Wednesday, August 6, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమానవజాతి అంతరాత్మపై శాశ్వతగాయం

మానవజాతి అంతరాత్మపై శాశ్వతగాయం

- Advertisement -

రెండవ ప్రపంచ యుద్ధం కేవలం సైనికుల మధ్య జరిగిన పోరాటం కాదు. అది ప్రపంచాన్ని ఒక అగ్నిగుండంగా మార్చిన భయం కరమైన మానవ విధ్వంసం. 1939 సెప్టెంబర్‌ 1న పోలాండ్‌పై నాజీ జర్మనీ దండయాత్రతో రాజుకున్న ఈ కార్చిచ్చు, 1945 సెప్టెంబర్‌ 2 వరకు ఆరేండ్ల పాటు సుదీర్ఘమైన రక్తపాతంతో సాగింది. ఈ మహాసంగ్రామంలో ముప్పైకి పైగా దేశాలు పాల్గొని, లక్షలాది మంది అమాయక ప్రజలను బలిగొంది. ఈ యుద్ధం భయంకరమైన ముగింపు మాత్రం, జపాన్‌పై అమెరికా జరిపిన అణుదాడి. ఇది చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా, చెరగని గాయంగా మిగిలిపోయింది.ఈయుద్ధంలో అమెరికా తన ప్రమేయాన్ని పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా కుట్ర చేసింది. ఆసియాలో జపాన్‌ తన సామ్రాజ్యాన్ని విస్తరించడం అమెరికాకు ఆందోళన కలిగించింది. తనకంటే ఎక్కువ శక్తివంతమైన దేశంగా జపాన్‌ బలపడుతుందేమోనన్న భయం అమెరికాను వెంటాడింది. అప్పటి అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ బహిరంగంగా తాను యుద్ధం ప్రారం భించనని హామీనిచ్చినా, జపాన్‌ను రెచ్చగొట్టి, అది తమపై దాడిచేసేలా చేసి, ఆ తర్వాత యుద్ధంలోకి ప్రవేశించాలనే దురాలోచనతో ఉన్నాడు.
ఈ దురుద్దేశంతోనే, జపాన్‌ను వ్యూహాత్మకంగా అడ్డుకునేందుకు దాని చమురు అవసరాన్ని అస్త్రంగా వాడుకున్నాడు. జపాన్‌ తన చమురు అవసరాలకు ఎక్కువగా అమెరికాపై ఆధారపడటం రూజ్‌వెల్ట్‌కు అనుకూలంగా మారింది. దీన్ని అవకాశంగా తీసుకుని జపాన్‌పై చమురు నిషేధాన్ని విధించాడు. ఈ చర్యను జపాన్‌ ప్రభుత్వం యుద్ధ ప్రకటనగానే పరిగణించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతిస్పందనగా, 1941 డిసెంబర్‌ 7న జపాన్‌ నౌకాదళం అమెరికాలోని పెర్ల్‌ నౌకాశ్రయంపై ఆకస్మికంగా దాడిచేసింది. ఈ దాడి యునైటెడ్‌ స్టేట్స్‌ను రెండవ ప్రపంచ యుద్ధంలోకి నేరుగా తీసుకువచ్చింది.యుద్ధం చివరి దశకు చేరుకున్నప్పుడు, ప్రపం చాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఒక భయంకర మైన అస్త్రాన్ని అమెరికా ఆటోమెటిక్‌బాంబును ప్రయోగించింది. ఈ అణుదాడి కేవలం సైనిక స్థావరాలను ధ్వంసం చేయడానికే కాదు, దీని శక్తిని, ప్రభావాలను పరీక్షించడానికి కూడా ఉద్దేశించబడింది.ఈ అణుబాంబుల తయారీకి మూలసూత్రాలను ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ రూపొందించగా, వాటిని కనుగొన్నది మాత్రం ఒట్టోహాన్‌ అనే శాస్త్రవేత్త. అణ్వాయుధాల మొదటి పరీక్ష 1945 జూలై 16న అలమోగోర్డో బాంబింగ్‌ రేంజ్‌లో ‘ట్రినిటీ’ అనే కోడ్‌ పేరుతో జరిగింది.
జపాన్‌పై జరిగిన అణుబాంబు దాడులు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి.1945 ఆగస్టు 6న ఉదయం 8:15 గంటలకు ‘లిటిల్‌ బారు’ అని పేరుపెట్టిన మొదటి అణుబాంబును హిరోషిమా నగరంపై జారవిడిచింది. ఇది యురేనియంతో తయారైన కేంద్రక విచ్చితి బాంబు. ఇందులో 64 కిలోల యురేనియాన్ని ఉపయోగిం చగా, ఇది 64 కిలో టన్నుల సాధారణ టి.యన్‌.టి. విడుదల చేసే శక్తికి సమానమైన పేలుడును సృష్టించింది. ఆగస్ట్‌ 9న ఉదయం 11:02 గంటలకు ‘ఫ్యాట్‌ మ్యాన్‌’ అనే రెండవ బాంబును నాగసాకి నగరంపై పడవేసింది. ఇది ప్లూటోనియంతో తయారైన ఇంప్లోషన్‌ విచ్ఛిత్తి బాంబు.ఈ బాంబులు కేవలం భారీ పేలుడును మాత్రమే కాకుండా, అపారమైన వేడి, ప్రాణాంతకమైన అయానీకరణ రేడియేషన్‌ను ఉత్పత్తి చేశాయి. ఈ రేడియేషన్‌ ప్రభావాలు తరతరాల పాటు జపాన్‌ ప్రజల ఆరోగ్యంపై పడ్డాయి. రేడియోధార్మిక శిథిలాలు మేఘాల రూపంలో పైకిలేచి, పుట్టగొడుగు ఆకారపు మేఘాన్ని సృష్టించి, తిరిగి భూమిపై పతనమ య్యాయి. ఈ రెండు నగరాల్లో వేల సంఖ్యలో అమాయక ప్రజలు క్షణాల్లో మరణించారు. ఈ భయానక ఘటనలను గుర్తుచేసుకుంటూ ఆగస్ట్‌ 6ను హిరోషిమా దినంగా, ఆగస్ట్‌ 9ను నాగసాకి దినంగా ప్రపంచం స్మరించుకుంటుంది.
అమెరికా ఈ దాడుల కోసం నగరాలను ఎంచుకోవడం వెనుక అనేక దుర్మార్గపు వ్యూహాలు ఉన్నాయి. హిరోషిమాను ఎంచుకోవడానికి గల కారణాలు, ఆ ప్రదేశంలో అమెరికా మిత్రరాజ్యాల యుద్ధ శిబిరాలు లేవు. జపాన్‌ సైనిక దళాలు, కర్మాగారాలు అక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి. నగరం జనాభా దట్టంగా ఉండటం వల్ల బాంబు ప్రభావం ఎంత ఉంటుందో అంచనా వేయొచ్చు. అంతకుముందు జరిగిన వైమానిక దాడుల్లో నగరం పెద్దగా దెబ్బతినకపోవడం నాగసాకిని ఎంచుకో డానికి కారణం. అక్కడ రెండు అతిపెద్ద యుద్ధనౌకలను నిర్మించిన మిత్సుబిషి షిప్‌యార్డ్‌ ఉంది. ఈ దాడుల తర్వాత 1946లో అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలు హిరోషిమాలో 1,35,000 మంది, నాగసాకిలో 64వేల మంది మరణించినట్టు పేర్కొన్నాయి. ఈ మరణాలకు కారణాలు కాలిన గాయాలు, శిథిలాల కింద పడటం, రేడియేషన్‌ ప్రభావాలు. నివేదిక ప్రకారం, హిరోషిమాలో అరవై శాతం మరణాలు కాలిన గాయాల వల్ల, నాగసాకిలో ఎనభై శాతం మరణాలు కాలిన గాయాల వల్ల సంభవించాయి. అణుబాంబు ప్రభావాలను అధ్యయనం చేయడానికి హిరోషిమాకు వెళ్లిన భౌతిక శాస్త్రవేత్త ఫిలిప్‌ మోరిసన్‌, నగరంలోని 33 అగ్నిమాపక స్టేషన్లలో 26 ధ్వంసమయ్యాయని, 2,400 మంది నర్సులలో 1,800 మంది మరణించారని నివేదించారు. ఈ భయానక దృశ్యాలను చూసిన మోరిసన్‌, మూడవ బాంబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ గడిపాడు.
ఈ విధ్వంసం ప్రపంచ శాస్త్రవేత్తల మనసులను కలచివేసింది. అణుబాంబు తయారీకి మూల సూత్రాలను అందించిన ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ తన ప్రయోగశాలలో జపాన్‌ నోబెల్‌ బహుమతి గ్రహీత ‘హిడెకీ యుకావా’ను కలిసినప్పుడు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు కోరాడు. ”నేను అమాయక ప్రజలను బాధపెట్టాను. దయచేసి నన్ను క్షమించండి” అని వేడుకున్నాడు. ఈ దాడుల తర్వాత జపాన్‌ ప్రజలు అద్భుతమైన సంకల్పంతో తమ నగరాలను తిరిగి నిర్మించుకున్నారు. హిరోషిమాలో సమగ్ర నగర ప్రణాళిక పథకం కింద 1950 నుండి పునర్నిర్మాణం మొదలైంది. మాజ్దా మోటార్‌ కార్పొరేషన్‌ ప్రధాన కర్మాగారం పునరుద్ధరణతో నగరం ఈ ప్రాంతానికి పారిశ్రామిక కేంద్రం గా మారింది. నాగసాకిలో మిత్సుబిషి షిప్‌యార్డ్‌ పునర్నిర్మించబడింది. ఈ రెండు నగరాలు నేడు కేవలం పారిశ్రామిక కేంద్రాలుగానే కాకుండా, అణు నిరాయుధీకరణ ఉద్యమానికి చిహ్నాలుగా నిలిచాయి. హిరోషిమాలోని పీస్‌ మెమోరియల్‌ పార్క్‌, అటామిక్‌ బాంబ్‌ డోమ్‌ ప్రపంచానికి శాంతి సందేశాన్ని నిరంతరం చాటి చెబుతున్నాయి.
ఈ మహా విధ్వంసంలో బతికి బయటపడిన బాధితులు, హిబాకుషాలకు జపాన్‌ ప్రభుత్వం జీవితాంతం ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. అణుబాంబు రేడియేషన్‌ ప్రభావాలపై పరిశోధనలు చేసే అటామిక్‌ బాంబ్‌ క్యాజువాలిటీ కమిషన్‌ ఏర్పాటు చేయబడింది. దీని లైఫ్‌ స్పాన్‌ స్టడీలో 1,20,000 కంటే ఎక్కువ హిబాకుషాలు నమోదు చేసుకున్నారు. ఈ చరిత్ర మనకు నేర్పిన పాఠం ఒక్కటే. ఇలాంటి విధ్వంసాలు మళ్లీ జరగకూడదు. ప్రపంచ దేశాలు అణు నిరాయుధీకరణకు ఒక ఒడంబడికకు రావాలి. దీనికి మనదేశం కూడా సహకరించాలి.
డి జె మోహన రావు
8247045230

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -