుకోవాలనే దుర్భిద్ధితో ఇజ్రాయిల్ సహాయంతో అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ప్రారంభమై నెల రోజులు గడిచింది. ఇప్పటికీ అమెరికా ఆయోమయంలోనే ఉంది. యుధ్దం ప్రారంభానికి ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలకు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లకు పొంతన లేకుండా ఉంది. నయానో, భయానో ఇరాన్‌ను దారిలోకి తెచ్చుకోవాలని డోనాల్డ్ ట్రంప్ ఎన్ని రంకెలు వేసినా, ఇరాన్ సైలెంట్‌గా ప్రతికారదాడులతో అమెరికా వెన్ను విరిచే వ్యూహాలను అమలు చేస్తూనే ఉంది. ప్రారంభంలో ఇరాన్‌లో నాయకత్వ మార్పే లక్ష్యమన్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఒకట్రెండు వారాల్లో ఈ ఆపరేషన్ ముగుస్తుందని సంకేతాలిచ్చారు. పోరు ప్రారంభమై, ఇరాన్ ప్రతిదాడుల సత్తా తెలిశాక, ట్రంప్ మెల్లగా సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. ఇరాన్‌తో ఎలాంటి చర్చలు లేకుండానే, ఐదు రోజులు యుద్ధ విరామం ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని పదిరోజులకు పెంచారు.
చర్చలు జరుగుతున్నాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. మరోవైపు ఇరాన్ మాత్రం ఎలాంటి చర్చలు జరగట్లేదని తేల్చిచెప్పింది. దీంతో ట్రంప్ తెంపరితనం ప్రపంచానికి అర్ధమైంది. ఇరాన్‌పై యుద్ధానికి ముందు డ్రగ్స్ సరఫరా ఆరోపణలతో వెనిజులు అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసి, యూఎస్‌కు తరలించుకెళ్లారు. ప్రస్తుతం మదురో దంపతులు యూఎస్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇరాన్‌లో కూడా తొలిరోజే ఆదేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హత్యచేస్తే, వెంటనే ఆ దేశం తమ దారికొస్తుందని ట్రంప్ భావించారు. కానీ అందుకు పూర్తిభిన్నంగా ఖమేనీ హత్యను ఇరాన్ ప్రజలు తీవ్రంగా పరిగణించారు. అప్పటి వరకు అంతర్గత ఆందోళనలు నిర్వహిస్తున్న గ్రూపులన్నీ, జాతీయవాదంతో ఐక్యమయ్యాయి. అమెరికాపై ప్రతీకార దాడులకు మద్దతుగా నిలిచాయి. ఖమేనీ కొడుకు ముజ్తాబా ఆదేశ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యాక, అమెరికా, ఇజ్రాయిల్‌తో పాటు వాటికి సైనిక ఆశ్రయం ఇస్తున్న అరబ్ దేశాలపై ఇరాన్ తీవ్రంగా విరుచుకుపడింది.
ఈ దాడులవల్ల అరబ్ దేశాలే ఇరాన్‌పై తిరుగుబాటు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావించారు. కానీ ఊహకందని విధంగా గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా, ఇజ్రాయిల్‌లో కూడా ‘నో కింగ్స్’ అంటూ ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు ఊపందుకున్నాయి. దీనితో నాటో దేశాలు అమెరికాకు ఎదురుతిరిగాయి. సాధ్యమైనంత త్వరగా యుద్ధాన్ని ముగించాలని హితవు పలికాయి. ట్రంప్ దూకుడులో ఐక్యరాజ్య సమితి ఆటబొమ్మగా మిగిలిపోయింది. ప్రస్తుతం యుద్ధాన్ని ఎక్కడ ముగించాలో అర్థంకాక అమెరికా గందరగోళంలో ఉంది. సీన్ రివర్స్ అయ్యాక ట్రంప్ యుద్ధ లక్ష్యం ఏంటనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఓసారి యుద్ధం ముగిస్తామనీ, మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడతామంటూ ఆయన పొంతన లేని ప్రకటనలు చేస్తూ, ప్రపంచాన్ని ఆయోమయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది.
యుద్థం ప్రారంభంలో తమకు మూడు లక్ష్యాలు ఉన్నాయని పెంటగాన్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. ఆ తర్వాత పలువురు ఉన్నతాధికారులు తమకు నాలుగు యుద్ధ లక్ష్యాలు ఉన్నాయన్నారు. ట్రంప్ వీరందరి కంటే మరో అడుగు ముందుకు వేసి, అమెరికాకు ఐదు యుద్ధ లక్ష్యాలు ఉన్నాయని ప్రకటించారు. ఇరాన్ క్షిపణి దాడుల సామర్థ్యాన్ని తగ్గించడం, ఆయుధ తయారీ యూనిట్లను ధ్వంసం చేయడం, నౌకా, వాయుసేన లను నిర్వీర్యం చేయడం, అణుకేంద్రాలను ధ్వంసం చేయడం, పశ్చిమాసియాలోని మిత్రదేశాలకు రక్షణ కల్పించడం తమ లక్ష్యాలని ట్రంప్ తెలిపారు. మరి ఈ నెల రోజుల యుద్ధంలో ఎన్నింటిని అమెరికా సాధించిందో ఓసారి పరిశీలిద్దాం.
ప్రధాన లక్ష్యం – ప్రస్తుత పరిస్థితి
- క్షిపణి వ్యవస్థ విధ్వంసం : ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని నామరూపాలు లేకుండా చేయడమే ధ్యేయమని ట్రంప్ ప్రకటించారు. దాదాపు 90 శాతం క్షిపణులు,లాంఛర్లను ధ్వంసం చేశామని వైట్‌హౌస్ చెబుతోంది.
ప్రస్తుత పరిస్థితి: ఇరాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై భారీస్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంది. ఆ దేశ క్షిపణి సామర్థ్యం తగ్గిన దాఖలాలు కనబడటం లేదు. - రక్షణ పారిశ్రామిక రంగంపై దెబ్బ: ఇరాన్ ఆయుధ కర్మాగారాలను నేలమట్టం చేయడం మరో లక్ష్యం. ఈ దిశగా అమెరికా భారీస్థాయిలో వైమానిక దాడులు నిర్వహించింది.
ప్రస్తుత పరిస్థితి: యుద్దం తొలి రోజు నుంచి ఇరాన్ ఒకేస్థాయిలో దూకుడును ప్రదర్శిస్తోంది. దాడుల తీవ్రత చూస్తుంటే ఆ దేశాన్ని ఎక్కడా ఆయుధ కొరత వేధిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. తమ అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీల్లో పెద్దసంఖ్యలో మిస్సైళ్లు, డ్రోన్లు ఉన్నాయని ఇరాన్ సైన్యం పదేపదే ప్రకటిస్తోంది. ఇందుకు సాక్ష్యంగా వీడియోలనూ విడుదల చేస్తోంది. యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఇజ్రాయెల్‌పై మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. - నౌకాదళం, వైమానిక దళం నిర్మూలన : ఇరాన్ గగనతలంలో అమెరికా, ఇజ్రాయెల్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు 150 ఇరాన్ నౌకలను ముంచేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు.
ప్రస్తుత పరిస్థితి : ఇరాన్ నౌకాదళం పూర్తిగా ధ్వంసమైన దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు ఉదాహరణ హార్మూజ్ జలసంధే. ఈ జలమార్గంలో రాకపోకలను ఇప్పటికీ ఇరానే నియంత్రిస్తోంది. దీంతో ఆ దేశ నౌకాదళం క్రియాశీలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇరాన్ వాయుసేన నుంచి మాత్రం పెద్దగా ప్రతిఘటన కనిపించడం లేదు. - అణు సామర్థ్యానికి అడ్డుకట్ట : ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికాలు భారీ దాడులు నిర్వహించాయి. ప్రధాన అణుకేంద్రం నతాంజ్‌పైనా బాంబుల వర్షం కురిపించాయి.
ప్రస్తుత పరిస్థితి: ఇరాన్ అణుకార్యక్రమం నిర్వీర్యమైన దాఖలాలు కనిపించడం లేదు. ఇరాన్ శుద్థి చేసిన 970 పౌండ్ల యురేనియం ఇంకా ఆ దేశం దగ్గర సురక్షితంగా ఉంది. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలంటే, అమెరికా బలగాలను ఇరాన్ భూభాగంలోకి పంపాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రరాజ్యం ఆ సాహసం చేస్తుందని చెప్పడం కష్టమే. - మిత్రదేశాల రక్షణ : ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి మిత్రదేశాలకు రక్షణ కల్పించడం ఐదో లక్ష్యం.
ప్రస్తుత పరిస్థితి : సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాలపై యుద్ధం తొలి రోజు నుంచీ ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది. ఆ దేశాల్లోని కీలక చమురు, సహజ వాయుక్షేత్రాలకు తీవ్ర నష్టం కలిగించింది. దుబారుపైనా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఆ నగరంలోని ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. హార్మూజ్‌లోనూ ఇరాన్ ఆధిపత్యమే కొనసాగుతోంది.
ప్రస్తుతం అధికారికంగా ట్రంప్ చెప్పకపోయినా, ఇరాన్‌లో నాయకత్వ మార్పు కూడా అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాల్లో ఒకటి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. యుద్ధం తొలి రోజున ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని హతమార్చినా, అతని వారసుడిగా ముజ్తాబా ఖమేనీ ఎంపికయ్యారు. దాడుల్లో కీలక నేతలు, సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయినా, ఇరాన్ పాలనా వ్యవస్థ ఎక్కడా బలహీనమైన దాఖలాలు లేవు. దానికి తోడు యుద్ధం ప్రారంభంలో మౌనంగా ఉన్న ఇరాన్ అనుబంధ మిలిటెంట్ గ్రూపులు మళ్లీ క్రియాశీల మయ్యాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించింది.
తాజాగా యెమెన్‌లోని హూతీలు కూడా రంగంలోకి దిగారు. ఏదేమైనా నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధం వల్ల పశ్చిమాసి యాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకు తలం అవుతున్నాయి. ట్రంప్ తెంపరితనంతో ముందస్తు ప్రణాళికలు లేకుండా, యుద్ధ పర్యవ సానాలను ఆలోచించకుండానే ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దేశాలు దాడులకు తెగబడినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో ఇరాన్‌దే పైచేయిగా ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. స్వదేశం లోనూ ఇరాన్‌పై దాడిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు పెరుగుతుండటంతో యుద్ధాన్ని ఎలా ముగించాలో అర్థంకాక ట్రంప్ తలపట్టుకుంటున్నారు!!



