నోటిఫికేషన్ లేకుండానే నియామకాలు
మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల ఉద్యోగ నియామకాల్లో అవినీతి
ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు సొమ్ము చేసుకున్నట్టు విమర్శలు
మా నుంచి ముగ్గురినే నియమించాం..!: ఆర్‌సీఓ
ఆర్‌సీఓ నుంచే జరిగాయి : ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీ పోస్టులకు ధర కట్టారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షలు సొమ్ము చేసుకున్నట్టు పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేపట్టిన నియామకాల్లో ఎవరికి వారే ధర నిర్ణయించి ఎలాంటి నోటిఫికేషన్లూ జారీ చేయకుండా మంజూరైన పోస్టులను అమ్ముకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్క పోస్టుకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు తీసుకొని నియామకాలు జరిగినట్టు విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక అవుట్ సోర్సింగ్ పద్ధతిన బోధనేతర ఉద్యోగాల నియామకాలు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో 31 పాఠశాలలు ఉండగా.. మొత్తం 20 పోస్టులకుగాను.. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన అటెండర్, ల్యాబ్ అటెండర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, వాచ్‌మెన్, స్వీపర్ ఉద్యోగాలను భర్తీ చేశారు. మూడు పోస్టులను మినహాయిస్తే 17 పోస్టులను అమ్ముకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్‌సిఓ స్థాయిలో నియామకాలు జరిగినట్టు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపల్స్ పేర్కొంటున్నారు. కానీ, తమ స్థాయిలో జరగలేదని ఆర్‌సీఓ ప్రకటించడంతో వివాదాస్పదమైంది.
నియామకాలు ఇలా..
నాగార్జునసాగర్ పాఠశాలలో బోధనేతర సిబ్బంది నియామకం, కనగల్ బాలుర పాఠశాలలో వాచ్‌మెన్, దామరచర్ల బాలికల పాఠశాలలో ల్యాబ్ అటెండర్, స్వీపర్ పోస్ట్, దామచర్ల బాలికల పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్, మునుగోడు బాలుర పాఠశాలలో స్వీపర్ పోస్ట్, అవంతిపురం బాలుర పాఠశాలలో రెండు ల్యాబ్ అసిస్టెంట్లు, దేవరకొండ మల్లేపల్లి బాలికల పాఠశాలలో రెండు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు, నేరేడుచర్ల బాలుర పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్, సూర్యాపేట బాలుర పాఠశాలలో రెండు ల్యాబ్ అసిస్టెంట్లు, వాచ్‌మెన్, సూర్యాపేట డిగ్రీ ఉమెన్స్ కళాశాలలో రెండు వాచ్‌మెన్, ఆఫీస్ సబాడినెంట్, బీబీనగర్, వలిగొండ బాలికల పాఠశాలలో ఆఫీస్ సబాడినెంట్, బాలుర పాఠశాలలో రెండు వాచ్‌మెన్ పోస్టుల నియామకం జరిగింది.
మొత్తం 2 జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబాడినెంట్, 8 మంది ల్యాబ్ అటెండర్లు, నలుగురు వాచ్‌మెన్లు, నలుగురు స్వీపర్లు, ఒక బోధనేతర సిబ్బంది నియామకం చేశారు. అర్హతలు ఉన్నాయా లేదా? ఏమీ పరిశీలించకుండా.. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే నేరుగా ఒక్కొక్క పోస్టుకు రేటు నిర్ణయించి నియమించుకున్నారన్న ప్రచారం జరిగింది. ఇది బయటకు రావడంతో ఎవరికివారు తమ ప్రమేయం లేదని తప్పించుకుంటున్నారు. ఉన్నత స్థాయిలో అధికారులు దీనిపై విచరణ జరుపుతున్నారు.
నియామకం జరగాల్సింది ఇలా..
గురుకుల విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మ జ్యోతిబాఫూలే నల్లగొండ ఆర్‌సీఓ పరిధిలో ఉద్యోగ నియామకాలకు అవకాశం కల్పించింది. ఈ పోస్టుల్లో ప్రత్యేక నోటిఫికేషన్ పత్రికా ప్రకటన ద్వారా దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా నియామకం జరగాల్సి ఉంది. ఆర్‌సిఓ స్థాయిలో ప్రకటన రావాల్సి ఉండగా.. వారి నియామకం గురించి తమకు ఏమీ తెలియదని ఆయా పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్‌లు నియామకాలు చేసుకున్నారని ఆర్‌సీఓ పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ను విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ యువతీ యువకులు ప్రశ్నించగా.. తమకు ఎలాంటి సంబంధమూ లేదని ఆర్‌సీఓ స్థాయిలో ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం వల్ల వారిని పాఠశాలల్లో నియమించుకున్నామని పేర్కొనడం కొస మెరుపు.
మా స్థాయిలో నియామకాలు జరగలేదు : మహాత్మ జ్యోతిబాఫూలే నల్లగొండ ఆర్‌సీఓ స్వప్న
జనవరి 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు అవుట్ సోర్సింగ్ విధానంలో మొత్తం 11 మంది, ఇతర విధానాల్లో తాత్కాలిక పద్ధతిలో 9 మంది సిబ్బంది నియామకం జరిగింది. నియామక ప్రక్రియ మా కార్యాలయం ద్వారా జరగలేదు. సంబంధిత సంస్థల ప్రధానోపాధ్యాయులు స్వయంగా చేసుకున్నారు. సొసైటీ సెక్రెటరీ ద్వారా ఒక పోస్టు, జిల్లా కలెక్టర్ సిఫార్సు ద్వారా రెండు పోస్టుల నియామకం చేశాం. మిగతా 17 పోస్టుల్లో సంబంధిత ప్రధానోపాధ్యాయులు నియమించుకున్నారు. ఆ నియామకాలు ఎలా జరిగాయో నాకు తెలియదు.
విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
నల్లగొండ రీజియన్ పరిధిలో మహాత్మ జ్యోతిబాఫూలే పాఠశాలలు, కళాశాలల్లో ఇటీవల జరిగిన నియామకాల్లో అవినీతి జరిగింది. ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎవరికి ఇష్టం వచ్చిన తరహాలో వారు పోస్టులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థికి అడ్మిషన్ పొందాలంటే సెక్రెటరీ స్థాయిలో అనుమతులు పొందాల్సిన పరిస్థితుల్లో ఉద్యోగాలకు మాత్రం ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నియామకం చేపట్టడం దారుణం. వెంటనే పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
-ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్



