Monday, April 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబయో ఇంధనరంగంలో నవశకం

బయో ఇంధనరంగంలో నవశకం

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి భేషజాలు లేవు : ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
రాజకీయాలకు అతీతంగా పరిశ్రమకు ఏర్పాటుకు సహకరించాలి : మాజీ మంత్రి హరీశ్‌ రావు

నవతెలంగాణ-నంగునూరు
స్వచ్ఛ ఇంధన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణలో బయో ఇంధనరంగం నవశకం కానుందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో రూ.210 కోట్లతో నిర్మించ నున్న జూనో జుల్‌ బయో ఫ్యూయల్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌(సీబీజీ) ప్రాజెక్టు మొదటి దశకు ఆదివారం భూమిపూజ చేశారు. రాజ్యసభ సభ్యులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మెన్‌ భువనేశ్వర్‌ కలిత, పర్యావరణ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌, కేరళం లోకసభ సభ్యులు ఎన్‌. కె. ప్రేమచంద్రన్‌, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు, జూనో జుల్‌ బయో ఫ్యూయల్‌ ఫ్యాక్టరీ సీఈవో నాగ శరత్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే సీఎం రేవంత్‌ రెడ్డి లక్ష్యమని, తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన మంచి పనులను కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేశారు. పరిశ్రమ ఏర్పాటు కోసం ఆన్‌ లైన్లో రెండు నెలల క్రితం దరఖాస్తు చేసిందే తరువాయి పారదర్శకంగా అనుమతులు ఇచ్చి పరిశ్రమ ప్రారంభించు కోవడం జరిగిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రాజకీయాల కతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా పరిశ్రమకు సహకరించాలి : మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు
పరిశ్రమల ఏర్పాటుకు రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీ, కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్రాజెక్టు ప్రారంభం అయ్యాయని తెలిపారు. సాగునీరు రావడంతో జిల్లాలో 80 వేల ఎకరంలో వరి సాగవుతుందని అన్నారు. రైతులకు వరి ధాన్యంతో పాటుగా, వరి వ్యర్ధ పదార్ధాలను నుండి అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. అమెరికా ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో కొరత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో బయో గ్యాస్‌ ప్రాజెక్టు పరిశ్రమల ఏర్పాటు దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వారు పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తే అక్కడి వారు సహకరించాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు.

తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా ప్రాంత పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించడం శుభ పరిణామమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ వారు ఎవరైనా పరిశ్రమ స్థాపనకు ముందుకు వస్తే సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కోరారు. పర్యావరణ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మెన్‌, లోకసభ సభ్యులు ఎన్‌.కె.ప్రేమచంద్రన్‌, రాజ్యసభ సభ్యుడు భువనేశ్వర్‌ కలిత మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి ప్రాజెక్టు నిర్మాణం రావడం శుభపరిణామమన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధి కారులు కె.శశాంక, జె.నిఖిల్‌ చక్రవర్తి, పి.వి.రమేశ్‌, ఎస్‌.వి.పిళ్ళై, గ్రామ సర్పంచ్‌ శనిగరం స్వాతి బాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దేవులపల్లి యాదగిరి, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -