– ప్రయోగాత్మకంగా టెక్నాలజీతో వైల్డ్ సెఫ్టీ
– దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ అటవీ శాఖ చర్యలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పులుల సంరక్షణలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ నాయకత్వంలో హైదరాబాద్ అరణ్యభవన్‌లో స్టేట్-లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించింది. ఈ చర్య పులులను పరిరక్షించేందుకు పెద్ద ఎత్తున ఉపయోగపడనుంది. దాంతోపాటు, పులులు, మనుషుల మధ్య సంఘర్షణను కూడా తగ్గించనుంది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికీ జిల్లాల వారీగా, విడివిడిగా పులుల కదలికలను గమనిస్తుండగా, తెలంగాణ మాత్రం మొత్తం రాష్ట్రం కవర్ అయ్యేలా కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం సర్వ్రతా హర్షం వ్యక్తం అవుతుంది. ఇలాంటి సాంకేతిక వ్యవస్థలు ప్రస్తుతం కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో మాత్రమే కొంతవరకు అమల్లో ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
టైగర్ సెల్ ఎందుకు ?
సాధారణంగా వన్యప్రాణి విభాగాలు తమ తమ పరిధుల్లోనే పని చేస్తుంటాయి. కానీ, తెలంగాణ నూతన టైగర్ సెల్ ఇందుకు వినూత్నంగా ఉన్నది. ఈ విభాగం నిత్యం పులులు, చిరుత పులుల కదలికలను పర్యవేక్షించనున్నది. దాంతోపాటు, పులులు, పులుల మధ్య ఘర్షణ ప్రాంతాలు, మనుషులు, పులుల మధ్య సంఘర్షణ ప్రాంతాలను గుర్తించి నిత్యం నిఘా ఉంచుతుంది. దాంతోపాటు, ఆ ప్రాంతాన్ని అనునిత్యం అంచనా వేస్తూ మ్యాపింగ్ చేసి పెట్టనుంది. దాంతోపాటు, అడవి ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ట్రాకింగ్ చేయనుంది. యాంటీ-పోచింగ్, రెస్క్యూ బృందాల తక్షణ పెట్రోలింగ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ సమగ్రంగా ఒకే చోట నిర్వహించే వ్యవస్థ ఈ టెగల్ సెల్ కింద చేస్తుంది.
పులుల కారిడార్లలో టైగర్ సెల్ ఎలా ఉపయోగం?
రాష్ట్రంలోని కవాల్, ఏటూరునాగారం, కిన్నెరసాని, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లోని పులుల కదలికలు సెల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. వీటితో పాటు మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్-ఉత్తర తెలంగాణ అడవులను ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతాలతో కలిపే ఈ మార్గం దేశవ్యాప్తంగా ముఖ్యంగా టైగర్ కారిడార్‌గా గుర్తించి ఆ ప్రాంతాల్లో నిఘా ఉంచనున్నారు. అయితే, పొరుగు రాష్ట్రాల్లో సరైన పర్యవేక్షణ లేకపోయినా, తెలంగాణ మాత్రం నిరంతర మానిటరింగ్ చైన్‌ను ఏర్పరచి ముందడుగు వేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పులుల సంచారం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్విక్ రియాక్షన్ టీమ్స్‌పై ఈ సెల్‌కు ప్రత్యక్ష నియంత్రణ ఉండనుంది. ఇతర రాష్ట్రాల్లో సాంప్రదాయ పద్ధతిలో జిల్లాల అనుమతులతో ఆలస్యం జరుగుతుంది. తెలంగాణలో మాత్రం టైగర్ కమాండ్ సెంటర్ నుంచే నేరుగా టీంలను పంపే విధానాన్ని ఈ విధానంలో అవలంభించనున్నారు. పులులు గ్రామాల వద్ద కనిపించినా, వేట ముఠాల కదలికలు ఉన్నా, పశువులపై దాడులు జరిగినా, గాయపడిన పులులకు చికిత్స అవసరమైనా-స్పందన మరింత వేగంగా అందేలా వ్యవస్థ రూపొందించి ముందుకు వెళుతున్నారు.
శాస్త్రీయ పద్ధతిలో పులుల సంరక్షణ
టైగర్లపై రేడియో కాలర్ అమర్చే కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రారంభించేందుకు సిద్ధమైందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కర్ణాటక, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఈ విధానాన్ని ఎక్కువగా వాడుతుండగా, ఎన్టీసీఏ అనుమతి లభించిన వెంటనే తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరనుంది. ఈ డేటా మొత్తం టైగర్ సెల్ నుంచే సేకరించి విశ్లేషించబడుతుంది. దాంతోపాటు, జాతీయ టైగర్ లెక్కల్లో తెలంగాణకు అదనపు ప్రయోజనం లభించనుంది.దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో తెలంగాణకు నూతన సెల్ పెద్దగా సహకరించనుంది. కేవలం రిజర్వుల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పులుల కదలిక పెరుగుతున్న వేళ, ఈ సెల్ కీలకంగా మారనుంది. భారతదేశంలో పులుల సంరక్షణకు గట్టి సమన్వయం, సాంకేతిక నిఘా, వేగవంతమైన ఫీల్డ్ స్పందన అవసరమైన ఈ సమయంలో, తెలంగాణ టైగర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెల్ జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతగల ముందడుగుగా నిలవనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అడవులు, వన్యప్రాణులను సంరక్షించడమే మా జెండా… ఎజెండా
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
అడవులు, అడవుల్లో వన్య ప్రాణులను సంరక్షించడమే తమ ప్రభుత్వం జెండా… ఎజెండా అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వన్య ప్రాణులు ఇతర జీవుల మనుగడ మీద మన ఉనికి ఆధారపడి ఉందనే విషయం మనం నిత్యం గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమన్నారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో మనుషులు, వన్య ప్రాణుల మధ్య తరుచూ జరిగే సంఘరణ్షలు, దాడులు నేపథ్యంలో మన రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మనుషులు మరణించారని చెప్పారు. అలాంటి సందర్భాల్లో కొన్ని క్రూర జంతువులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంటుందన్నారు. ఈ నేపథ్యంలో మనుషుల భద్రత, వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 2019లోనే పలు కీలక సూచనలు చేసిందని గుర్తుచేశారు. వాటిన ఆధారంగా తాము ముందుకెళుతున్నట్టు వివరించారు.



