Friday, July 18, 2025
E-PAPER
Homeజాతీయండయాగ్నోస్టిక్స్‌ సెక్టార్‌కు కొత్త సవాలు

డయాగ్నోస్టిక్స్‌ సెక్టార్‌కు కొత్త సవాలు

- Advertisement -

– అమెజాన్‌ రాకతో అనేక అనుమానాలు
– దేశీయ కంపెనీలు, చిన్న కేంద్రాలపై ప్రభావం
– ఉపాధికి దెబ్బ.. రోగి సమాచారం విదేశీ సంస్థ చేతుల్లోకి?
– నిపుణులు, మేధావుల ఆందోళన
న్యూఢిల్లీ :
ప్రపంచంలోని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ భారత్‌లోని డయాగ్నోస్టిక్స్‌ సెక్టార్‌లోకి ప్రవేశించటం అనేక చర్చలకు దారి తీస్తున్నది. అమెజాన్‌ రాక.. భారత్‌లో ఈ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీనిపై ఆధారపడి ఉన్న దేశీయ కంపెనీలు ఎలాంటి ప్రతికూలతలను ఎదుర్కోనున్నాయి? అనే విషయాలపై ఈ మార్కెట్‌లో చర్చ నడుస్తున్నది. విద్యా, వైద్యం వంటి రంగాల్లో అమెజాన్‌ వంటి బహుళజాతి కంపెనీల రాక చాలా ప్రమాదకరమని మేధావులు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడిగా పెట్టిన ప్రతి పైసాకు రెట్టింపునకు మించి లాభాన్ని ఆశించే ఇలాంటి కంపెనీలు ప్రవేశించటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో అమెజాన్‌తో అంతగా ప్రమాదం లేకపోయినా.. భవిష్యత్తులో మాత్రం ఈ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

ఆరు ప్రధాన నగారల్లో సేవలు
ఎట్‌హోమ్‌ ల్యాబ్‌ టెస్టింగ్‌ సర్వీసు ఆఫర్‌తో అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌ పేరుతో ఈ బహుళజాతి సంస్థ గతనెల 22న ఈ రంగంలోకి ప్రవేశించింది. డయాగ్నోస్టిక్‌ రంగంలో గుర్తింపు పొందిన ఆరెంజ్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ భాగస్వామ్యంతో ఇది ప్రస్తుతం భారత్‌లోని ఆరు ప్రధాన నగరాలో అందుబాటులో ఉన్నది. ఈ జాబితాలో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్‌, నోయిడా, ముంబయిలు ఉన్నాయి. అమెజాన్‌ యాప్‌ ద్వారా కస్టమర్లు 800కు పైగా డయాగ్నోస్టిక్‌ పరీక్షలకు బుక్‌ చేసుకునే అవకాశం ఉన్నది. ఇంటి వద్దకు వచ్చి శాంపిళ్లు సేకరించటం, రొటీన్‌ టెస్ట్‌లకు ఆరు గంటల్లో రిపోర్ట్‌లు డెలివరీ చేయటం వంటివి అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌ అందిస్తున్నది. ఇప్పటికే అమెజాన్‌ వైద్య రంగంలో తన అడుగులు వేసింది. అమెజాన్‌ ఫార్మసీ, అమెజాన్‌ క్లీనిక్‌తో పాటు ప్రస్తుత అమెజాన్‌ డయాగ్నోస్టిక్స్‌ను ఈ బహుళజాతి సంస్థ కలిగి ఉన్నది. తమను ఆశ్రయించే కస్టమర్లు వేరే ఏ ఇతర ప్లాట్‌ఫామ్‌లలోకి వెళ్లకుండా పూర్తి సర్వీసులను ఇక్కడ(అమెజాన్‌) పొందవచ్చని ఆ సంస్థ చెప్తున్నది.

మార్కెట్‌ గణాంకాలు ఇలా
2024 ఆర్థిక సంవత్సరం నాటికి భారత డయాగ్నోస్టిక్స్‌ మార్కెట్‌ విలువ 15 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. ఇది 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 35.8 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా. వైద్య రంగంలో ఉన్న అవకాశాల నడుమ డయాగ్నోస్టిక్స్‌ సెక్టార్‌ భారత్‌లో మరింతగా విస్తరిస్తున్నది. దీంతో అమెజాన్‌ వంటి బహుళజాతి కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించటంపై దృష్టి పెడుతున్నాయి. భారత్‌లో దాదాపు మూడు లక్షల డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌లు ఉన్నాయి. ఇందులో ఒక శాతం కంటే తక్కువ మాత్రమే అక్రిడిటేషన్‌ను కలిగి ఉన్నాయి. గతేడాది దేశంలో 2150 మెడికల్‌ ల్యాబ్‌లు మాత్రమే ల్యాబ్‌ అక్రిడిటేషన్‌ సంస్థ ద్వారా గుర్తింపును పొందాయి. ఈ రంగంలో డయాగ్నోస్టిక్‌ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావటానికి గల కారణం ప్రభుత్వాల పర్యవేక్షణ లోపించటమేనని విశ్లేషకులు చెప్తున్నారు.


డయాగ్నోస్టిక్‌ అంటే..?
ప్రపంచంలోని అనేక రంగాలలో హెల్త్‌ సెక్టార్‌ చాలా కీలకమైనది. ఒక వ్యక్తి ఆరోగ్యం విషయంలో కానీ, ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక అంశంలో కాని దీని పాత్ర, వాటా గణనీయమైనది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో ఆరోగ్య రంగంలో భాగమైన డయాగ్నోస్టిక్స్‌ సెక్టార్‌.. మరింతగా విస్తరిస్తున్నది. కొన్ని పరీక్షల ద్వారా వ్యాధిని ముందుగానే నిర్ధారించటం, దాని స్వభావాన్ని తెలుసుకోవటం డయాగ్నోస్టిక్‌లో భాగం. ఇందులో ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌, ల్యాబోరేటరీ పరీక్షలు, ఇమేజింగ్‌ స్కాన్స్‌(సి.టి, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే) వంటివి ఉంటాయి. ఇలా ఒక వ్యాధిని నిర్ధారించటం ద్వారా.. దానికి ఏ చికిత్సను అనుసరించాలి, ఎలాంటి మందులు వాడాలన్నది చెప్పటం వైద్యులకు సులువవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. దాదాపు 70 శాతం వైద్యుల నిర్ణయాలు డయాగ్నోస్టిక్‌ టెస్ట్‌ల ఆధారంగానే ఉంటాయి.

అమెజాన్‌ రాక.. మార్కెట్‌కు కొత్త సవాళ్లు
ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న ఈ రంగంలో ఉన్న లోపాలు అమెజాన్‌ వంటి బహుళజాతి సంస్థలకు అవకాశాలుగా మారాయని వారు చెప్తున్నారు. స్వతంత్ర డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ల ద్వారానే ఈ రంగానికి ఏకంగా 46 శాతం రెవెన్యూ వస్తున్నది. 28 శాతం ప్రయివేటు ఆస్పత్రుల్లో ఉండే ల్యాబ్‌ల ద్వారా, ఆరు శాతం కొన్ని దేశీయ కంపెనీల ద్వారా సమకూరుతున్నది. మిగతా 20 శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ల్యాబ్‌ల ద్వారా వస్తున్నది. అయితే, ఈ-కామర్స్‌ సంస్థ తన ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోట్లాది మంది వినియోగదారులను కలిగి ఉన్న అమెజాన్‌.. భారత్‌లో సులువుగా చొచ్చుకువెళ్లే అవకాశం ఉన్నది. ఆర్థిక వనరులు కూడా మెండుగా ఉన్నాయి. అయితే, భారత్‌లోని డయాగ్నోస్టిక్స్‌ సెక్టార్‌లోకి ప్రవేశించటం దేశీయ కంపెనీలు, స్వతంత్రంగా నడిచే పరీక్షా కేంద్రాలపై ప్రభావం చూపే అవకాశమున్నది. అంతేకాదు, సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్న ల్యాబ్‌లలో ఉపాధి దెబ్బ తింటుంది. ఇక రోగుల నుంచి సేకరించిన సమాచారం విదేశీ కంపెనీ అయిన అమెజాన్‌ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో రోగులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం విషయంలో గోప్యతకు సంబంధించిన అంశంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -