ఓయూలో సదస్సులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
మాదకద్రవ్యాల కట్టడికి ఓ ప్రజా ఉద్యమం అవసరమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ లా విభాగం, విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ సంయుక్తంగా శనివారం ఓయూ దూరవిద్యా కేంద్రం ఆడిటోరియంలో ”కంబాటింగ్ డ్రగ్ అబ్యూజ్ ఇన్ ఇండియా- లీగల్ అండ్ పాలసీ పర్‌స్పెక్టివ్” అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. మాదకద్రవ్యాల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతికతతో ఏదైనా సాధించే దశకు చేరుకున్నామని, ఆపరేషన్ సిందూర్ ద్యారా సాంకేతికతలో మన సత్తా చాటామని అన్నారు. మాదకద్రవ్యాలకు బానిసలైతే ఏ సాంకేతికత, అభివృద్ధి మనల్ని కాపాడలేవని హెచ్చరించారు. యువతకు చట్టాలపై అవగాహన ఉన్నా మత్తు పదార్థాలకు బానిసలై నేరాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సీబీఐ పూర్వ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల కట్టడితో పాటు దేశంలో జరుగుతున్న నేరాల్లో దోషులకు శిక్షలు పడేందుకు న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ కలిసి పనిచేయాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం, రవాణా, నేరాల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి కట్టడిలో పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రతి పౌరుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం స్వల్పంగా అలవాటు చేసుకోవడం నుంచి క్రమంగా బానిసలుగా మారుతారని, ముందుగా కొంతే కదా అని తల్లిదండ్రులు పిల్లలకు అవకాశమిస్తే డ్రగ్స్ దిశగా వారి అలవాట్లు మారుతాయని హెచ్చరించారు.
విజన్ 2047 ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ హరిచరణ్ మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంటూ శపథం చేయాలన్నారు. 2047 నాటికి డ్రగ్స్ ఫ్రీ భారత్ దిశగా అడుగులు వేద్దామని, ఇందుకు కేంద్రం అవసరమైన చట్టాల రూపకల్పన, చర్యలు చేపట్టాలని కోరారు. ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య జి.నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ లా కళాశాల ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఈ అంశంపై సమాజంలో విస్తృత చర్చ జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఓయూ లా కళాశాల డీన్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంతో పాటు ఆధునిక సాంకేతికత తెచ్చిన అనేక సమస్యలు భారతీయ కుటుంబ వ్యవస్థకు సవాల్‌గా మారాయని చెప్పారు. ఓయూ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మత్తుపదార్థాల వినియోగం, పర్యవసానాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ చరణ్, డాక్టర్ రత్నాకర్‌రావు, నల్లారి రాజేందర్, ఓయూ ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్, సహా అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, పలు లా కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల కట్టడికి ప్రజా ఉద్యమం అవసరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES