Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యారంగానికి మొండి చేయి

విద్యారంగానికి మొండి చేయి

- Advertisement -

కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణకు ఊతమిస్తున్న బీజేపీ : ఎస్‌ఎఫ్‌ఐ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం విద్యను పూర్తిగా పక్కకు పెట్టిందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌. రజినీకాంత్‌, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన నిధులపై తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. విద్యారంగానికి రూ.1,39,289 కోట్లు (కేంద్ర బడ్జెట్‌లో 2.6 శాతం) మాత్రమే కేటాయించడం జీడీపీలో 6 శాతం ఖర్చు చేయాలనే లక్ష్యానికి చాలా దూరంగా ఉందని వారు విమర్శించారు. పాఠశాల విద్యకు రూ.83,562 కోట్లు మాత్రమే కేటాయించడం గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాల పిల్లలకు అందుబాటులో పాఠశాలలు లేకుండా చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్టెట్‌ కేటాయింపులు లేకపోవడంతో ఆ వర్గాలు విద్యా హక్కు నుంచి మరింత దూరమయ్యే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు పాఠశాలల మూసివేత, ఉపాధ్యాయుల కొరత, సౌకర్యాల లేమి ఉండగా వాటిని తీర్చే ఉద్దేశం బీజేపీకి లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత విద్య కోసం కేటాయించిన మొత్తం రూ.55,727 కోట్లు విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, పరిశోధనా సంస్థల అభివృద్ధికి పూర్తిగా సరిపోదని తెలిపారు. ఫీజుల పెంపు, స్కాలర్‌షిప్‌ల తగ్గింపుతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు.

తద్వారా నూతనంగా ఏర్పాటు చేస్తామన్న యూనివర్సిటీల ఏర్పాటు ఈ నిధులు సరిపోవు. సాంకేతిక విద్యకు రూ.23 వేల కోట్లకే కేటాయింపులను పరిమితం చేయడం యువత నైపుణ్యాలను పెంచే బాధ్యతను విస్మరించడమేనని వారు పేర్కొన్నారు. మహిళా విద్యను పెంచటానికి నూతనంగా జిల్లాకు ఒక బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటనకు అనుగుణంగా నిధులు కేటాయించలేదని తప్పుపట్టారు. నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020) అమలు చేస్తామని చెప్పే కేంద్ర ప్రభుత్వం, దానికి అవసరమైన ఆర్థిక వనరులు కేటాయించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యారంగానికి కేటాయింపులను పెంచి, ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం నిలిపివేసి, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలను బలోపేతం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -