నాలుగు లేబర్‌కోడ్‌లు సంక్షేమం కోసమే.. : విలేకర్ల సమావేశంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్(సెంట్రల్)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశ చరిత్రలో కార్మికుల కోసం నూతన శకం మొదలైందని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) బిస్వా భూషణ్ ప్రుష్టి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని రీజియన్ కార్మిక శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌లు(సెంట్రల్) మహేష్‌ఎం సత్తికార్, రాఘవేంద్రనాయక ఎం, లేబర్ ఎన్ఫోర్‌మెంట్ ఆఫీసర్ ఎల్ మురళీకృష్ణ, ఆఫీసు సూపరిండెంట్ కొండ నాగేశేఖర్‌లతో కలిసి ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పాశ్చాత్య ఆలోచనలను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ, సరికొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని చెప్పారు. ఈ చట్టాలు కార్మికుల సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కార్మిక సంక్షేమం,భద్రత, కనీస వేతనాలు, గౌరవప్రదమైన జీవన విధానానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. అందరికీ కనీస వేతనాలు అందుతాయనీ, తప్పనిసరిగా నియామక పత్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో జాతీయ స్థాయి కనీస వేతనాలకన్నా తక్కువ వేతనం ఇవ్వకూడదని పేర్కొన్నారు. స్త్రీల అనుమతితోఅన్ని రంగాల్లో వారు పని చేయటానికి వెసులుబాటు కల్పించి,వారి రక్షణ, బాధ్యత, యాజమాన్యానిదేనంటూ వివరించారు.
జాతీయ స్థాయిలో కనీస వేతనాన్ని నిర్ణయించడానికి కేంద్రం ఓ కమిటీని నియమిస్తుందనీ, రానున్న 45 రోజుల్లో ఈ నాలుగు కోడ్‌లకు సంబంధించిన పూర్తి నియమ, నిబంధనలను వెల్లడించనుందని కమిషనర్ తెలిపారు. కార్మికులు రోజుకు 8-12 గంటల చొప్పున అంటే వారంలో గరిష్టంగా 48 గంటలు విధులు నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఓవర్‌టైమ్ డ్యూటీ చేసిన వారికి రెట్టింపు వేతనం చెల్లించాలని నిబంధనల్లో పొందుపరిచినట్టు గుర్తు చేశారు.
- వేతనాల కోడ్, 2019 సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి కనీస వేతనం పొందేందుకు అవసరమైన సూత్రాలు ఇందులో ఉన్నాయి. సకాలంలో వేతన చెల్లింపులపై కూడా ఇందులో నిబంధనలు పొందుపరిచారని తెలిపారు.
- పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020లో కార్మికులకు, కంపెనీల యాజమాన్యాలకు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి సంబంధించిన విషయాలు ఉన్నాయని చెప్పారు.
- సామాజిక భద్రత కోడ్, 2020 సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులతో పాటు గిగ్ వర్కర్లకు లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్స్‌కు ఉద్దేశించిన అంశాలను ఇందులో పొందుపరిచారని తెలిపారు.
- వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్ 2020 పని ప్రాంతాల్లో కార్మికులకు వ్యక్తిగత, వత్తిపరమైన భద్రత, వారి ఆరోగ్యం, పరిహారానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయని వివరించారు.



