సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో..
అధికారులు, కాంట్రాక్టర్లతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సమీక్షా సమావేశం
నవతెలంగాణ-కొత్తగూడెం
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ పాలకులు దోచుకుతింటున్నారని, బీఆర్‌ఎస్ పదేండ్లలో తీవ్రంగా దోచుకుందని, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలోనూ అదే తీరును పుణికి పుచ్చుకుందని, తెలంగాణకు గుండెకాయ అయిన సింగరేణిలో అవినీతి పేరుకుపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం ఆయన పర్యటించారు. సింగరేణి ఏరియాలోని వీకే 5 ఇంక్లైయిన్ గనిని సందర్శించారు. గనిలోకి మ్యాన్‌రైడింగ్ ద్వారా వెళ్లారు. అనంతరం గనిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులతో మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించడం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్ణయించిన జీవోలను, చట్టాలను సింగరేణిలో అమలు చేయించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని జేఏసీ నేతలు కోరారు. అనంతరం పీవీకే బొగ్గు గని వద్ద కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు.
సమస్యలపై కార్మిక సంఘాల డిమాండ్
ఈ క్రమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ప్రస్తావించకుండానే మంత్రి ప్రసంగం ముగించడంతో జేఏసీ రాష్ట్ర నాయకులు ఎస్సీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, టీయూసీఐ నాయకులు షేక్ యాకుబ్ షావలి, కరుణాకర్, సురేందర్, బ్రహ్మచారి, భూక్యా రమేష్, నాయకులు తదితరులు సభలో లేచి నిలబడి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయించాలని డిమాండ్ చేస్తూ నినదించారు. ఈ విషయాలపై మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు మంద నరసింహారావు, రాష్ట్ర ఆఫీస్ బేరర్ విజయగిరి శ్రీనివాస్ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు భూక్య రమేష్, ఐఎఫ్‌టీయూ జిల్లా సెక్రెటరీ బి.రామ్ సింగ్, గూడెల్లి యాకయ్య, రవి గుగులోత్ సక్రం, నందిపాటి రమేష్, రాణి, స్వాతి, భాస్కర్, బి.రవి, అనీల్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.



