మూడు రెట్లు పెరగనున్న దేవాలయ విస్తీర్ణం
రూ.225 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పున:నిర్మాణం
శృంగేరి పీఠాధిపతుల అనుమతితో పనులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దక్షిణ భారతదేశంలోని ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం.. అక్షరాభాస్యాలకు ఆలవాలమైన క్షేత్రం పున:నిర్మాణంతో కొత్త శోభను సంతరించు కోబోతోంది. వేద వ్యాస మహర్షితో ప్రతిష్టితమైన ముగ్గురు అమ్మల ఆలయం ఆచారాలకు అనుగుణంగా సమున్నతమైన రాజగోపురం.. కోనేరు.. ఉత్తర ద్వారం అభివృద్ధి.. ధ్యాన మందిరా లతో మరింతగా భక్తుల మనస్సులను ఆకట్టకో నుంది. వేల ఏండ్ల ఘన చరిత్ర ఉన్న బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పున:నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లను కేటాయించింది. పున:నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేయనున్నారు. దక్షిణ గంగగా గుర్తింపు పొందిన పవిత్ర గోదావరి నదీ తీరంలోని బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతి దేవి కొలువై ఉన్నారు.. కురుక్షేత్ర యుద్ధా నంతరం ప్రశాంతత కోసం వేద వ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చి బాసరలో నివసించారట.. ఆ సమయంలో స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతితో పాటు మహా లక్ష్మి, మహా కాళి అమ్మ వార్ల మూర్తులను ప్రతిష్టించారనేది స్థల పురాణం.. అలా ముగ్గురమ్మల కొలువైన క్షేత్రంగా బాసర ప్రసిద్ధి చెందింది.
అక్షరాభ్యాసాలతో
జ్ఞాన సరస్వతి కొలువైన క్షేత్రం కావడంతో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. వసంత పంచమి, ఇతర పర్వ దినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చే పిల్లలు, తల్లిదం డ్రులు, వారి బంధువులు, భక్తులతో ఆలయం కిటకిట లాడుతుంది. ప్రాచీన ఆలయం కావడం, ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్టు అభివృద్ధి పనులు చేపట్టపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
శృంగేరి పీఠాధిపతుల అనుమతితో
బాసర ఆలయ పున:నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించారు.. గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు.
విశాలంగా.. సౌకర్యంగా
భక్తుల సంఖ్య, భవిష్యత్ అవసరాలను దష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు…
శిలా నిర్మాణాలు
ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టనున్నారు. 6 వేల మంది భక్తులకు అన్ని వసతులతో (ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితరాలతో) 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్‌లు, 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు… తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిఢ విల్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్ల అభి వృద్ధి, దేవాలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, ఆవతలి వైపున సోలార్ రూప్‌టాప్‌తో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.. భవిష్యత్‌లో ఆల యం వెనుక భాగం భారీ వృక్షాలతో ఆలరారేలా మొక్కలు నాటనున్నారు..
పుష్కరాలకు వచ్చే వారికి….
గోదావరి నది పుష్కరాలు వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్నాయి. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలకు బాసర గోదావరి తీరానికి చేరకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టనున్నారు. ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా అదే సమయంలో ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.



