Sunday, March 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలులేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానించాలి

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానించాలి

- Advertisement -

నాలుగు కోడ్‌లతో కార్మికులకు తీవ్ర నష్టం
రాహుల్‌గాంధీ మాట కూడా పట్టదా?
అంబేద్కర్‌ విగ్రహం వద్ద కార్మిక సంఘాల నిరసన

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలనీ, వాటిని రాష్ట్రంలో అమలు చేయబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. నాలుగు లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తమ నిరసనలను వ్యక్తం చేస్తోందని తెలిపాయి. లేబర్‌ కోడ్‌ల అంశంపై శనివారం హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా సంఘాల నేతలు మాట్లాడుతూ..కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని నినాదాలు చేశారు. రాహుల్‌ గాంధీ, పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నాలుగు లేబర్‌ కోడ్‌లను వ్యతిరేకించారని గుర్తు చేశారు.

కేరళం, తమిళనాడు తదితర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్‌ కోడ్‌లను తమ రాష్ట్రంలో అమలు చేయబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాయని తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని కార్మిక వర్గం ఐదు నెల్లుగా పోరాడుతున్నదని తెలిపారు. గడిచిన జూలై 9, ఈ ఏడాది ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలు నిర్వహించాయని గుర్తు చేశారు. ఆ పోరాటాలకు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతునిచ్చాయని తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధాన. ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాహుల్‌ గాంధీ వీటికి వ్యతిరేకంగా పోరాడారనీ, ఫిబ్రవరి 12 సమ్మెకు అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి సికె వేణుగోపాల్‌ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మద్దతునిచ్చారని తెలిపారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం లేబర్‌ కోడ్‌లపై నాన్చుడు ధోరణి, ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. ఆ కోడ్‌లను అమలు చేసేందుకు చాపకింది నీరులాగా రూల్స్‌ తయారు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ద్వంద విధానాన్ని మానుకోవాలని హెచ్చరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌. బాలరాజ్‌ మాట్లాడుతూ గౌరవప్రదమైన వేతనాలు, సామాజిక భద్రత కోసం, పోరాటాలు జరిగాయన్నారు. శాశ్వత స్వభావం గల పనుల్లో నిమగమైన కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్ధీకరణ కోసం ఉద్యమాలు జరిగాయని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం, బోనస్‌, గ్రాట్యుటీ,పెన్షన్‌ హక్కులు మొదలైన వాటి కోసం కార్మిక సంఘాలు పోరాడాయని గుర్తు చేశారు. 1926 ట్రేడ్‌ యూనియన్ల చట్టం ద్వారా యూనియన్‌ ఏర్పాటు హక్కులను చట్టబద్ధం చేసుకోగలిగామన్నారు.

ఐఎన్‌టీయూసీి జాతీయ ఉపాధ్యక్షులు నాగన్న గౌడ్‌ మాట్లాడుతూ కేంద్రంలోని ప్రస్తుత పాలకవర్గం ఈ కార్మిక కోడ్‌ల ద్వారా, కఠినమైన మార్పులతో కార్మికుల ప్రయోజనాలను రద్దు చేయబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె చేసే హక్కును ఆచరణాత్మకంగా అసాధ్యం చేయడం కుట్ర పూరితమని విమర్శించారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎల్‌ పద్మ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న సంఘటిత హక్కును, సామూహిక బేరసారాల హక్కును నిలుపుకోవాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ, రమ, భూపాల్‌, విఎన్‌. రావు, జె. మల్లిఖార్జున్‌, కె. ఈశ్వర్రావు, రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్‌, కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌ఎస్‌ఆర్‌ఎ, ప్రసాద్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి జె. కుమారస్వామి, సిటీ నాయకులు మహేందర్‌, రాములు, ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఐఎఫ్‌టీయూ శివబాబు, అనూరాధ, అరుణక్క, టీయూసీఐ నగర కార్యదర్శి ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -