Thursday, December 25, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కేసీఆర్‌కు మళ్లీ అధికారం కల్లే!

కేసీఆర్‌కు మళ్లీ అధికారం కల్లే!

- Advertisement -

నన్ననడం కాదు.. మటన్‌కొట్టు కాడ తోలు తీస్కో
నేను నోరు విప్పితే మల్లన్నసాగర్‌లో దూకి చస్తావ్‌..
నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం మరచిపోవాల్సిందే
పాస్‌పోర్ట్‌ వ్యవహారంలో బ్రోకర్‌గా వ్యవహరించిన మీరా నాకు చెప్పేది
2029లోనూ కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగిస్తుంది
గ్రామాలకు ప్రత్యేక గ్రాంట్‌ నిధులు
చిన్న గ్రామాలకు రూ.ఐదు లక్షలు
పెద్ద గ్రామాలకు రూ.పది లక్షలు
సర్పంచ్‌లు అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రజాసేవ చేయాలి : కోస్గి ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
” నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్‌ అధికారంలోకి రావడం కల్లే.. ఈయన కుటుంబం కూడా రాదు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ చరిత్ర గతంగా మిగిలిపోతుంది. కొడంగల్‌ సాక్షిగా ఇదే నా శపథం. నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క.. నేను బయటకు వచ్చి తోలు తీస్తాను అంటున్న మాజీ సీఎం కేసీఆర్‌.. మటన్‌కొట్టు మాస్టర్‌కు చెప్తా.. అక్కడికి వెళ్లి తోలు తీసుకో.. పాస్‌పోర్ట్‌ వ్యవహారంలో బ్రోకర్‌గా పనిచేసి లక్షలాది మంది కుటుంబాలను రోడ్డున పడేసిన మీరా నాకు చెప్పేది.. తోలు తీసుడు కాదు.. మీ తోలు సంగతి చూసుకోండి.. మా సర్పంచులు చీరి చింతకు కట్టి చింతమడకకు పంపిస్తారు జాగ్రత్త.. మీ గాండ్రింపులకు, బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు.. రెండు సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నా. సోయిలేని మాటలు, స్థాయి లేని విమర్శలు చేసుకుంటూ ప్రజలకు పనికొచ్చే మాటలు ఒక్కటైనా మాట్లాడలేదు.

40 ఏండ్ల రాజకీయం.. పదేండ్ల ముఖ్యమంత్రి అనుభవం కలిగిన కేసీఆర్‌ రెండేండ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టడం ఆయన అనాలోచిత విధానాలకు నిదర్శనం ” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం నూతన సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం అన్న మహాత్మాగాంధీ మాటలు ఇప్పటికీ ఆచరణీయమని అన్నారు. సర్పంచులు ప్రజలకు ఇచ్చిన హామీలను చెప్పాలని తన వద్దకు వచ్చారని, వారి హామీలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి నిధుల నుంచి స్పెషల్‌ గ్రాంట్‌ ద్వారా అత్యధిక నిధులు పంచాయతీలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో గుడి, బడి, విద్య, వైద్యం, ఉపాధి, ఆవాసం తదితర వాటికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు.

కొడంగల్‌ యువత కోసం ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా గుర్తించి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి.. ఎన్నికల వరకు రాజకీయాలు చేసి ఎన్నికలు పూర్తికాగానే రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని కొడంగల్‌ వేదికగా 12,706 గ్రామ పంచాయతీలకు ఆయన సూచించారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజాసేవ చేయాలని చెప్పారు. ఎస్డీఎఫ్‌ నిధులను గ్రామాలకు మళ్లించి అభివృద్ధికి సహకరిస్తానని సీఎం రేవంత్‌ అన్నారు. కొత్తగా గెలిచిన సర్పంచులు గ్రామాల్లో సమస్యలను గుర్తించి ఎన్ని నిధులు అవసరమో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రత్యేక గ్రాంట్‌ కింద చిన్న గ్రామాలకు రూ.ఐదు లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.పది లక్షల చొప్పున కేటాయిస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులకు ఇవి అదనం అని తెలిపారు. కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తున్న ఇందిరమ్మ చీరలను సారేగా గుర్తించాలని కోరారు.

నేను వ్యక్తిగత కక్షలకు పాల్పడను..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భీమా, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతోపాటు పాలమూరు-రంగారెడ్డిని ఎందుకు పూర్తి చేయలేదని కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 2009లో వచ్చిన వరదల కారణంగా ముంపునకు గురైన వారిని కాపాడేందుకు తన సొంతిల్లు అమ్ముకునైనా ఇల్లు నిర్మించి ఇస్తానన్న హామీ ఏమైందన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు పదేండ్లలో వాళ్లు చేసిన అప్పులు గుదిబండగా మారాయన్నారు. ”నా కోపాన్ని దృష్టిలో పెట్టుకుని పగ సాధించాలనుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఊరుకున్నా. ఫామ్‌హౌస్‌లో బందీగా మారిన ఆయన, ఆయన కుటుంబం వాళ్ల పాపాన వాళ్లు పోతారని ఊరుకున్నా. తొడుక్కోవడానికి చెప్పులు, వేసుకోవడానికి బట్టలు లేని వాళ్లకు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదు’ అని ముఖ్యమంత్రి అన్నారు. నాపై 181 కేసులు అక్రమంగా బనాయించి జైలుకు పంపారని అన్నారు.

”నేను తలుచుకుంటే కేసీఆర్‌ కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపే వాడిని.. కానీ, వ్యక్తిగత కక్షలకు పాల్పడను” అని అన్నారు. ఫ్యూచర్‌ సిటీపై వ్యంగ్యంగా మాట్లాడారని, కానీ తెలంగాణ రెండేండ్ల అభివృద్ధిపై చర్చిస్తే రాళ్లు కట్టుకొని మల్లన్న సాగర్‌లో దూకి చస్తావని హెచ్చరించారు. పడావు పట్టిన ప్రాజెక్టుల పనులు ఒక్కొక్కటిగా మొదలయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.20లక్షల చొప్పున జమ చేశామని గుర్తు చేశారు. ‘ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పేద కుటుంబానికి సన్న బియ్యం అందిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. 9 నెలల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేలా చూసే బాధ్యత తనదేనన్నారు. వచ్చే అకడమిక్‌ నుంచి విద్యార్థులకు చదువుతోపాటు అల్పాహారం, భోజనం అందిస్తామన్నారు.

తన భర్త ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని వాళ్లింటి ఆడబిడ్డే చెబుతున్నారు..
2029 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించి కాంగ్రెస్‌ తన సత్తా చాటుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ”రేవంత్‌రెడ్డి రాజకీయాలు చేసినంత కాలం కేసీఆర్‌ అధికారంలోకి రావడం కల్ల.. కల్లు కాంపౌండ్‌లో మాట్లాడే కేటీఆర్‌ వన్‌ బై థర్డ్‌ మెజార్టీ కాంగ్రెస్‌కు వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని అన్నారు. ”రెండేండ్ల తర్వాత కేసీఆర్‌ బయటకు వచ్చి సభలు పెడతారట.. పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడు కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రండి.

ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం శాసనసభలో మాట్లాడాలి. లేకుంటే పశువులు, బర్రెలు కాచే పనిలో ఉండు.. సొంత బిడ్డకు వాటా ఇవ్వని తండ్రి.. ఈ ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు.. సొంత చెల్లెలి భర్త ఫోన్‌నే ట్యాపింగ్‌ చేశారని వాళ్లింటి ఆడబిడ్డనే చెబుతున్నారు. సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్‌ నాకు సవాల్‌ విసురుతున్నారు..” అని అన్నారు. ‘రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ దందా అంటున్నారు.. ఇదేం దుబాయ్ పాస్‌పోర్ట్‌ బ్రోకర్‌ దందా కాదు. నేనేం పాస్‌పోర్టు బ్రోకర్‌ దందా చేయలేదు.. అయ్య పేరు చెప్పుకుని మంత్రి పదవి తీసుకోలేదు.. మా జోలికి వస్తే మా కార్యకర్తలు ఊరుకోరు’ జాగ్రత్త అని హెచ్చరించారు.

2029 ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటుతాం..
2029లో ఎవరి లెక్క వారిదే.. కాంగ్రెస్‌ ప్రజల మనసులను చూరగొని విజయం సాధిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. 150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100కు పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలుస్తుందన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -