నవతెలంగాణ – హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు అదిరిపోయే న్యూ ఇయర్ సర్‌ప్రైజ్ వచ్చింది. పవన్ 32వ చిత్రాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రామ్ తాళ్ళూరి నిర్మించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథను అందిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థపై ఈ సినిమాను నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా బ్యానర్ మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘జైత్ర రామ మూవీస్’ అనే కొత్త బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్.01గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్ళూరి స్పందిస్తూ.. “జైత్ర రామ మూవీస్ సంస్థపై ప్రొడక్షన్ నంబర్ 1గా నా డ్రీం ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాను. మన ప్రియతమ పవర్ స్టార్ ఆశీసులతో, ఆయన పేరు పెట్టిన బ్యానర్ మీద సినిమా చేయడం ఆనందంగా ఉంది. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీతో కలిసి సినిమా చేస్తున్నందుకు, ఈ డ్రీం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది” అని ట్వీట్ చేశారు.



