Saturday, March 7, 2026
E-PAPER
Homeజాతీయంగ్రామ్‌జీతో కొత్త సమస్య

గ్రామ్‌జీతో కొత్త సమస్య

- Advertisement -

40 శాతం నిధులు రాష్ట్రం భరించాలి
శాసనసభలో సిఎం
అభివృద్ధి వికేంద్రీకరణకు మూడు రీజియన్లుగా రాష్ట్రం

అమరావతి : ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ్‌జీతో రాష్ట్రానికి కొత్త సమస్య వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బడ్జెట్‌ డిమాండ్ల ఆమోదం సందర్భంగా శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం ప్రస్తావించారు. గ్రామ్‌జీతో రాష్ట్ర ఖజనాపై అదనపు భారం పడుతుందని చెప్పారు. ‘కొత్తగా ఒక సమస్య వచ్చింది. నరేగా స్థానంలో గ్రామ్‌జీ వస్తోంది. దీనిలో 40శాతం వాటా మనం భరించాలి..’ అని ఆయన అన్నారు. ‘అయినా ఫర్వాలేదు. బడ్జెట్‌ తగ్గకుండా నిధులు కేటాయిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ, పవన్‌కల్యాణ్‌ సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతున్నామని అన్నారు.

ఎన్‌డిఎ పక్ష పార్టీలన్నీ సమన్వయంతో వెళ్లబట్టే అనుకున్నది సాధించామని అన్నారు. గత ప్రభుత్వ హయంలో జలజీవన్‌ మిషన్లో రూ.85 వేల కోట్లు రావాల్సి ఉంటే రూ.25 వేల కోట్లకు ప్రతిపాదనలు పెట్టారని, ఐదేళ్లలో చేసింది రూ.2,500 కోట్ల పనులేనని తెలిపారు. ఎంఆర్‌ఓ ఆఫీసు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సర్క్యూట్‌ హౌస్‌ వంటివి కూడా తాకట్టు పెట్టడంతోపాటు, 12 శాతం వడ్డీతో అప్పులు తెచ్చారని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రూ.43,298 కోట్ల అప్పులు రీషెడ్యూలు చేయించామని, దీనివల్ల రూ.1,658 కోట్ల ఆర్థిక వెసులుబాటు వస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు.

కేంద్రం సాయంతో అమరావతి రాజధానిని ట్రాక్‌లో పెట్టామని, మూడేళ్లలో రాజధానికి ఒకరూపు వస్తుందని తెలిపారు. వచ్చే సెషన్‌కు ఎమ్మెల్యేలు, మంత్రులు రాజధానిలో వారి క్వార్టర్లలో ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కేంద్రం నిధులతో విశాఖ ఉక్కును కాపాడుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇస్తోందని, తొలిసారి ప్లాంటు లాభాల్లోకి వచ్చిందని అన్నారు. నీటి భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు రూ.3850 కోట్లు ఖర్చుపెట్టి అనంతపురం జిల్లాకు 55 టిఎంసిలు తీసుకెళ్లామని తెలిపారు. భూగర్భ జలాలు పెరగడంతో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం తగ్గిందని, గత పాలకులు ప్రజలపై రూ.32 వేల కోట్ల భారాలు వేశారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఐదు లక్షల మందిని మహిళా పారిశ్రామివేత్తలుగా చేస్తామని తెలిపారు.

16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధంపై చర్చ
16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియాను నిషేధించే అంశంపై చర్చిస్తున్నామని, 13 ఏళ్లలోపు వారికి ఖచ్చితంగా నిషేధిస్తామని చంద్రబాబు చెప్పారు. సాంకేతికతను చక్కడా వాడుకుంటే ఆయుధంగా ఉంటుందని, వ్యసనంలా మారితే ప్రమాదంగా మారుతుందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సోషల్‌ మీడియా వల్ల పిల్లలు నష్టపోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. వైట్‌కాలర్‌ నేరాలు పెరిగాయని, డిజిటల్‌ క్రైమ్స్‌, సోషల్‌మీడియాలో సైకోలు అరాచకం చేస్తున్నారని పేర్కొన్నారు.

మహిళలపై నేరాలకు పాల్పడితే అదే వారికి చివరిరోజు అవుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలా నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. మూడు ప్రాంతాల్లో ఎకనామిక్‌ రీజియన్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సుప్రీం కోర్టు అనుమతితో బెంచ్‌ సాధించుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉగాది నాటికి మూడు లక్షల గృహ ప్రవేశాలు చేయించేలా చర్యలు తీసుకుంటున్నామని సిఎం చెప్పారు. హెల్తీ, వెల్తీ హ్యాపీ సొసైటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటు న్నామని అన్నారు. యోగా, నేచురోపతిని జోడించి ప్రజారోగ్యాన్ని కాపాడతామని తెలిపారు. ప్రిడెక్టివ్‌, ప్రివెంటివ్‌, క్యూరేటివ్‌ విధానంలో ప్రజారోగ్యాన్ని సంక్షేమాన్ని సంరక్షిస్తామని పేర్కొన్నారు.

నేరాలను కట్టడి చేస్తాం
ఫ్యాక్షనిజాన్ని కట్టడి చేశామని, నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సిఎం తెలిపారు. మావోయిస్టులను కట్టడి చేశామని అన్నారు. ఇప్పుడు కొత్తగా రప్పా రప్పా రాజకీయం వచ్చిందని, ఏదైనా రాజకీయ నాయకుడు పర్యటన చేస్తే రప్పారప్పా ఏమిటని ప్రశ్నించారు. ‘ పెళ్లికి వెళ్లినా ఇదేతంతా …రక్షణకు వెళ్లిన ఎస్‌ఐ గాయపడాలా’ అని ప్రశ్నించారు.

అసెంబ్లీ నిరవధిక వాయిదా
అసెంబ్లీ సమావేశాలను నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ మేరకు శాసనసభలో స్పీకర్‌, మండలిలో ఛైర్మన్‌ శుక్రవారం ప్రకటించారు. 16వ శాసనసభ ఐదవ సమావేశాలు 15 రోజుల్లో 72.14 గంటలు కొనసాగాయని స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ కాలంలో 18 బిల్లులను ఆమోదించినట్లు చెప్పారు. 166 పాఠశాలల నుండి 6,693 మంది విద్యార్థులు సమావేశాలను వీక్షించారని తెలిపారు. 122 ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు . ఒక లఘు చర్చ జరిగిందని వివరించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -