సీజ్‌ఫైర్‌పై ట్రంప్ వ్యాఖ్యలు అసత్యం, నిరాధారం : ఇరాన్
అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపునకు ట్రంప్ సంకేతం
ఒప్పందం తప్పనిసరి కాదని వ్యాఖ్య
యుద్ధం కొనసాగిస్తాం : నెతన్యాహు
ఇరాన్‌లో క్యాన్సర్ మందుల తయారీ కేంద్రంపై ఇజ్రాయిల్ దాడి
నాటో ఒక కాగితపు పులి
దాని నుంచి తప్పుకుంటాం
బ్రిటన్‌కు నౌకాదళమే లేదు : ట్రంప్
నాటో అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే అంశంపై దౌత్యపరమైన సదస్సు : యూకే ప్రధాని స్టార్మర్
ఇరాన్‌పై యుద్ధానికి దిగిన ట్రంప్ పరిస్థితి ఇరకాటంలో పడింది. దాన్నుంచి బయటపడటానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. రోజుకో మాట..పూటకో నాటకం అన్న తరహాలో ఇరాన్‌ను తమ చేతుల్లోకి తీసుకోవాలనే యత్నాలకు సానపెడుతూనే ఉన్నారు. ఓవైపు యుద్ధం ముగింపుదశలో ఉందని ట్రంప్ అంటుంటే…యుద్ధాన్ని ఆపబోమని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరోవైపు సీజ్ ఫైర్‌పై ట్రంప్ వ్యాఖ్యలు అసత్యమని, నిరాధారమని ఇరాన్ అంటోంది. దీనికి తోడు నాటో నుంచి తప్పుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై బ్రిటన్ గుర్రు మంటోంది. హార్ముజ్ జలసంధిని తెరిచే అంశంపై దౌత్యపరమైన మార్గమే పరిష్కారమని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ట్రంప్‌నకు హితవుపలకటం గమనార్హం.
వాషింగ్టన్ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం 33 రోజులకు చేరింది. అయితే బుధవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్య ముగింపు దశలో ఉందని స్పష్టం చేశారు. అమెరికా సైన్యం చాలా త్వరలోనే.. రెండు లేదా మూడు వారాల్లోనే వెనక్కి వెళ్లే అవకాశం ఉందని వివరించారు. ఇది ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన అత్యంత స్పష్టమైన సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. శ్వేతసౌధంలో ట్రంప్ మాట్లాడుతూ… యుద్ధం ముగించడానికి ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ”ఇరాన్‌తో ఒప్పందం చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయినప్పుడు మాత్రమే వెళ్తాము” అని తెలిపారు. ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వం ఇరాన్‌కు 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రతిపాదన ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా అణ్వాయుధాల అభివృద్ధి నిలిపివేయడం, యురేనియం శుద్ధి పూర్తిగా ఆపడం, హార్ముజ్ సముద్ర మార్గాన్ని పూర్తిగా తెరవడం వంటివి ఉన్నాయి.
అయితే ఈ షరతులను ఇరాన్ అంగీకరించకపోతే.. సైనిక చర్యలు మరింత తీవ్రతరం కావచ్చని అమెరికా హెచ్చరించింది. అమెరికా రక్షణ కార్యదర్శి పెటె హెగ్‌సెత్ కూడా యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్‌తో ఒప్పందానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు ఇరాన్ నుంచి మాత్రం ప్రతిస్పందన కఠినంగా ఉంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా కంపెనీలపై దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి. ఇందులో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, టెస్లా, బోయింగ్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మాట్లాడుతూ.. అమెరికా నుంచి సందేశాలు వస్తున్నాయనీ, కానీ అవి అధికారిక చర్చలు కావని చెప్పారు. అయితే ఇరాన్ మాత్రం మరింత కఠిన వైఖరితో ఉందని స్పష్టమవుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ.. ట్రంప్ చేసిన తాజా ప్రకటన యుద్ధం ముగింపు దిశగా కదులుతోందని సూచిస్తున్నటు విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇరాన్ వైఖరి, భద్రతా పరిస్థితులు ఈ ప్రక్రియలో కీలకంగా మారనున్నాయని వివరిస్తున్నారు.
ఇరాన్‌పై యుద్ధంలోకి దిగం : యూకే ప్రధాని కీర్ స్టార్మర్
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు బ్రిటన్ నడుం బిగించింది. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే అంశంపై త్వరలోనే ప్రపంచ దేశాలతో దౌత్యపరమైన సదస్సు నిర్వహించనున్నట్టు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. ఈ సదస్సుకు బ్రిటన్ విదేశాంగ మంత్రి నాయకత్వం వహించనున్నట్టు తెలిపారు. హర్మూజ్ జలసంధి గుండా భద్రతను బలోపేతం చేయడంతో పాటు నిత్యావసర వస్తువుల రవాణాను పునరుద్ధరించేందుకు 35 దేశాలు తమతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. అందుకు సంబంధించిన ప్రకటనపై ఆయా దేశాలు సంతకాలు చేశాయని వెల్లడించారు.
ఇరాన్ యుద్ధంలోకి తాము దిగమని స్పష్టం చేసిన స్టార్మర్, అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల బ్రిటన్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. చర్చలు సఫలం అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని స్టార్మర్ వెల్లడించారు. ”ఎంత ఒత్తిడిలో ఉన్నా అన్ని నిర్ణయాలను బ్రిటన్ జాతీయ ప్రయోజనాల కోసమే తీసుకుంటాను. అందుకే ఇది మన యుద్ధం కాదని, అందులోకి రావడం లేదని చాలా స్పష్టంగా చెప్పాను. ఇరాన్-అమెరికా యుద్ధం రెండో నెలకు చేరుకుంది. ఈ సంక్షోభంతో పెరిగిన జీవన వ్యయాల కారణంగా బ్రిటన్?పై గణనీయ ప్రభావం ఉంటుంది. బ్రిటన్‌కు యుద్ధం చేయాల్సిన అవసరం, ఆసక్తి లేవు.. యుద్ధం, ఇంధన సంక్షోభం వల్ల పలు దేశాల్లో ధరలు పెరుగుతున్నాయి.”అని బ్రిటన్ ప్రధాని తెలిపారు.
ఇరాన్‌లోని క్యాన్సర్ మందుల తయారీ కంపెనీపై ఇజ్రాయిల్ దాడి
–టెహ్రాన్
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని తోఫిగ్ దారు మందుల తయారీ కంపెనీపై అమెరికా, ఇజ్రాయిల్ సైన్యం దాడి చేసినట్టు స్థానిక మీడియా మంగళవారం తెలిపింది. తోఫిగ్ దారు పరిశోధన, ఉత్పత్తి కేంద్రం పలు క్యాన్సర్‌లకు చికిత్సను అందిస్తోందని, ఇది ఇరాన్ ఆరోగ్య సంరక్షణలో కీలకమైనదిగా పేర్కొంది. బాంబు దాడితో భవనంలోని పలు సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది.ఈ దాడి అనంతరం నష్టానికి సంబంధించిన చిత్రాలను స్థానిక మీడియా విడుదల చేసింది. వైద్య కేంద్రం లక్ష్యంగా దాడి చేయడం కొనసాగుతున్న యుద్ధంలో ప్రమాదకరమైన వైఖరిని సూచిస్తుందని పేర్కొంది. ఇది పౌరులకు అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణపై నేరుగా ప్రభావం చూపుతుందని మీడియా తెలిపింది. ఈ దాడిని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ తీవ్రంగా ఖండించారు. ఇది మౌలిక సదుపాయాలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఇజ్రాయిల్‌లోని యుద్ధ నేరగాళ్లు నేడు బహిరంగంగా, అనైతికంగా ఔషదాల తయారీ కేంద్రంపై దాడి చేశారని, దీంతో వారి యుద్ధ ఉద్దేశం స్పష్టమైందని అన్నారు. అయితే వారు నిస్సహాయులైన పాలస్తీనియా పౌరులతో వ్యవహరించడం లేదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అంతర్జాతీయ ఆంక్షలతో ప్రాథమిక వైద్య సామాగ్రి దిగుమతికి ఆటంకం కలుగుతుండటంతో .. మందుల తయారీలో టోఫిగ్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించారు. ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా, తమ ప్రజలకు ప్రాణరక్షక మందులను అందించే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుందని, దీంతో ఇప్పటికే ఉన్న మానవతా సంక్షోభాన్ని తీవ్రతరం చేసిందని అన్నారు.క్యాన్సర్ మందులను ఉత్పత్తి చేసే కేంద్రంపై జరిగిన దాడి, క్యాన్సర్ రోగులకు వైద్య సేవలు, కీలకమైన సామాగ్రి కొరతను ఆయుధంగా వాడుకుని, అత్యవసర ఆరోగ్య సంరక్షణను యుద్ధసాధనంగా మారుస్తోందని అన్నారు. ఈ చర్య అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా, సంక్షోభాన్ని మరింత పెంచడం ద్వారా అంతర్జాతీయ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పు కలిగిస్తోందని అన్నారు.
కాల్పుల విరమణ అబద్ధం : ఇరాన్
పశ్చిమాసియాలో యుద్ధం మొదలై 33వ రోజుకు చేరుకుంది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధం ఉన్నారని లీకు వార్తలు వస్తున్నాయి. కానీ అమెరికా దాడులను ఉద్రిక్తతం చేస్తోంది. పశ్చిమాసియాలో సైన్యాన్ని కూడా మోహరిస్తోంది. అమెరికాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ చెబుతోంది. సీజ్ ఫైర్‌పై ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం, నిరాధారమైనవని ఇరాన్ స్పష్టంచేసింది.
నాటో అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి: స్టార్మర్
ట్రంప్ విమర్శలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అంతే ఘాటుగా స్పందించారు. నాటో పట్ల బ్రిటన్‌కు పూర్తి విశ్వాసం, నిబద్ధత ఉన్నాయని స్పష్టం చేశారు. ‘నాటోను ప్రపంచం చూసిన అత్యంత శక్తివంతమైన ఏకైక సైనిక కూటమి’గా ఆయన అభివర్ణించారు. ‘నాపై లేదా ఇతరులపై ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత రచ్చ జరిగినా, నేను తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ బ్రిటన్ జాతీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తాను’ అని ఆయన స్పష్టం చేశారు. ఇంతకు ముందు హార్ముజ్ జలసంధిని ఇరాన్ నుంచి విడిపించేందుకు మిత్రదేశాలు కలిసి రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
కానీ ఆయనకు మిత్ర దేశాల నుంచి ఏ మాత్రం సహకారం అందలేదు. ఇరాన్‌తో యుద్ధం చేయడానికి యూఎస్ మిత్రదేశాలు ఏవీ ముందుకు రాలేదు. దీనితో ట్రంప్ బ్రిటన్, ఫ్రాన్స్‌లపై మండిపడ్డారు. వారు పిరికిపందలని విమర్శించారు. వారి అవసరం అమెరికాకు లేదని అన్నారు. తమకు సాయం చేయని నాటో దేశాలను తప్పక గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు. తామే ఒంటరిగా ఇరాన్ ఆటకట్టిస్తామని పేర్కొన్నారు. అయినప్పటికీ ట్రంప్ హెచ్చరికలను యూఎస్ మిత్రదేశాలు పట్టించుకోలేదు.
నాటో ఒక కాగితపు పులి: ట్రంప్
ఇరాన్‌తో యూఎస్ చేస్తున్న యుద్ధానికి మిత్రదేశాలు మద్దతు తెలపని నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటో కూటమి నుంచి అమెరికా తప్పుకోవడం గురించి తాను తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాటో కూటమిని ఒక ‘కాగితపు పులి’గా ట్రంప్ అభివర్ణించారు. ఆ విషయం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా తెలుసని అన్నారు. నాటో విశ్వసనీయతపై తనకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయన్నారు. అందుకే ఇప్పుడు ఆ కూటమి రక్షణ ఒప్పందం నుంచి అమెరికాను తప్పించే అంశం గురించి తాను పునరాలోచన చేస్తున్నట్టు పేర్కొన్నారు.
బ్రిటన్ యుద్ధనౌకల పరిస్థితిపై ట్రంప్ ఘాటు విమర్శలు చేశారు. బ్రిటన్‌ను ఉద్దేశిస్తూ, ‘మీకు అసలు నౌకాదళమే లేదు. మీరు చాలా పాతబడిపోయారు. మీ దగ్గర ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు కూడా పనిచేయవు’ అని ఎద్దేవా చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రక్షణ వ్యయాన్ని పెంచాలా అని విలేకరి ప్రశ్న అడిగినప్పుడు, ట్రంప్ చాలా వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ”అతను (స్టార్మర్) ఏం చేయాలో నేను చెప్పను. అతను తనకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. అది నాకు అనవసరం. స్టార్మర్‌కు కావాల్సిందల్లా కేవలం ఖరీదైన విండ్ మిల్స్ మాత్రమే. అవి మీ ఇంధన ధరలను భారీగా పెంచుతాయి” అని అన్నారు.
యుద్ధం కొనసాగిస్తాం: ఇజ్రాయిల్ ప్రధాని
” ఈ యుద్ధం ఇంకా ముగియలేదు. మేం కొనసాగిస్తాం, శత్రువును పూర్తిగా అణచివేస్తాం” అని ఇజ్రాయిల్ ఫ్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. నెతన్యాహు నుంచి ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే అటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం త్వరలోనే ముగియనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. దీంతో డోనాల్డ్ ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా నెతన్యాహు ప్రకటన కనబడటం గమనార్హం. దీంతో మధ్యప్రాచ్యంలో తదుపరి జరగబోయే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగించడానికి తాము సిద్ధంగా ఉన్నా.. మళ్లీ యుద్ధం రాకుండా గ్యారంటీలు కావాలని చెప్పారు.
కాగా ఈ ప్రకటనలతో అమెరికా మార్కెట్లు కొంత మెరుగు పడ్డాయని, అలాగే చమురు ధరలు కూడా తగ్గాయని మార్కెట్ వర్గాల సమాచారం. ఇక ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. తమ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తే.. గూగుల్ వంటి అమెరికా కంపెనీలపై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఇరాన్.. గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. కువైట్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం డ్రోన్ దాడికి గురైంది. బహ్రెయిన్‌లో వ్యాపార కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా పలు డ్రోన్లను కూల్చివేసింది. ఖతార్ సముద్ర జలాల్లో ఒక నౌకపై దాడి జరిగింది. మొత్తానికి ఇజ్రాయిల్ దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యలు, అమెరికా భిన్న వైఖరి.. అన్నీ కలిపి పశ్చిమాసియాలో పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుద్ధం ముగింపుపై సంకేతాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితి ఇంకా అస్థిరంగానే ఉందని వివరిస్తున్నారు.
ఇరాన్‌ను వ్యవస్థాగతంగా దెబ్బ తీస్తున్నాం
అక్కడ పాలన త్వరలో అంతమవుతుంది
పశ్చిమాసియాలో కొత్త కూటముల సంకేతం : నెతన్యాహు
ప్రధాని ప్రసంగం అహంకారంగా ఉంది : ఇజ్రాయిల్ ప్రతిపక్ష నేత
ఇజ్రాయిల్-అమెరికా సంయుక్త సైనిక చర్యలు ఇరాన్‌ను క్రమంగా బలహీనపరుస్తున్నాయని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ పాలన త్వరలో కూలిపోతుందని ఆయన అన్నారు. పెసచ్ (పాస్‌ఓవర్) పండుగ ముందు జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై జరుగుతోన్న యుద్ధంలో ఇజాయిల్, అమెరికా కలిసి ఎన్నో గొప్ప విజయాలు సాధించాయని చెప్పారు. ఇరాన్ పాలన (అయతొల్లా వ్యవస్థ) దశాబ్దాలుగా ఇజ్రాయిల్, అమెరికాపై శత్రుత్వం పెంచిందనీ, ఇప్పుడు ఆ వ్యవస్థను క్రమంగా బలహీనపరుస్తున్నామని తెలిపారు.
అదే విధంగా ఇరాన్ భారీగా ఖర్చు చేసిన అణు, క్షిపణి కార్యక్రమాలు ఇప్పుడు వృధా అయ్యాయనీ, దాదాపు ట్రిలియన్ డాలర్లు నష్టపోయిందని అన్నారు. గాజాలో హమాస్‌పై దాడులు, లెబనాన్‌లో హెజ్బొల్లాను బలహీనపర్చడం, సిరియాలో బషరల్ అల్ అసద్ ప్రభావాన్ని తగ్గించడం, యెమెన్‌లో హౌతీలపై దాడులు, ఇరాన్ అణు, క్షిపణి, సైనిక వ్యవస్థలపై దాడులు వంటి దెబ్బలు ఇజ్రాయిల్ నుంచి తగిలాయని నెతన్యాహు వివరించారు. ఇజ్రాయిల్ ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా బలంగా ఉందని తెలిపారు. ఇక ఇరాన్ ఎప్పటి కంటే బలహీనంగా ఉందని చెప్పారు. అయితే యుద్ధం ఇంకా ముగియలేదనీ, కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అలాగే పశ్చిమాసియాలో కొన్ని కీలక దేశాలతో రహస్యంగా, బహిరంగంగా చర్చలు జరిపామనీ, త్వరలో కొత్త కూటముల గురించి వెల్లడిస్తామని సూచించారు. అమెరికాతో బలమైన భాగస్వామ్యం ఉందనీ, ఇరాన్‌పై సంయుక్తంగా గట్టి దాడులు చేశామని ఆయన తెలిపారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం యుద్ధాన్ని త్వరలోనే ముగించే ఆలోచనలో ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. దీనిపై ఇజ్రాయిల్ విశ్లేషకులు కూడా అమెరికా యుద్ధాన్ని ఒప్పందం లేకుండానే ఆపవచ్చని భావిస్తున్నారు. నెతన్యాహు ప్రసంగంపై ఇజ్రాయిల్ ప్రతిపక్ష నాయకుడు యెర్ లాపిడ్ పెదవి విరిచారు. ఆయన ప్రసంగం ‘అహంకారంగా ఉంది’ అని విమర్శించారు. ప్రభుత్వం దేశాన్ని అంతర్గతంగా బలహీనపరుస్తోందని అన్నారు.
ఇరాన్‌లో భారీ ప్రదర్శన
మార్చి నెలాఖరులో ఇజ్రాయిల్ దాడుల్లో మరణించిన ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళ అధిపతి అలీరెజా టాంగ్సిరి , ఇతరుల అంతిమయాత్ర నిర్వహించారు. బుధవారం టెహ్రాన్‌లో నిర్వహించిన కన్నీటివీడ్కోలు కార్యక్రమానికి భారీసంఖ్యలో జనం తరలివచ్చారు. ట్రంప్, నెతన్యాహుల యుద్ధో న్మాదానికి అమాయకులు బలవుతున్నారంటూ ప్రదర్శనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



