కొచ్చిలో ఆరు నెలల ఉచిత శిక్షణ
బీపీసీఎల్ సహకారంతో నైపుణ్యాభివృద్ధి
ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు సువర్ణ అవకాశం
నవతెలంగాణ- సిటీబ్యూరో
రాష్ట్రంలోని గిరిజన యువతకు ఉపాధి మార్గాలను సుగమం చేసేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఉన్న ప్రతిష్టాత్మక ‘స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్'(ఎస్‌డీఐ)లో ఆరు నెలలపాటు రెసిడెన్షియల్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందేందుకు దరఖాస్తులను జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆహ్వానిస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సహకారంతో ఈ శిక్షణను అత్యంత నాణ్యంగా నిర్వహిస్తుంది.
డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ
ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి సంబంధించి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సులను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఇండిస్టియల్ ఎలక్ట్రీషియన్, ఇండిస్టియల్ వెల్డర్, ప్రాసెస్ ఇన్‌స్ట్ట్రూమెంటేషన్ టెక్నీషియన్, ఫిట్టర్ ఫాబ్రికేషన్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ (కేవలం వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు మాత్రమే) విభాగాల్లో శిక్షణ ఇస్తారు.
అర్హతలు.. వయోపరిమితి ఇలా..
టెక్నికల్ డిప్లొమా లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన వారు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హలు. అభ్యర్థుల గరిష్ట వయసు 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం రెండేండ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఉచిత సౌకర్యాలు.. కెరీర్‌కు భరోసా
ఆరు నెలల శిక్షణ కాలంలో భోజనం, వసతి, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, సేఫ్టీ షూస్‌ను ఉచితంగా అందిస్తారు. అభ్యర్థులు ప్రారంభ రుసుముగా రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తి కాగానే ఎన్‌సీవీఈటీ ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికేట్ అందజేస్తారు. అంతేకాకుండా, శిక్షణానంతరం ప్లేస్‌మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని అధికారులు తెలిపారు.
దరఖాస్తు విధానం ఇలా..
ఆసక్తి గల అభ్యర్థులు హెచ్‌టీటీపీఎస్:// డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఎస్‌ఏపీఆన్‌లైన్.కామ్/ఎస్‌డీఎస్/ఫామ్/రిజిస్టర్.పీహెచ్‌పీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు కాపీని సంబంధిత జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం(డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎస్‌డీఎస్‌కెకొచ్చి.కామ్ వెబ్‌సైట్‌ను చూడొచ్చు లేదా హైదరాబాద్‌లోని జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయాన్ని సంప్రదించొచ్చు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
హైదరాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్.కోటజీ
గిరిజన యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. జిల్లాలోని గిరిజన విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. తమ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి.
గిరిజన యువతకు ‘స్కిల్’ బాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



