– అందుకు కాలపరిమితి లేదన్న క్రెమ్లిన్
– ట్రంప్‌తో ఫోన్ కాల్ అనంతరం రష్యా వెల్లడి
– వెంటనే కాల్పుల విరమణ చర్చలు జరపాలన్న ట్రంప్
మాస్కో: ఉక్రెయిన్ ఘర్షణలను పరిష్కరించే దిశగా తీసుకునే తదుపరి చర్య, శాంతిని నెలకొల్పడం కోసం సూత్రాలు, కాల క్రమాన్ని (టైమ్‌లైన్) వివరించే మెమోరాండం అయి వుండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో దాదాపు రెండు గంటల పాటు మాట్లాడిన ఫోన్ కాల్‌లో ఈ మేరకు అంగీకారం కుదిరిందని చెప్పారు. అయితే ఈ శాంతి మెమోరాండాన్ని ఖరారు చేయడానికి గడువు అంటూ విధించలేదని మంగళవారం ఉదయం క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కొవ్ విలేకర్లకు చెప్పారు.
అయితే సాధ్యమైనంత త్వరగా ఇది జరిగేలా చూడాలని మాత్రమే ఇరువురు నేతలు పేర్కొన్నారని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌లు తమ తమ పద్దతిలో మెమోరాండాలు రూపొందించుకోవచ్చని అన్నారు. అయితే ఆ తర్వాత ఆ రెండింటినీ కలిపి ఒక రూపానికి తీసుకురావాల్సిన అవసరం వుంటుందని, దీనికోసం జరిగే చర్చలు క్లిష్టంగా వుంటాయని చెప్పారు. పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ, తమదైన మెమోరాండం రూపొందించడానికి ముందుగా మాస్కో ప్రతిపాదన కోసం వేచి చూస్తామని చెప్పారు.
ఫోన్‌కాల్‌లో జరిగిన సంభాషణ ప్రోత్సాహకరంగా వుందని పుతిన్, ట్రంప్‌లు వ్యాఖ్యానించారు. ఎలాంటి అరమరికలు లేకుండా చర్చించామని పుతిన్ చెప్పారు. ఇరు పక్షాలకు అనుగుణంగా కొన్ని సద్దుబాట్లను కనుగొనాల్సిన అవసరం వుందని అన్నారు. రెండు వారాల్లోనే పురోగతి వుంటుందని భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘దీన్ని పరిష్కరించాలని పుతిన్ కోరుకోవడం లేదని నేను భావించినట్లైతే ఇక దాని గురించి నేను మాట్లాడను కూడా.’ అని ట్రంప్ విలేకర్లతో వ్యాఖ్యానించారు. శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించడం సవాలు వంటిదని ట్రంప్ అన్నారు. ఎందుకంటే ఇందులో లోతైన అసమానతలు, అతి పెద్దవైన ఇగోలు ఇమిడి వుంటాయన్నారు. జెలెన్ స్కీ కూడా బలమైన వ్యక్తే, ఆయనతో వ్యవహరించడం కూడా అంత తేలికేమీ కాదని అన్నారు. రష్యా, ఉక్రెయిన్‌లు తక్షణమే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభించాలని అన్నారు. ఇరు దేశాల నాయకులతో విడివిడిగా ఫోన్‌కాల్స్ మాట్లాడిన అనంతరం ట్రంప్ మాట్లాడారు. అయితే చర్చలు, ఎప్పుడు ఎక్కడ జరిగే అవకాశం వుంది, ఎవరు పాల్గొంటారన్న వివరాలేవీ తెలియరాలేదు. ఈ సంక్షోభానికి మూల కారణాన్ని పరిష్కరించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పుతిన్ చెప్పగా, పూర్తి స్థాయిలో, బేషరతుగా కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సిద్ధంగా వుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు.
శాంతి మెమోరాండం రూపొందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES