గృహిణుల సమస్యలు వేరు. ఉద్యోగినుల సమస్యలు వేరు. గహిణులైన ఉద్యోగినుల సమస్యలు అంతకన్నా వేరు. వాటిని వివరించి విశ్లేషించడంలో ఈ కథలు విభిన్నంగా రూపొందాయి. ఇవి ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీల అస్తిత్వ ఆకాంక్షలను పట్టిచూపుతాయి. ఇంటా- బయటా వారు సమస్యలను ఎదుర్కొన్న రీతిని వివరిస్తాయి. అలాగే కన్జ్యూమరిజం వెల్లువలో కొట్టుకుపోతున్న మధ్యతరగతి మనస్తత్వాన్ని ఎత్తిచూపుతాయి. చిన్న వయసులో వితంతువుగా మారిన అమ్మాయికి మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన తలపెట్టకుండా, ఆచారాలు సంప్రదాయాలతో సాటి మహిళపై తమ ఆధిపత్య భావజాలాన్ని రుద్దడం అమలక్కలకు మామూలు ఐపోయిందని ‘శ్రావణమాసం’లో చూడవచ్చు. తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద అమతవల్లి ఆ ఆఫీసులో చేరి తన పనులతో, మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆఫీసు వాళ్ళు, శ్రేయోభిలాషులు ఎంతమంది చెప్పినా తమ్ముడు చేతికందే వరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటుంది.
” అమతవల్లి పెళ్లి” ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. ఆదిపత్య ధోరణులతో ఆడపిల్లవారిని వేధించే హై క్లాస్ సొసైటీ సంబంధాన్ని ”ఔను, నాకు నచ్చలేదు” అని తిరస్కరించిన పెళ్లికూతురు కథ ఒకటి. ప్రసవానంతరం సెలవుల తర్వాత ఉద్యోగానికి పోవాలంటే పిల్లను చూసుకునే బాధ్యత తండ్రికి కానీ, తాత నాన్నమ్మలకు కూడా ఏ బాధ్యత లేదా? ఎవరు పట్టించుకోకపోతే ఎలా? పాపతో పాటు తనకు ఉద్యోగం కూడా ముఖ్యం మరి. ఈ సమస్యకు పరిష్కారం ఏది? అని చర్చించే కథ మరొకటి. ఇంట్లో చాకిరి, బయట ఉద్యోగం చేసే మహిళల జీవితంపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. ప్రమోషన్ మీద దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగిని తన తెలివితేటలతో ఆఫీసును చక్కదిద్ది మంచి పేరు తెచ్చుకుంటుంది. ఆమె లేని కొరతతో ఇంటి సభ్యులకు కూడా ఆమె విలువ తెలిసి రావడం ”స్థానాంతరణ్” లో కనిపిస్తుంది. చాలాసార్లు ఇంటి చాకిరి చేయలేక, ఇంట్లో పీడన భరించలేక ‘ఇంటికన్నా ఆఫీసు పదిలం’ అనుకునే ఉద్యోగినులు కూడా ఉంటారు. కరోనా కాలంలో గహిణులపై పెరిగిన అదనపు బాధ్యతలు – చాకిరీ ఒకవైపు, వలస కూలీల వెతలను మరోవైపు విశ్లేషిస్తూ రాసిన కథ కూడా ఒకటి ఇందులో ఉంది.
నెలసరి దినాల్లో మహిళల బాధలు- అవసరాలు పట్టించుకోక ప్యాడ్ల పబ్లిసిటీలో చూపించే అనౌచిత్యాన్ని ప్రశ్నించిన యువతి ”దూస్రాదిన్” లో కనిపిస్తుంది. అలాగే ఆడవాళ్లు ఎదుర్కొనే మరో సమస్య ”ఫ్రోజెన్ షోల్డర్ ”ను చర్చించిన విధానం బాగుంది. ఆడవాళ్ళపై కొనసాగే లైంగిక వేధింపుల ను వివరించిన కథలు రెండు ఉన్నాయి. ఖాళీగా ఉన్న రైలు పెట్టెలో ఒంటరిగా ఉన్న యువతిని లైంగికంగా వేధించాలని చూసిన వాడికి ఒక హిజ్రా బుద్ధి చెప్పడం ”చప్పట్లు ”కథలో కనిపిస్తుంది. ఓయరిజం లాంటి రకరకాలుగా జరిగే లైంగిక వేధింపులలో పనిచేసే ప్రాంతాల్లో ఆడవాళ్లు చీరలకు బదులుగా ”కాఖి” చొక్కాలు వేసుకోవడం అది ఒక రకమైన భద్రతను కలగ చేస్తుందని నాయిక నిరూపిస్తుంది. ‘సాయం’ కథలో తమ కుటుంబానికి పరిమితం చేసిన అమ్మ ప్రతిభ నైపుణ్యాలు 10 మందికి ఉపయోగపడటం ఎంత ఆశ్చర్యం. తను, తన సంసారం అనే బంధాన్ని దాటేసి విశాల ఆకాశం దిశగా రెక్కలు సాచి పరుగులు తీస్తోంది. ఆమె పరిధి విస్తరించుకొని కొత్త గుర్తింపును పొందడం పిల్లలకు ఆశ్చర్యాన్ని మిగిలిస్తుంది.
అలాగే వెంటిలేటర్ మీద ఉన్న తండ్రిని తన పనులన్నీ పూర్తయి ఫ్రీగా అయ్యేంతవరకు అలాగే ఉంచమని ఇద్దరు కొడుకులు ఆసుపత్రిలో చెబుతారు. వీళ్ళకు తీరిక దొరకలేదు. ఆసుపత్రి వాళ్లకు అందుబాటులో లేకుండా పోతారు. తండ్రి చనిపోయిన రెండు రోజులకు గాని వాళ్లు ఆసుపత్రికి రాలేకపోతారు. అప్పటికే అంతా ముగిసిపోతుంది.” వీడ్కోలు” చెప్పడానికి ఏం లేదు. టీవీ ముందు భార్య, సెల్ ఫోన్ పెట్టుకుని భర్త ,ల్యాప్టాప్ ముందు సెల్ ఫోన్ లోనూ పిల్లలు. ఎవరి చదువు ఎవరి ముచ్చట్లు ఎవరి లోకం వారివి. అందుకని నిర్మల భర్తతో చర్చించి, తమ ఆరోగ్య సమస్యలు అదుపులో ఉన్నప్పటికీ లేనిపోనివి చెప్పి వారిని హడలగొడుతుంది. అప్పుడు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన పిల్లలకు పని అలవాటు అవుతుంది, ఇంటి పట్ల పెద్దవాళ్ల పట్ల బాధ్యత తెలుస్తుంది. తమ ఆరోగ్యం కూడా కాస్త బాగుపడుతుంది. అన్నింటిని మించి అందరూ కలిసి పని చేసుకుంటూ సమయం గడిపే అవకాశం ఉంటుందని నిర్మల” టైం జోన్” లో నిరూపిస్తుంది. కోవిడ్ లో ఇంటికి ఆఫీసుకి తేడా లేకుండా పోయింది. కోవిడ్ పోయినా బాసు మాత్రం అదే పద్ధతి కొనసాగిస్తుంటాడు. సెలవు దొరికిన ఆదివారం పూట కూడా గంటలు గంటలు జూమ్ మీటింగ్లతో వేధిస్తుంటే అంతా కలిసి బుద్ధి చెప్పిన వైనం ‘జూమ్ అంది నాదం’ లో కనిపిస్తుంది.
జనం దగ్గర డబ్బు పెరిగిపోయింది. దానితో పాటే వస్తు వినియోగం. అడక్కముందే ఇచ్చే అప్పులు, ఆస్తులకై వెంపర్లాటని పెంచాయి. లేని అంతస్తులు, అబద్ధపు ఆడంబరాలను తెచ్చిపెట్టాయి. టీవీలో వచ్చే ప్రకటనలు, ఆన్లైన్ లో చేసే ప్రచారంతో మనకు అవసరము ఉన్నా లేకపోయినా బోలెడన్ని వస్తువులను కొనుక్కుంటున్నాం. కన్జ్యూమర్రిజం మనల్ని ఎంతగా లొంగదీసుకుంటుందో మనమే గుర్తించలేకుండాపోతున్నాం అనే విషయాన్ని వివిధ కోణాల్లో వివరిస్తూ ఐదు కథలలో వివరించిన విధానం పాఠకులను ఆకట్టుకుంటుంది. పర్యావరణ విధ్వంసం మరియు సాంస్కృతిక విధ్వంసాన్ని చర్చిస్తూ రాసిన ‘చాపకింది నీరు’ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది.
ఏ కథ రాసిన దాని మూలాల్లోకి పోయి విశ్లేషించి చర్చించడం ఈ కథలలో ప్రత్యేకంగా కనిపించే లక్షణం. ఉద్యోగినులు అనగానే లైంగిక దోపిడీ ఒకటే గుర్తుకు వచ్చి, అదే పనిగా కథలు రాసుకుంటూ పోవడం అలవాటైపోయింది. అందుకు భిన్నంగా ఉద్యోగినులు పడే బాధలను, వారు ఎదుర్కొనే సమస్యలను, ఉద్యోగినులుగా వారి విజయాలను ఈ కథలలో వారు నమోదు చేయగలిగారు. గృహిణిలుగా, ఉద్యోగినులుగా వారు చేసే ద్విపాత్రాభినయం. రెండు వైపులా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకున్న మహిళలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఆసక్తికరంగా చదివింపజేసే ఈ కథలు స్త్రీవాదానికి సరికొత్త చేర్పుగా నిలుస్తాయి.
- కె.పి.అశోక్ కుమార్
9700000948

