నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలోని పిర్పైంటీలో నిర్మించబోయే బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం కోసం బీహార్‌లోని నితీష్‌కుమార్ ప్రభుత్వం అదానీ కంపెనీ కారు చౌకగా వెయ్యి ఎకరాలు కట్టబెట్టింది. ఎకరాకు కేవలం ఒక్కరూపాయి చొప్పున 25 సంవత్సరాలపాటు లీజుకిచ్చింది. అయితే తమ భూముల్ని అన్యాయంగా లాక్కొని.. సరిగా నష్టపరిహారం ఇవ్వకుండానే ప్రభుత్వం అదానీ కంపెనీకి కట్టబెట్టిందని మామిడి, లిచీ పండ్ల రైతులు వాపోతున్నారు. ఈ బొగ్గువిద్యుత్ కేంద్రం వల్ల తీవ్రంగా గాలి కాలుష్యం ఏర్పడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళనవ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 15న ప్రధాని నరేంద్ర మోడీ బీహార్‌లోని పూర్ణియాలో దాదాపు నలభై వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిల్లో రూ. 25 వేల కోట్లతో అదానీ నిర్మించబోయే ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం కూడా ఉండడం గమనార్హం. ఈ ప్రాజెక్టును మోడీ ప్రారంభించబోయే రెండు రోజుల ముందే (సెప్టెంబర్ 13) అదానీ పవర్ కంపెనీ.. బీహార్ రాష్ట్ర పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ (బిఎస్‌పిజిసిఎల్)తో 25 విద్యుత్ సరఫరా ఒప్పందం (పిఎస్‌ఎ)పై సంతకం చేసింది. ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను బీహార్ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు కిలోవాట్‌కి రూ. 6.07కి విక్రయించనున్నారు.
ఎకరాకు రూపాయి చొప్పున 25 సంవత్సరాలపాటు 1,020 లీజుకిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం… రైతులకు మాత్రం అన్యాయం చేసింది. వారి దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న భూములకు మాత్రం ఒకేసారి నష్టపరిహారం ఇవ్వలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు వాళ్లకిచ్చేసి తామెలా బతకాలని వారు ఆవేదన చెందుతున్నారు. బీహార్‌లో 38 జిల్లాల్లో 28 జిల్లాలు వరద ప్రభావిత భూములు. మిగతా పది జిల్లాల్లో అంతో ఇంతో సారంవంతమైన భూములున్నాయి. పిర్పైంటిలోని ఎక్కువ శాతం మంది ప్రజలు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినవారే. అయితే ఇప్పుడు మిమిడి, లిచీ పండ్లను సాగు చేస్తున్న భూములను రాష్ట్ర ప్రభుత్వం ముందు బంజరు భూములుగా జాబితా చేసి.. వీటిని అదానీ కంపెనీకి ఇచ్చిందని అక్కడి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
అదానీ నిర్మించబోయే పవర్ ప్లాంట్ కంపెనీ పనులు 2014లో ప్రారంభమయ్యాయి. 1,320 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించడానికి బీహార్ రాష్ట్ర పవర్ జనరేషన్ లిమిటెడ్ కంపెనీ, ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. అంటే ఈ కంపెనీని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని ప్రయత్నించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ కంపెనీని అదానీకి అప్పగించారు. పదేళ్ల తర్వాత ప్రభుత్వం ఈ కంపెనీ నుంచి ఎందుకు తప్పుకుని ప్రైవేటుకు అప్పజెప్పింది? అనే ప్రశ్నలు రాష్ట్ర ప్రజల్లో మెదలుతున్నాయి. ఇప్పటికే భాగల్పూర్ జిల్లాలో 2,340 మెగావాట్ల సామర్థ్యం గల కహల్గావ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. అదే జిల్లాలో ఇది రెండో పవర్ సేటషన్. కహల్గాన్ పవర్ ప్లాంట్‌కి కిలోమీటర్ల దూరంలోనే మరో పవర్ ప్లాంట్ నిర్మించడం..పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని పర్యావరణ పరిశోధకుడు సుభాసిస్ డే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాతావరణ ప్రభావం వల్ల రాష్ట్రంలో కేన్సర్ రోగులు పెరిగిపోతున్నారు. ఇప్పుడు అదానీ పవర్ ప్లాంట్‌తో ప్రజారోగ్యం తీవ్ర సంక్షోభంలో పడనుంది.