పియ్రమైన వేణు గీతికకు
ఎలా ఉన్నావు నాన్న? ఆరోగ్యం జాగ్రత్త. నిర్లక్ష్యం చేయకు. ఎండాకాలం అక్కడ బాగా వేడి గాలులు ఉంటాయి. కాబట్టి ద్రవ పదార్ధాలు ఎక్కువ తీసుకోవాలి.
సరే నాన్న.. కిందటి ఉత్తరంలో పిల్లల ఆహారం, దుస్తుల గురించి చెప్పాను. రెండేండ్ల పిల్లలకు మనం చెప్తున్నవి కొంచం అర్ధం అవుతాయి. అప్పుడు వాళ్లకు చిన్న చిన్న పనులు చెప్పాలి. ఉదాహరణకు ‘అక్కడ గ్లాస్ ఉంది తీసుకురా, నీకు బట్టలు మారుస్తాను వేరే బట్టలు తెచ్చుకో’ అని చెప్పి చూడాలి. మనం చెప్పేవి వాళ్లకు సరిగ్గా అర్ధం అవుతున్నాయా లేదా, మనం చెప్పిన వస్తువు వాళ్ళు తెచ్చారా లేదా చూడాలి. పిల్లలతో ఎంత ఎక్కువ సమయం గడిపితే వాళ్ల మానసిక ఎదుగుదల అంత బాగుంటుంది. తల్లి స్పర్శ వాళ్లకు ఎనలేని ధైర్యాన్ని ఇవ్వడమే కాక, ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. వాళ్లు తల్లి చెప్పే ప్రతిదీ చేయడానికి కృషి చేస్తారు.
కొందరిని చూస్తుంటాను.. చిన్నపిల్లలను బండి మీద కూర్చో బెట్టుకుని తీసుకుని వెళ్తుంటారు. అది కూడా వెనక కూర్చో బెట్టుకుని. కొంచం గాలి తగలగానే పిల్లల కళ్లు మూతలు పడి పోతుంటాయి. బండి నడిపే వాళ్లకు ఆ విషయం తెలియదు. ఎవరైనా చూసి చెప్తే సరే లేదంటే ప్రమాదమే. నేను అలా ఎంత మందికో చెప్పాను. వెనక వాళ్ళు నిద్రపోతున్నారు, పడిపోతారు, ముందు కూర్చోబెట్టుకోండి అని.
ఇక నడకవచ్చిన పిల్లలను బయటకు తీసుకెళ్ళేటప్పుడు రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తుంటారు. అలా ఎప్పుడూ చేయవద్దు. వాళ్ళను రోడ్డుకు చివరన చేయి పట్టుకుని నడిపిస్తూ, పెద్దవాళ్ళు రోడ్డు మీద నడవాలి. వాహనాలు వచ్చేటప్పుడు పెద్ద వాళ్ళు తప్పుకున్నట్లు చిన్నపిల్లలు తప్పుకోలేరు, పాపం వాళ్లకు తెలియదు కూడా. అలాగే కార్లలో పిల్లలను తీసుకుని వెళ్లే వాళ్ళు, ఏమిచేస్తారంటే దుకాణంలో కొనాల్సినవి ఏమైనా ఉంటే పిల్లలను కార్లో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను అని లాక్ చేసి వెళ్తారు. ఎప్పుడు అలాంటి పనులు చేయవద్దు. పిల్లలను మీతో దుకాణంలోకి తీసుకెళ్లండి లేదా ఇంటికి వచ్చి తండ్రికి బాధ్యత ఒప్పచెప్పి వెళ్ళండి లేదా పెద్దవాళ్ళు ఉంటే వాళ్లను కాసేపు చూడమని చెప్పాలి. వాయిదా వేసే పని అయితే వాయిదా వేయాలి.
పిల్లలను కళ్ళల్లో వత్తులేసుకుని పెంచాలి. ఎంతో జాగ్రత్ర వహించాలి. వాళ్లకు నడక వచ్చిన దగ్గర నుండి ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఇంటి పనులు ఉన్నా పిల్లలను నిద్ర పుచ్చి చేసుకోవాలి. అలాగే పనులు చేసి చేసి అలసిపోయినప్పుడు, కాసేపు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తే, వాళ్ళను మీతో పాటు పడుకోబెట్టుకోవాలి. అంతే కాని వాళ్ళను వదిలేసి నిద్రపోకూడదు. ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి నాన్న. పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యేవరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాదు వాళ్లకూ ఎన్నో జాగ్రత్తలు చెప్పాలి. అవేంటో వచ్చే వారం చెప్తాను. ఉంటాను చిట్టితల్లి
అమ్మ లేఖ
ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి
తల్లి స్పర్శ ఎంతో ధైర్యం
- Advertisement -
- Advertisement -



