ప్రశాంత్ భూషణ్ విమర్శ
ముంబయి : వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ జీ రామ్ జీ)తో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)కు కేంద్ర ప్రభుత్వం ఆచరణాత్మకంగా ముగింపు పలికిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆదివారం విమర్శించారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో విలేకరులతో ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ కేంద్రం కేవలం ఈ పథకం పేరు మాత్రమే మార్చలేదని, మొత్తం పథకాన్ని కూడా మార్చిందని తెలిపారు. ఇప్పటివరకూ ఉన్న ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ అనేది హక్కు ఆధారిత పథకమని, దీని ద్వారా ప్రతీ గ్రామీణ కుటుంబానికి కనీసం వేతనంతో కనీసం 100 రోజుల పనిచేసే ప్రాథమిక హక్కుగా ఉందని, అయితే ఇప్పుడు దీన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించిందని ప్రశాంత్ భూషణ్ తెలిపారు. కేంద్రం ఇప్పుడు దీన్ని బడ్జెట్ ఆధారిత పథకంగా మర్చివేసిందని విమర్శించారు.
ఈ పథకానికి ఎంత కేటాయించాలో, రాష్ట్రాలు ఎంత శాతం కేటాయించాలో కూడా తామే చెబుతామని కేంద్రం అంటుందని, కాబట్టి ఈ పథకాన్ని సమర్థవంతంగా ముగించారని ప్రశాంత్ భూషణ్ తెలిపారు. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకంపై వివిధ మార్గాల్లో ఆంక్షలు విధించిందని ఆయన గుర్తుచేశారు. ‘బెంగాల్‌లో మాదిరిగా.. కేంద్రం అనేక ఏండ్లుగా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కోసం డబ్బును కేటాయించలేదు. ఈ పథకాన్ని ముగించాలనే వారు కోరుకున్నారు. ఇప్పడు చట్టపరంగా.. ఆచరణాత్మకంగా వారు (కేంద్రం) ఈ పథకాన్ని ముగించారు’ అని ప్రశాంత్ భూషణ్ తెలిపారు. అలాగే, డిజిటిల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద దేశద్రోహ నిబంధనపై కూడా ప్రశాంత్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలతో అనేక ఆంక్షలను విధిస్తున్నారని తెలిపారు. ‘ఇవే కాకుండా..ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులను ఉపా, మనీలాండరింగ్ నిరోధకం చట్టం లేదా ఏదో ఒక విధంగా ఇరికించడాన్ని మనం చూస్తున్నాం. వాక్ స్వాతంత్య్రాన్ని అంతం చేయడానికి వారు (కేంద్రం) శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కానీ వారు ఇంకా పూర్తిగా విజయం సాధించలేదు’ అని ప్రశాంత్ భూషణ్ తెలిపారు.



