బుద్వేల్ నుంచి వికారాబాద్ జిల్లా నాచారానికి రేడియల్ రోడ్డు
82 కిలోమీటర్లు 225 ఫిట్లతో నిర్మించేందుకు కసరత్తు
1500 ఎకరాలు సేకరిస్తున్న ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో భూములు కోల్పోతున్న పేదలు
సమాచారం లేకుండా భూముల సర్వే
నర్కుడలో సర్వేను అడ్డుకున్నా.. పోలీసుల సాయంతో హద్దుల గుర్తింపు
బాధిత రైతు ఆత్మహత్యాయత్నం
భూమికి భూమి ఇవ్వాల్సిందేనని డిమాండ్
ప్రభుత్వ మార్కెట్ ధర.. గిట్టుబాటు ధర కాదన్న రైతులు
వాళ్లంతా అర ఎకరం, ఎకరం, రెండెకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు. ఆ భూముల్లో వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. ఆ భూములనే నమ్ముకుని భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉన్నట్టుండి.. ఆ భూముల్లోకి ప్రభుత్వ అధికారులు వచ్చారు.. సర్వే అంటూ హడావుడి చేశారు. ఏం సర్వే అంటూ అధికారులను రైతులు ప్రశ్నించారు. ‘మీ భూముల్లో నుంచి రేడియల్ రోడ్డు వేస్తున్నాం. మీ భూములు తీసుకుంటాం’ అని అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎలాంటి సమాచారం లేకుండా సర్వేలేంటనీ, తమ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ పోలీసుల సాయంతో అధికారులు హద్దులు గుర్తించడంతో ఆందోళన చెందుతున్నారు. ‘భూమికి భూమి’ ఇస్తేనే తమ భూములు ఇస్తామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
హైదరాబాద్ మహానగర విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రవాణా సౌకర్యార్థం రీజినల్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీగా ఓఆర్‌ఆర్ నుంచి రేడియల్ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం రేడియల్ రోడ్లకు భూ సేకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రావిర్యాల నుంచి అమనగల్ వరకు 42 కిలోమీటర్ల దూరం 332 ఫీట్లతో రూ.4621కోట్ల భారీ వ్యయంతో రోడ్డు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. సుమారు వెయ్యి ఎకరాలు సేకరించింది.
ఇక జిల్లాలో పశ్చిమ హైదరాబాద్ వైపు రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రెండవ రేడియల్ రోడ్డు బుద్వేల్ నుంచి కోస్గి వరకు సుమారు 81 కిలో మీటర్లు నిర్మించనుంది. 225 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసింది. ఇందుకు భూ సేకరణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ రోడ్డు నిర్మాణానికి సుమారు 1500 ఎకరాల భూమి అవసరం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.
గ్రామాల్లో భూ సేకరణ
శంషాబాద్ మండల పరిధిలోని 9 గ్రామాలు, షాబాద్ మండల పరిధిలోని 8 గ్రామాల్లో సుమారు 650 ఎకరాలు ప్రభుత్వం భూ సేకరణ చేపడుతుంది. ఇందులో సుమారు 1100 మంది భూములు కోల్పోనున్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాంతాల్లో ఎకరం రూ.5కోట్ల నుంచి రూ.10 కోట్లు పలుకుతోంది. ఇటీవల హెచ్‌ఎండీఏ భూముల వేలంలో అంతకంటే ఎక్కువ ధర పలికిన విషయం తెలిసిందే. ప్రభుత్వ మార్కెట్ ధర మాత్రం ఎకరం రూ. 20 లక్షలు మాత్రమే ఉంది. ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం 2013 చట్టం ప్రకారం ఇచ్చినా ఎకరాకు రూ.60 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతో భూ బాధితులు ఆందోళన చెందుతున్నారు.
మూడు కుంటలకు పొంచి ఉన్న ముప్పు
నర్కుడ గ్రామం పక్క నుంచే రోడ్డు వెళ్లడంతో భవిష్యత్‌లో ఊరు విస్తీర్ణం ఉండదని, పూర్తిగా ఊరికే ప్రమాదం ఏర్పడుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గ్రామ పరిధిలోని మూడు కుంటలు కనుమరుగవుతున్నాయి. వీటిపైనే ఆధారపడిన మూగ జీవాలకు, పంటల సాగుకు సైతం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
సర్వేను అడ్డుకున్న బాధితులు
శంషాబాద్ మండలం నర్కూడలో ఇటీవల సర్వే అధికారులు భూములకు హద్దులు గుర్తించేందుకు రాగా బాధితులు అడ్డుకున్నారు. తమకు సమయం ఇవ్వాలని కోరారు. రెండ్రోజులు సర్వేను ఆపిన అధికారులు మళ్లీ బుధవారం ఉదయం సర్వే చేసేందుకు రాగా మళ్లీ బాధితులు అడ్డుకున్నారు. తమకు నోటిసులు ఇవ్వాలని, ఉన్నతాధికారులు ఇక్కడికి రావాలని, తమకు న్యాయం జరిగే వరకూ ఎలాంటి సర్వే చేపట్టొద్దని తేల్చిచెప్పారు. అయినా సర్వే అధికారులు పోలీసుల సాయంతో హద్దులను గుర్తించారు. మంగరాశికుంట మీదుగా, నర్కూడ, కవ్వగూడ గ్రామాల మధ్య కొలతలు చేపట్టి రెండు వైపులా హద్దులను ఏర్పాటు చేశారు.
బాధిత రైతు ఆత్మహత్యాయత్నం
ప్రభుత్వం రోడ్డు కోసం భూమిని స్వాధీనం చేసుకోవడంతో తనకు ఇక భూమి దక్కదని ఆందోళనకు గురైన శంషాబాద్ మండలం రామంజపూర్ గ్రామానికి చెందిన శ్రీశైలం సాగర్ అనే రైతు.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వారం రోజుల నుంచి శంషాబాద్ మండలంలోని తొమ్మిది గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ చేపట్టింది. రామంజపూర్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం అధికారులు సర్వే చేయడానికి వచ్చారు. సర్వే చేస్తున్న సమయంలో ఆందోళనతో ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడున్న వాళ్లు గమనించి అడ్డుకున్నారు.
భూ బాధితులకు న్యాయం చేయాలి
ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పేదలను రోడ్డున వేయడం సరికాదు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలి. భూ సేకరణ చేపట్టే క్రమంలో ప్రభుత్వం రైతులకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. నేరుగా సర్వే చేపట్టడం బాధాకరం. రైతులకు న్యాయం చేయాలి. -మల్లేశం, సీపీఐ(ఎం) నాయకులు
నా జీవనం ఈ భూమే..
మా తాతలు, తండ్రులు ఈ భూమినే నమ్ముకుని బతికిండ్రు. ఇప్పుడు నేనూ ఈ భూమినే నమ్ముకుని బతుకుతున్నా. నాకు ముగ్గురు పిల్లలు. పిల్లల భవిష్యత్ కోసం ఈ భూమిని కాపాడుకున్నాం. ఉన్నపళంగా భూమి రోడ్డుకు ఇవ్వమంటే మేము బతికేదెట్లా.. మా పేదల భూముల్లోనే రోడ్డు వేయాలా..? బక్కచిక్కి మా బతుకుల్లో మట్టి కొట్టడానికే మీకు చేతనైతదా. మా భూమికి రెండింతల భూమి చూపితేనే.. ఈ భూమిని తీసుకోండి. బలవంతంగా భూమి తీసుకుని, మమ్మల్ని రోడ్డుపాలు చేయొద్దు. -మల్లేష్‌యాదవ్, నర్కూడ, భూ బాధితుడు
పరిహారం వద్దు.. భూమికి భూమి ఇవ్వాలి
రేడియల్ రోడ్డు నిర్మాణంలో నా రెండు ఎకరాల వ్యవసాయ భూమి పోతుంది. ఈ భూమి 2005లో రూ.50 లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశా. ఈ భూమిని ఇప్పుడు సర్కారు రోడ్డు నిర్మాణానికి తీసుకుంటే.. మార్కెట్ ప్రకారం పరిహారం అంటే.. ఎకరాకు రూ.60 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు. మాకు పరిహారం వద్దు.. భూమికి భూమి ఇస్తేనే మా భూములు ఇస్తాం.
-ముఖిద్ద్ పటేల్, రేడియల్ రోడ్డు భూ బాధితుడు



