Sunday, October 12, 2025
E-PAPER
Homeసోపతిఇందూరు ఖిల్లా మీద కొత్త గేయాల జండా

ఇందూరు ఖిల్లా మీద కొత్త గేయాల జండా

- Advertisement -

ఇటీవల బాల సాహిత్యంలో అటు వేదిక ద్వారా, ఇటు వ్యక్తిగతంగా కృషి జరుగుతున్న ప్రాంతం ఇందూరు జిల్లా. తొలి నుండి ఇక్కడ బాల సాహిత్యం, వికాసంలో పని జరుగుతోంది. అందులోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన తొలి కార్యశాలల కార్యక్షేత్రంలో నిజామాబాద్‌ ఒకటి. బాల సాహిత్యంతో పాటు బాలలు రాసిన సాహిత్యం కూడా నిజామాబాద్‌లో సమాన పాయలుగా ఇక్కడ సాగడం విశేషం. ఈ రెంటిలో కృషి చేస్తున్న ఇందూరుకు చెందిన ఉపాధ్యాయిని, బాల సాహితీవేత్త శ్రీమతి బిల్ల అలివేణి. ఈమె నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని నాగేపూర్‌లో 11 జూన్‌, 1976 ను పుట్టిన అలివేణి తల్లితండ్రులు శ్రీమతి బిల్ల నాగుబాయి-శ్రీ నర్సయ్యలు.

పదవ తరగతిలోనే వివాహం రీత్యా చదువు మధ్యలో ఆగిపోగా తరువాత పట్టుదలతో చదివిన అలివేణి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ.తో పాటు తెలుగు పండిత శిక్షణ పూర్తిచేశారు. పట్టుదలతో చదివి ఉపాధ్యాయురాలిగా ఎంపికై తెలుగు ఉపాధ్యాయినిగా ఉన్నారు. తన బాధ్యతగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా కవయిత్రిగా, అనేక కవితలు రాసి ఉద్యమ సభలో వినిపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిపట్ల సహానుభూతితో రాసిన ‘ఓల్ల కోసం’ కవిత రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ‘ఎవుసాయం’ అనే పాట కూడా అనేక మంది మెప్పు పొందింది. తన ఊరిమీద మమకారంతో ‘మా ఊరికి రండి’ అంటూ రాసిన వ్యాసం, ఇతర రచనలు రచయిత్రిగా అలివేణిని పరిచయం చేస్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య ప్రతిభా పురస్కారం మండల స్థాయిలో సాహిత్యం అందుకున్న వీరు, చైతన్య వేదిక హైదరాబాద్‌ వారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ప్రపంచ తెలుగు మహాసభల సత్కారం అందుకున్నారు. వివిధ కవి సమ్మేళనాల్లో పాల్గొని సత్కార సన్మానాలు అందుకున్నారు. బడిని, పిల్లలను ప్రేమించే అలివేణి తన బడినే కార్యక్షేత్రంగా చేసుకుని బోధనతో పాటు భాషలో బాలబాలికల సర్వతోముఖ అభివృద్ధికి దోహదపడే విధంగా గేయాలను, కథలను, ఇతర ప్రక్రియలు రూపాల్లో రచనలు చేసింది. తాను స్వయంగా బాలల కోసం రచనలు చేయడమే కాక తన బడి పిల్లలతో రచనలు చేయించి పుస్తకంగా తెచ్చింది. నిజానికి బడి పిల్లల రచనల యజ్ఞం ఇవ్వాళ్ళ తెలుగునాట విరివిగా వస్తోంది. అందులోను నిజామాబాద్‌ కూడా ఉంది. అయితే ఇటీవల వచ్చిన బడి రచనల గురించి నమోదైంది కానీ 2015 లోనే అలివేణి పుస్తకం తెచ్చినప్పటికీ ఎక్కడా నమోదు కాలేదు. అందులోనూ బాల సాహితీ సమితి- సాలూర పేరుతో ఈ పుస్తకం రావడం మరో విశేషం. అంతేకాదు, ఇందులోని పిల్లల రచనలు కూడా చక్కగా ఉన్నాయి.

అలివేణి మాట పాట లలిత పల్లవంగా సాగుతాయి. బహుశ: బోధన కూడా! అది ఆమె బాల గీతం చెబుతుంది. అచ్చంగా పట్టిచూపుతుంది. ‘అమ్మా అమ్మా వండమ్మా/ అన్నం కూర పెట్టమ్మ/ బడికి త్వరగా వెళ్ళాలి/ అఆలన్నీ చదవాలి’, ‘ఇది మా బడి/ ఇదే ఇదే మా చదువుల గుడి/ ఇల్లూ వాకిలి మురిపించే/ ఇంద్రుని వనం ఇది’ అంటూ సాగుతాయి ఆమె గీతాలు. పిల్లలకు బడిలో వర్ణమాల నేర్పుతున్న క్రమంలో ప్రతి అక్షరానికి ఒక పాటను కూర్చుకుని, పిల్లలకు బోధించడం చేసేవారు. అలా ప్రతి అక్షరానికి ఒక గేయం చొప్పున రాసి వాటిని లయాత్మకంగా చెబుతూ పిల్లలకు కంఠస్థం అయ్యేలా చేయడం బోధనలో అలివేణి ఏర్పరుచుకున్న పద్ధతి. 2013 నుంచి ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మాతభాష దినోత్సవం సందర్భంగా ‘బాల కవి సమ్మేళనం’తో పాటు 108 మంది విద్యార్థులతో 108 పద్యాలతో ‘పద్యాల తోరణం”వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ సామాజిక సమస్యలను అంశంగా తీసుకొని పిల్లలతో నాటికలు వేయించారు. బాల బాలికలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలన్న ఆలోచనతో వారిని రేడియో కార్యక్రమాలవైపు ప్రోత్సహించి, కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారు. ఈ టీచరమ్మకు గేయంపై మక్కువకు ఉదాహరణగా… ‘టప టప వాన కురిసింది/ చిటపట చినుకు రాలింది/ రైతు కట కట తీరింది/ పల్లె పాట మొదలైంది’, ‘అమ్మ నోము పంట/ నాన్న కన్నుల జంట/ పాపాయి ప్రాణ ప్రదమే/ ఇంటిల్లి పాదికి’ అనేవి నిదర్శనం. ఆడపిల్ల గురించి ఎంత అందంగా చెప్పిందో చూడండి… ‘ఆడపిల్ల పుట్టిందంటె/ అష్టలక్ష్మి వచ్చినట్లే/ అమ్మాయి నవ్విందంటె/ సన్నాయి పలికినట్టే/ చిట్టితల్లి అలిగిందంటే/ చిలుక ముక్క తిప్పినట్టే’ నట. విజ్ఞానాన్ని వినోదాన్ని జతకలుపుతూ రాసిన లయాత్మక గేయం ‘నీటి పాట’లో ‘చెరువులో నీరు ఏమాయెనంట/ ఎండకు ఎండి ఇంకిపోయె నంట/ ఎండలో నీరు ఏమాయె నంట/ నీరంత ఆవిరై పైకి పోయెనంట/ పైకి పోయిన ఆవిరి ఏమాయెనంట/ మబ్బుగా మారి మల్లి వచ్చెనంట/ మబ్బులన్ని కలిసి ఏమాయెనంట/ పిల్లగాలి తగిలి చల్లబడెనంట/ చల్లబడిన మబ్బులు ఏమాయెనంట/ చినుకుగా మారి నేల రాలెనంట/ చెరువులు వాగులు నిండిపోయెనంట’ అంటారు. ఇంకా ‘ఊరుకోరా నాన్న!/ ఊరుకో కన్నా!/ ఊరికె చెప్పను/ ఊకదంపుడు మాట/ చంద్రున్ని తెచ్చేను/ చేతి కందించేను/ ఊయలలో పాప/ ఊరుకో పాప’, ‘ఉప్పులేని కూర చప్పన/ ఉడత సాయం గొప్పన/ ఉల్లి చేసే మేలు వేనవేలు/ ఊ కొడితే చెప్తావు/ కథలు చాలా చాలా’ వంటి గేయాలు రాశారు. అందరు తెలంగాణ రచయిత్రులలాగే పుస్తకం తేవాలన్న సోయి లేకపోవడంతో వీరి పేరు నమోదుకాలేదు. త్వరలో ఇందూరు ఖిల్లా మీద మరో బాల సాహిత్య గేయ పతాకం పుస్తకమై రెపరెపలాడాలని కోరుతూ… జయహో బాల సాహిత్యం!

  • డా|| పత్తిపాక మోహన్‌
    9966229548
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -