రెండు కన్నీటి చుక్కల్ని రాలిస్తే
జీవన బాధల్ని దాటెయ్యలేము
నాలుగు నవ్వుల్ని నవ్వేస్తే
ఆనంద శిఖరాలపై నిలువలేము
కష్ట సుఖాలు
బొమ్మా బొరుసు లయ్యాక
ఇరు పార్శ్వాలను చూస్తుండాల్సిందే
ఏదీ శాశ్వతం కాదనేదే సత్యం
మనిషిని బట్టీ మన:స్తత్వాన్ని బట్టీ
ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక వ్యసనం
అంటిపెట్టుకునే వుంటుంది
కొన్ని మంచి వ్యసనాలుంటాయి
మనిషిని మహాత్మున్ని చేస్తుంటాయి
కొన్ని చెడు వ్యసనాలూ వుంటాయి
మనసును అధ:పాతాళానికి నెట్టేస్తుంటాయి
బ్రతుకులోనికి చొరబడ్డ
ఒకానొక అడ్డ గీతను
చిన్నదిగా చేసుకోటానికి
మరో పెద్ద గీత గీసుకోవల్సిందే
ఒక్కోసారి ప్రశ్నలకు ప్రశ్నలే
జవాబులవుతుంటాయి కూడా
కొన్ని సందర్భాలు
బ్రతుకునంతా ఏకవాక్యం చేస్తుంటాయి
శూన్యం వైపు వేగంగా లాక్కెడతాయి
నిలువెత్తు ధైర్యాన్ని సవాలు చేస్తూ
శిఖండిలా గుచ్చుకుంటూ వుంటాయి
అప్పుడే గాయాలు గేయాలవ్వాలి..!
జీవితంలోని ఎత్తుపల్లాల్ని దాటి
కాలధర్మాన్ని ఆహ్వానించే
పెద్దోళ్లను చూస్తున్నప్పుడల్లా
కన్నీళ్లు గుండె గోడలనుంచి ఎగదన్నుతాయి
ఏమో ఎమోమో కానీ….
ఈ ఆటు పోటుల సంద్రాన్ని
ఆటపాటలతో దాటెయ్య టానికి
నాకు నీకు మనందరికీ
కవిత్వ నావ కావల్సిందే..!
- డా. కటుకోఝ్వల రమేష్, 9949083327



