– ఇరాన్ నగరాలపై యూఎస్, ఇజ్రాయిల్ వైమానిక దాడులు
– నవజాత శిశువును పొట్టనపెట్టుకున్న యుద్ధోన్మాదం
– బసిత్ కమాండర్, ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌లను చంపేశాం : ఇజ్రాయిల్
– ధ్రువీకరించని టెహ్రాన్
– లెబనాన్‌లో నిరాశ్రయులవుతున్న పాలస్తీనా శరణార్ధులు
– గల్ఫ్‌లో ఇంధన సదుపాయాలపై ఇరాన్ దాడులు
– భగ్గుమంటున్న చమురు ధరలు
మధ్యప్రాచ్యంలో గత నెల 28న మొదలైన యుద్ధం మంగళవారం 18వ రోజుకు చేరుకుంది. అమెరికా, ఇజ్రాయిల్ సేనలు తాజాగా ఇరాన్ నగరాలలోని జనా వాసాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపాయి. వైమానిక దాడులలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. అరక్ నగరంలో ఓ నవజాత శిశువు, రెండున్నర సంవత్సరాల వయసున్న అతని సోదరి చనిపోవడం అందరినీ కలచివేస్తోంది.
నవతెలంగాణ – సెంట్రల్ డెస్క్
18 రోజులైనా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంతో రక్తపాతం సృష్టి స్తున్నాయి. యుద్ధనీతికి వ్యతిరేకంగా జనా వాసాల మీద బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)కు చెందిన బసిత్ దళాల కమాండర్ ఘొలామ్‌రెజా సొలైమనీని సోమవారం రాత్రి హతమార్చామని ఇజ్రాయిల్ తెలిపింది. ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లరిజానిని కూడా చంపేశామని చెప్పింది. ‘ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ లరిజానీని, బసిత్ దళాల కమాండర్ సొలైమనీని హతమార్చాం’ అని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కట్జ్ తెలియజేశారు. అయితే ఈ వార్తలను ఇరాన్ ఇంకా ధ్రువీకరించలేదు. హిజ్బొల్లాను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ సేనలు లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై దాడులు చేశాయి. లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న బాంబు దాడుల కారణంగా పాలస్తీనా శరణార్థులు నిరాశ్రయుల వుతున్నారు. ఇజ్రాయిల్ దాడిలో ఐదుగురు లెబనాన్ సైనికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్ నగరా లలోని భద్రతాదళాల కమాండ్ కేంద్రాలపై ఏకకాలం లో దాడులు చేశామని ఇజ్రాయిల్ సైన్యం తెలియ జేసింది. టెహ్రాన్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపిం చాయి. అమెరికా, ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల లో 12,000కు పైగా నివాస గృహాలు పాక్షికంగా లేక పూర్తిగా ధ్వంసమయ్యాయని నగర గవర్నర్ మహ మ్మద్ సాదెఫ్‌ు మొతామదియాన్ చెప్పారు. ఈ దాడులలో ఇప్పటివరకూ 56 మ్యూజియంలు, చారి త్రక కట్టడాలు, సాంస్కృతిక ప్రదేశాలు దెబ్బతిన్నాయి.
బాగ్దాద్‌లో యూఎస్ ఎంబసీపై దాడి
ఇరాన్ కూడా ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. ఖతార్ రాజధాని దోహాపై క్షిపణి దాడి జరి గింది. దానిని అడ్డుకునే క్రమంలో నగర శివారులోని పారిశ్రామిక ప్రాంతంపై శిధిలాలు పడి మంటలు చెలరేగాయి. ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరగవ చ్చునన్న అనుమానంతో యూఏఈ గగనతలాన్ని అనేక గంటల పాటు మూసివేశారు. యూఏఈలోని ప్రధాన చమురు క్షేత్రంపై జరిగిన డ్రోన్ దాడి కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఫుజైరాపై వరుసగా దాడులు జరుగుతుండడంతో యూఏఈకి చెందిన ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ అడ్నాక్ చమురు లోడింగును నిలిపివేసింది. ఫుజైరా చమురు పరిశ్రమ జోన్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. ఫుజైరాకు తూర్పున 23 నాటికన్ మైళ్ల దూరంలో చమురు ట్యాంకర్‌ను క్షిపణి తాకడంతో స్వల్పంగా నష్టం జరిగింది. ఇరాక్ దక్షిణ ప్రాంతంలోని చమురు క్షేత్రంపై కూడా డ్రోన్ దాడి జరిగింది. దాడుల కారణంగా దుబాయి సహా పలు అంతర్జాతీయ విమానాశ్రయాలలో అనేక సర్వీసులను రద్దు చేశారు. కొన్నింటినీ రీషెడ్యూల్ చేశారు. దుబాయి, దోహా నగరాలలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అబూధాబీపై జరిగిన క్షిపణి దాడిలో పాలస్తీనాకు చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతంపై ఇరాన్ పదుల సంఖ్యలో డ్రోన్ల దాడి జరిపింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై మంగళవారం ఉదయం డ్రోన్, రాకెట్ దాడి జరిగింది. మూడు డ్రోన్లు, నాలుగు రాకెట్లతో దాడి జరిగిందని, వాటిలో ఒక డ్రోన్ ఎంబసీ ప్రాంగణంలో పడిందని అధికారులు తెలిపారు. అటు ఇజ్రాయిల్ నగరాలపై కూడా దాడులను ఇరాన్ ముమ్మరం చేసింది. అనేక క్షిపణులను ప్రయోగించింది. ఆక్రమిత ప్రాంతాల వైపు ఇరాన్ క్షిపణులు దూసుకొస్తున్నాయని ఇజ్రాయిల్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది.
వాటిని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించేలా చూడండి : దౌత్యవేత్తలను కోరిన అమెరికా
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ), లెబనాన్‌కు చెందిన హిజ్బొల్లాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించేలా మిత్ర దేశాలకు నచ్చచెప్పాలని ట్రంప్ ప్రభుత్వం అమెరికా దౌత్యవేత్తలకు సూచించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి మార్కో రుబియో సంతకంతో కూడిన ఆదేశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దౌత్యవేత్తలకు, కాన్సులర్లకు పంపారు. ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు అమెరికా తన మిత్ర దేశాలకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తన సైనిక చర్యకు మద్దతు కోరుతోంది.
పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ కమాండర్‌పై దాడి చేశాం : ఇజ్రాయిల్
పాలస్తీనాకు చెందిన ఇస్లామిక్ జిహాదీ గ్రూపు సైనిక విభాగం అధిపతి అక్రం అల్-అజౌరీపై దాడి చేశామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. ప్రస్తుతం ఆయన ఇరాన్‌లో నివసిస్తున్నారు. దాడిలో ఆయన చనిపోయిందీ లేనిదీ ఇజ్రాయిల్ సైన్యం చెప్పలేదు. పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ గ్రూప్ హమాస్‌కు భాగస్వామిగా కొనసాగుతోంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ జరిపిన దాడిలో ఈ గ్రూపు కూడా పాలుపంచుకుంది.
అమెరికా-ఇజ్రాయిల్ దాడులను ఖండించండి : ప్రపంచ దేశాలను కోరిన ఇరాన్
అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండించా ల్సిందిగా ప్రపంచ శాంతి, భద్రతను కోరుకుంటున్న దేశాలు, సంస్థలన్నింటినీ ఇరాన్ కోరింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తన టెలిగ్రాఫ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. హర్మూజ్ జలసంధిలో ఎదురవుతున్న అడ్డంకులను ఏ ఒక్క దేశం స్వతంత్రంగా తొలగించలేదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు ఆయన సూచించారు. ఇదిలావుండగా యుద్ధం మొదటి రోజున ఇరాన్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిపై ఐరాస విచారణ ప్రారంభించింది. ఈ దాడిలో 168 మంది పిల్లలు మరణించిన విషయం తెలిసిందే.
ఇరాక్ నౌకలకు అనుమతి
హార్ముజ్ జలసంధిలో చిక్కుబడిన తమ నౌకల రవాణాకు అనుమతించే విషయంపై ఇరాన్‌తో అవగాహన కుదిరిందని ఇరాక్ తెలిపింది. ఈ మేరకు ఇరాక్ చమురు మంత్రి హయన్ అబ్దుల్-ఘనీ ఒక ప్రకటన చేశారు.
హార్ముజ్ గతంలోలా ఉండదు : ఇరాన్
హార్ముజ్ జలసంధి గతంలోలా ఉండదని, అది ఇకపై నౌకల ప్రయాణానికి సురక్షితం కాదని ఇరాన్ హెచ్చరించింది. ఈ హెచ్చరిక నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమన్నాయి. అమెరికాలో గ్యాస్ ధరలు బాగా పెరిగాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయిల్ ఉనికి కారణంగా హార్ముజ్‌కు ప్రమాదం పొంచి ఉన్నదని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బకర్ ఖలీబాఫ్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ జలసంధి పూర్వస్థితికి చేరుకోదని ఆయన స్పష్టం చేశారు. దానికి ఇకపై ఎంతమాత్రం భద్రత లేదని తెలిపారు. ఇరాన్ ఆయుధ స్థావరాలను అమెరికా బాంబులు, జెట్ విమానాలు ఏమీ చేయలేవని అన్నారు. కాగా గల్ఫ్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ జరిపిన తాజా దాడుల కారణంగా అంతర్జాతీయంగా చమురు, సహజ వాయువు సరఫరాలపై ఆందోళన నెలకొంది.
మానవతా సాయం అందిస్తాం : చైనా
ఇరాన్, లెబనాన్ సహా మధ్యప్రాచ్య దేశాలకు మానవతా సాయం అందజేస్తానని చైనా తెలిపింది. ఇరాన్‌పై దాడులను ఆపాలని అమెరికా, ఇజ్రాయిల్ దేశాలను కోరింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడాన్ని విమర్శించింది. ఈ యుద్ధం ఇరాన్‌లోనూ, మధ్యప్రాచ్య దేశాలలోనూ తీవ్రమైన మానవతా సంక్షోభానికి కారణమవుతోందని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ చెప్పారు.
గుజరాత్ ఓడరేవుకు చేరిన ‘నందాదేవి’
మన దేశానికి చెందిన రెండో ఎల్పీజీ నౌక ‘నందాదేవి’ మంగళవారం గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారక జిల్లా వదినార్ ఓడరేవుకు చేరుకుంది. ఇందులో 46,500 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది. దానిని బీడబ్ల్యూ బిర్చ్ అనే నౌకలోకి మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ చెప్పారు. ఈ ప్రక్రియకు రెండు రోజుల సమయం పడుతుంది. అది పూర్తయిన తర్వాత గ్యాస్‌లో కొంత భాగాన్ని తమిళనాడులోని ఎన్నూర్ ఓడరేవుకు, కొంత భాగాన్ని పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా పోర్టుకు చేరుస్తారు. మొదటి నౌక ‘శివాలిక్’ సోమవారం నాడే ముంద్రా ఓడరేవుకు చేరిన విషయం తెలిసిందే. కాగా హార్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నౌకలను స్వదేశానికి చేర్చే విషయంపై ఇరాన్‌తో చర్చిస్తున్నామని విదేశాంగ కార్యదర్శి తెలిపారు.



