Saturday, November 15, 2025
E-PAPER
Homeకవర్ స్టోరీభారతీయ సినిమాలో ఒక ఇసుక తుఫాను రిత్విక్‌ ఘటక్‌

భారతీయ సినిమాలో ఒక ఇసుక తుఫాను రిత్విక్‌ ఘటక్‌

- Advertisement -

ఆయన భారతీయ నవ్య సినిమా ఉద్యమంలో ఎగిసిన ఒక తొలికెరటం. గొప్ప మేధావి, భారతదేశంలో తొలి రాజకీయ సినిమా తీసిన ధైర్యశాలి. గొప్ప ప్రతిభా సంపన్నుడు. అయితే చాలామందికి కనిపించడానికి ఆయన వ్యక్తిగా ఒట్టి తాగుబోతు. రికామిగా తిరిగుతూ నిర్లక్ష్య పూరితమైన జీవితం గడిపినవాడు. కలకత్తా వీధులవెంట తిరిగిన ఓ సాదాసీదా మధ్యతరగతి జీవి. వాస్తవిక సినిమా ప్రియులకు అంతర్జాతీయంగా సుపరిచితుడు, అంతటి మహానుభావుని పేరు ‘రిత్విక్‌ ఘటక్‌’.

రిత్విక్‌ ఘటక్‌ భారతదేశ ఆధునిక, అభ్యుదయ, నవ్య సినిమాకు తొలితరం దర్శకులలో ఒకరు. భారతీయ నవ్య సినిమా నేడు నాలుగు స్తంభాలపై బలంగా నిలబడి ఉన్నది అంటే అందులో ఒకరు రిత్విక్‌ ఘటక్‌. మిగతా ముగ్గురు సత్యజిత్‌ రే, తపన్‌ సిన్హా, మృణాల్‌ సేన్‌. వీరంతా ఆయన సమకాలికులు కూడా. ఇది రిత్విక్‌ ఘటక్‌ శతజయంతి సంవత్సరం. దేశవ్యాప్తంగా జాతీయ సినిమా రంగం అంతా కూడా ఆయన నూరేళ్ల జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భం ఇది. రిత్విక్‌ ఘటక్‌ జీవితకాలంలో పొందవలసిన పేరు ప్రఖ్యాతులు పొందలేదు. మరణానంతరమే ఆయన సినిమాల్లో ఉన్న వాస్తవికతను చూసి గుర్తింపునిచ్చారు. ‘సినిమా కళ కేవలం వినోదం కోసం కాదు – సమాజం కోసం” అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఘటక్‌ ఉత్తమ దర్శకుడే కాదు, నటుడు, నిర్మాత, ఎడిటర్‌, ప్రయోక్త కూడా. 1925 నవంబర్‌ 4 న ఢాకాలో జన్మించాడు. ఆయన తల్లి ఇందుబాలాదేవి. తండ్రి రారు బహదూర్‌ సురేశ్‌ చంద్ర ఘటక్‌ డిప్యూటీ మేజిస్ట్రేట్గా పనిచేసేవారు.

ఆదివాసీల కోసం జీవితాంతం పనిచేసిన ఆయన కవి, నాటక రచయిత, రచయిత్రి మహాశ్వేతాదేవి స్వయాన ఆయన మేకోడలు. చిన్నతనంలో రిత్విక్‌ అవనీంద్రనాథ్‌ ఠాగూర్‌, గగనేంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రభావంతో చిత్రకళ, సంగీతాల పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ, తారాశంకర్‌ బంధోపాధ్యాయ, మాణిక్‌ బెనర్జి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, అబ్రహాం లింకన్‌, లెనిన్ల సాహిత్య ప్రభావంతో తనను తాను రూపొందించుకున్నాడు. రిత్విక్‌ ఘటక్‌ మొదట మార్క్సిజంవైపు ఆకర్షితులై 1946లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1948లో బెర్హంపూర్‌ కాలేజీ నుండి డిగ్రీ పొందిన ఆయన ఆ తరువాత ఇష్టాలో చేరి నాటకాలు రాసి, ప్రదర్శించారు. అవన్నీ బహిరంగ ప్రదర్శనలు కావడం విశేషం. ఉస్తాద్‌ అల్లావుద్దీన్‌ ఖాన్‌, పాశ్చాత్య సంగీతకారులు బీధోవెన్‌, పాల్‌ రాబ్సన్‌ లను ఆరాధించిన రిత్విక్‌. ఎస్‌.డి.బర్మన్‌, అబ్బాసుద్దీన్‌ ల సంగీతంతో ప్రభావితులైనారు. రవీంద్రుడు, సుకాంత భట్టాచార్యల కవితల ప్రభావం ఆయనపై చాలా ఉండింది.

సుకాంత కవిత ‘చీటి’ను తన ‘బరీథేకే పతియే’, ‘కోమల్గా గాంధర్‌’ వినిపిస్తారు. 1948లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. డిగ్రీ తీసుకున్నాడు. విద్యార్థి దశ ఉండే రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించి ‘రబీల్‌’, ‘జ్వాలా’, ‘సంభో’, ‘గెలీలియో’ మొదలైన నాటకాలను రచించి, సమర్పించి వాటిలో నటించాడు. ‘ఇష్టా’లో చేరి మొదట సాహిత్యం, తదుపరి నాటకం, ఆ తదుపరి సినిమా… ఇలా ఒకదాన్నుండి మరో దాంట్లోకి ప్రవేశించడం కేవలం ప్రజలకు సన్నిహితం కావడానికే. ఇలా తన ఆశయాలను ప్రకటించేందుకు, ప్రజలకు చేరువయ్యేందుకు ఘటక్‌ వీలైనంత కషి చేశాడు. కాని ఆ కషికి జీవించి వున్న కాలంలో రావలసినంత గుర్తింపు రాలేదు. కారణం వ్యాపార సినిమా ప్రేక్షకుని తప్పుదోవ పట్టించడమే.

ఘటక్‌ సినిమా నిర్మాణాన్ని సొంతంగా తనకు తానే నేర్చుకున్నాడు. తనదైన శైలిని ఏర్పరచుకున్నాడు. ఆయన నిర్మించిన చిత్రాలను చూసి ఎందరో ప్రభావితులై ఆదర్శంగా తీసుకున్నారు. పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో వైస్‌-ప్రిన్సిపాల్‌ గా ఉన్నపుడు ఆయనవద్ద శిష్యరికం చేసిన శ్యామ్‌ జెనెగల్‌, సత్యదేవ్‌ దూబె, జాన్‌ అబ్రహం, మణికౌల్‌, అదూరు గోపాలకష్ణన్‌, కుమార్‌ సహాని వంటివారు ఎందరో ఆ తరువాత న్యూ సినిమా రంగంలో ఉన్నత దర్శకులై వెలుగు వెలుగారు. రిత్విక్‌ ఘటక్‌ 1953లో రెండేళ్ళపాటు రాజకీయ ఖైదీగా జైలులో ఉంచబడిన సురమను 1955లో వివాహం చేసుకున్నాడు. ఆమె ‘ఇస్లా’లో పనిచేసేవారు. నిమారు ఘోష్‌ ‘చిన్నముల్‌’ (1950) సినిమాతో నటుడు, సహాయ దర్శకునిగా రిత్విక్‌ సినీరంగ ప్రవేశం జరిగింది. సినిమా కళ అధిక సంఖ్యాకులను త్వరితంగా ప్రభావితం చేస్తుంది.

కుల, మత భేధాల ప్రసక్తి లేకుండా అన్ని రకాల ప్రజా బాహుళ్యాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి సినిమాకుంది. సినిమా దర్శకుడు, రచయిత తన భావాలను మాత్రమే చూపుతాడు. కానీ చూపిన ఆ భావాలకు సార్ధకత చేకూర్చేవారు ప్రేక్షకులే అని అంటాడాయన. ఈ భావనలో ఘటక్‌ ను సత్యజిత్‌ కన్నా ఉన్నతుడుగా చెప్పుకోవచ్చు. అయితే ‘రే’ ని మనం భారతీయ వాస్తవిక సినిమాకు ఆద్యుడని చెప్పుకుంటున్నాం. కాని ఆయనకన్నా ముందుగానే ఘటక్‌ న్యూ సినిమాకు అంకురార్పణ చేశాడన్న విషయంలో చరిత్రకారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. కలకత్తాకు వచ్చి అందులో భాగమైపోయిన తూర్పు బెంగాల్‌ శరణార్థుల దయనీయ స్థితిని, శ్రమజీవులైన కార్మిక, కర్షకుల పోరాటాన్ని 1952లోనే ‘నాగరిక్‌’ సినిమాలో చూపారాయన. కానీ దురదష్టవశాత్తు ఈ సినిమా విడుదలకు నోచుకోకపోవడంతో రే ‘పథేర్‌ పాంచాలి’కి (ఇదీ గొప్ప చిత్రమే) ‘నాగరిక్‌’ క్రెడిట్‌ దక్కింది, ఘటక్‌ తొలి చిత్రం ‘నాగరిక్‌’ కన్నాన ముందుగా ‘బె దేవి’ (1950) సినిమా మొదలుపెట్టాడు. కాని ఇది అసంపూర్తిగానే మిగిలిపోయింది.

ఆయన తదుపరి చిత్రం ‘అజాంతరిక్‌’ 1958లో విడుదలైంది. విడుదలైన ఘటక్‌ తొలి చిత్రమిది. ఈ సినిమా ఆయనకు ‘రే’ని మించిన దర్శకునిగా పేరు తెచ్చిపెట్టింది. ‘అజాంతరిక్‌’ విడుదల తర్వాత భారతీయ సినీరంగంలో కొత్తతరహా సినిమాల నిర్మాణానికి ఘటక్‌ హేతువైనాడు. ఒక కారు డ్రైవర్‌ తన కారు పట్ల ప్రదర్శించే అభిమానం, ప్రేమలను చూపుతాడు. కారు డ్రైవరే ఈ సినిమాలో నాయకా నాయకులుగా కనిపిస్తారు మనకు, సామాజిక సమస్యలను సున్నితంగా చిత్రీకరిస్తూనే తిరుగుబాటుతనాన్ని చూపడం ఘటక్‌ సినిమాల్లోని ప్రత్యేకత. నమ్మినదాన్ని అంతే నిజంగా తెరకెక్కించాడాయన. ఆయన ఆలోచనలు, అభిప్రాయాలన్నీ ఆయన సినిమాల్లో ప్రతిబింబిస్తాయి. ‘అజాంతరిక్‌’ తదుపరి ‘జారీ తేకే పాలియే’లో పెద్దల ప్రపంచం గురించి ఒక పిల్లవాని ఆలోచనలను చిత్రీకరించాడు. ఈ ప్రయోజనాత్మక చిత్రాన్ని సగటు ప్రేక్షకుడు చూసి ఆనందించలేకపోయినా డెనీస్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలందుకుంది.

బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించిన తొలి ఘటక్‌ చిత్రం ‘మేఘదక తార’ (1960). ఆర్ట్‌ సినిమా. ప్రేక్షకులెవరూ ఈ చిత్రాన్ని మరువలేదు. వివాహానికి దూరంగా వుండి, తన కుటుంబాన్ని పోషించే బాధ్యతలలో ఒక స్త్రీ ఎదుర్కొనే సంఘర్షణల నేపథ్యమే ఈ చిత్రం, అంతగా సేవ చేసిన తన కుటుంబమే ఆమెను ఈసడించుకుంటుంది. చివరగా బ్రతుకు కోసం ఆమె నిస్సహాయంగా అరిచే అరుపులను వినేవారే కరువవుతారు. ఈ సినిమా కొనసాగింపుగా మరో రెండు సినిమాలు తీశాడు. వీటిని ”మేఘధక తార ట్రయాలజీ”గా చెప్పుకుంటాడు. రెండో చిత్రం ‘కోమల్‌ గాంధార’ (1961), బెంగాల్లో ప్రగతిశీల కళా ఉద్యమాల్లో దర్శకుని అనుభవాలు, నాయిక ఎదుర్కొనే కష్టనష్టాలు ఇందులో చూపాడు. ఈ చిత్రంలో నాయకా నాయికలు చివరి దశ్యంలో ఒక నదీ తీరాన కూర్చుని ఉంటారు. అప్పుడు బీడు భూమిని తాకుతూ నది పారుతుంది. ఇది ఘటక్‌ ఆశావాదాన్ని తెలుపుతుంది.

ఈ ట్రయాలజీలో మూడో చిత్రం ‘సుబర్ణ రేఖ’.ఒక శరణార్థురాలిని వ్యభిచార నరక కూపంలోకి ప్రవేశించే దుస్థితికి దిగజార్చిన సమాజంపై ఘటక్‌ తీవ్రంగా ధ్వజమెత్తాడు. అసలే భయంతో కంపించిపోతున్న ఆ అమ్మాయి దగ్గరికి విటుడిగా వచ్చిన మొదటివాడామె సోదరుడే కావడంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ మూడు చిత్రాలతో ఘటక్‌ మహాదర్శకుడన్న విషయం ప్రపంచ సినిమా ప్రజలకు తెలిసిపోయింది. బెంగాలీల జీవితాలనే చిత్రించినా, ఘటక్‌ చిత్రాలు విశ్వమానవాళి భావాలకు నిదర్శనంగా నిలుస్తాయి. ‘బబూ’ జాతి జలారీల జీవితాలపై చిత్రించిన ‘టిటాస్‌ ఎక్తీ నదీర్‌ నామ్‌’ లో జీవిత పరమార్థం జీవించడమే అన్న సత్యాన్ని దాటుతాడు. ఘటక్‌ ఆఖరి సినిమా ‘జాక్షీ తక్కో గొప్పో’ (1974) ఈ సినిమా నక్సలిజానికి విషాదాంతం తప్పదని చెబుతుంది. అరవయ్యవ దశకం ఆఖర్లో 70 దశకం ఆరంభంలో మావోయిస్ట్‌ (నక్సలైట్ల) ఉద్యమం ఈ కథా నేపథ్యం.

భ్రమలు తొలిగిన ఒక నక్సలైట్‌ కథ ఇది. ఫిలిం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వారి ఆర్థిక సాయంతో తయారైన ఈ చిత్రం 1971-72లో చెలరేగిన రాజకీయ కల్లోలాన్ని నేపథ్యంగా ఒక త్రాగుబోతు దష్టిలో చూపించాడు. ఈ కాలంలోనే ఘటక్‌ తాగుడుకు బానిసవడం జరిగింది. అందుకే ఈ సినిమా ఆయన మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. అనంతరం ఘటక్‌ మరో మూడు చిత్రాలు ప్రారంభించి అపివేశాడు. మూడు లఘుచిత్రాలు కూడా తీశాడు. వీటిలో ‘అమర్‌ లెనిన్‌’ అనే చిత్రం రష్యాలో ‘మై లెనిన్‌’ పేర విడుదలై విజయం సాధించింది. మిగతా లఘుచిత్రాలు ‘సీజర్స్‌, ఫియర్‌’ అనేవి కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. చివరి రోజుల్లో ఫార్ములా చిత్రాల విజృంభణలో సైతం తన ఉన్నత ఆశయాలను వీడలేక పేద ప్రజల అండ కోసం తానెప్పుడూ సిద్ధమేనని వారిని మరువలేనని అనేవాడు. చివరి రోజుల్లో క్షయ వ్యాధితో బాధపడుతూ ఊపిరితిత్తులు కన్నాలుపడి నాటుసారా వల్ల లివర్‌ దెబ్బతిని అత్యంత విషాదభరితమైన జీవితాన్ని చవిచూసి కన్నుమూసాడు.

ఆయన భార్య మాటల్లోనైతే ‘ఘటక్‌ వైరుధ్యాలతో కొట్టుమిట్టాడిన ఒక తిరుగుబోతు’. ఘటక్‌ కు వేదాలు, భారతీయ సంస్కతి, సంప్రదాయాల గురించి ఉన్న లోతైన జ్ఞానం మనలో చాలా మందిని ఆరాధించింది. బెంగాల్‌ విభజన, దాని వల్ల ఏర్పడిన మానవ విషాదం అతని చిత్రాలకు పునరావతమయ్యే ఇతివత్తంగా, వ్యామోహంగా మారింది. సామాన్య ప్రజలు, ఎల్లప్పుడూ అతన్ని మద్యపానంతో గుర్తించారు. కానీ అతను తరగతి గదికి తాగిన స్థితిలో వచ్చిన ఒక్క సందర్భం కూడా లేదు”. అంటారు ప్రఖ్యాత మలయాళీ దర్శకుడు, ఆయన శిష్యుడు కూడా ఆయన ఆదూర్‌ గోపాలకష్ణన్‌ . భారతీయ చిత్ర జగత్తులో నేనందరిలాంటి వాణ్ణి కాదని నిరూపిస్తానని చెప్పుకున్న రిత్విక్‌ ఘటక్‌ మాటలు ఆయన మరణానంతరం నిజమైనవి. దేశ దేశాల్లో ఆయన చిత్రాలు చూసిన పాశ్చాత్యులు ”రే”ని మించిన దర్శకుడని కొనియాడారు.

రిత్విక్‌ ఘటక్‌ సినిమా దర్శకుడు, నటుడు, రచయిత మాత్రమే గాకుండా హిందీలో హషీదా ‘ముసాఫిర్‌’, బిమాల్‌ దా ‘మధుమతి’ చిత్రాలకు, మరికొన్ని బెంగాలీ చిత్రాలకు స్క్రీన్‌ ప్లేలు రాశారు. సినిమా విమర్శకులు, అభిమానులు ఘటక్‌ జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన దేశ విదేశీ దర్శకులతో పోల్చిన సందర్భాలున్నాయి. అయితే నిజానికి ఆయన ఎవరితోనూ సరిపోల్చదగిన వారు కాడనేది నిర్వివాదాంశం. ఆయన ఎవరినీ అనుకరించలేదు. ఒక దేశపు కళా లక్ష్యాన్ని అదుపు చేయగలిగిన జీనియస్‌ ఘటక్‌. బ్రతుకులోని అరాచకత్వం వల్ల ఆయన పని విధానాలను తగిన సమయంలో ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు.

పాశ్చాత్య సినిమాకారుడు ‘లుయిమారే’ రిత్విక్‌ ఘటక్‌ ను ‘మోస్ట్‌ ఒరిజినల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ వరల్డ్‌ సినిమా! అనడంలో ఇసుమంతైనా అతిశయం లేదు. రిత్విక్‌ తన జీవిత కాలంలో 8 కథా చిత్రాలు, 4 షార్ట్‌ ఫిలింలు, 4 డాక్యుమెంటరీలు, ఒక వ్యాపార చిత్రం తీశారు, 6 సినిమాలకు స్క్రీన్ప్లే రాశారు. సాత్విక్‌ ఘటక్‌ కలకత్తాలోని ఎస్‌.ఎస్‌.కె.ఎం. హాస్పిటల్లో 1976 ఫిబ్రవరి 6న 60వ యేట కాలం చేశారు. బెంగాల్‌ సమాజంలో తిరుగుబాటుదారులుగా గుర్తింపునొందిన సజనాత్మక కారులు కవి మీఛెల్‌ మధుసూదనదత్‌, సినిమాకారుడు పి.సి. బారువా, రచయిత మాణిక్‌ బంధోపాధ్యాయ వంటి వారి కోవకు చెందిన రిత్విక్‌ ఘటక్‌ స్మశానంలో అంత్యక్రియల తరువాత మిగిలిన బూడిదలోంచి ఫీనిక్స్‌ పక్షిలా జీవం పోసుకుని తిరిగి లేస్తాడని భావించారు ఆ తరంవారు. ఆయన కళాశక్తి ఎంత గొప్పది.

రిత్విక్‌ ఘటక్‌ భారతీయ సినిమాను ఒక ఇసుక తుఫానులా ఢీకొట్టి నిలబడ్డారు. ఎంత త్వరగా తన సినిమాలతో సంచలనం సృష్టించాడో అంతే త్వరగా ఆయన కనుమరుగైపోయాడు. ఆయన మరణం తరువాతనే ఆయన సినిమాలు అంతర్జాతీయ ఖ్యాతినొందినవి. ఫ్రాన్సు, ఇటలీ, కెనెడాలు ఆయనను ప్రపంచ సినిమారంగంలో ఉన్నత స్థానంలో నిలబెట్టి నివాళి ఘటించినవి. ఘటక్‌ సినీ దర్శకుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప కథా. నాటక రచయిత, ఎన్నో వ్యాసాలు రాశారు. అవన్నీ గ్రంథరూపంలో వెలువడినవి. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ఇలా చెప్పుకున్నారు. “The ideological base of my work is fundamentally Marxism” రిత్విక్‌ ఘటక్‌ సమాజ గతిని దశ్యబద్ధం చేసిన దర్శకుడు, తను సినిమా తీయాలనుకున్నప్పుడే సినిమాలు తీశారు.

కానీ సినిమా తీయాలని తీసిన సినిమాలు కావవి. ప్రజల జీనవాన్ని, అందులో కనిపించని కోణాలను చిత్రీకరించారు. ఇవన్నీ నాటి వర్తమాన చలన చిత్రకారుల ధోరణికి వ్యతిరేకమైన సినిమాలు. ఆవిధంగా రిత్విక్‌ ఘటక్‌ భారతీయ సినిమా రంగంపై ఎగిరిన తిరుగుబాటు జెండా. రిత్విక్‌ ఘటక్‌ స్వల్ప కాలం జీవితాన్ని నిర్లక్ష్యంగా గడిపాడు. దానిని రెండు వైపులా తగలబెట్టాడు. సినిమా పట్ల అతని మక్కువ, నిబద్ధత అతని రాజకీయ నమ్మకాల మాదిరిగానే తీవ్రమైనవి. చివరగా – ‘రిత్విక్‌ కచ్చితంగా బెంగాలీ దర్శకుడు. బెంగాలీ కళాకారుడు. నాకన్నా హెచ్చుగా బెంగాలీవాడు.’ అన్న సత్యజిత్‌ రే మాటల్లో రిత్విక్‌ఘటక్‌ మహౌన్నత కళామూర్తిత్వం మనకు అవగతమవుతుంది.

రిత్విక్‌ ఘటక్‌ సినిమాలు:
నాగరిక్‌ (1952), అజాంతరిక్‌ (1968) బరీ తేకే పాలియే (1959), మేఘదకర (1960) కోమల్‌ గాంధార(1961), సుబర్ణ రేఖ(1962) టిటాస్‌ ఏక్తీ నదీర్‌ నామ్‌ (1973) ఝుక్తి టక్కో ఆర్‌ గప్పో(1974). డాక్యుమెంటరీలు: ఒరాన్‌ (1965), సైంటిస్ట్స్‌ ఆఫ్‌ టుమారో (1967), గౌడాన్స్‌ ఆఫ్‌ పురూలియా (1970), రాం ఖిన్‌ కర్‌(1975).
షార్ట్‌ ఫిలిమ్స్‌:
ఫియర్‌ (1964-65), అమర్‌ లెనిన్‌ (1970), ఏ క్యూం (1970) దర్బార్‌ గతి పద్మ (1971) యాడ్‌ ఫిలిం: సీజర్‌ (1962).
స్క్రీన్‌ ప్లేలు:
ముసాఫిర్‌ (హిందీ- 1955), మధుమతి (హిందీ- 1955) స్వరలిపి (బెంగాలి-1960), కుమారి మోన్‌ (బెంగాలి-1962), ద్వీపేర్‌ నామ్‌ టోయారాంగ్‌ (బెంగాలి-1963), రాజ్‌ కన్య (బెంగాలి-1965)
అవార్డులు:
రిత్విక్‌ ఘటక్‌ 1970లో పద్మశ్రీ అందుకున్నారు. జుకీ టక్కో ఆర్‌ గప్పో’ రజత కమలం అందుకున్నది. ఇదే చిత్రం బంగ్లాదేశ్‌ సినీ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ పురస్కారం, అజాంతరిక్‌’ వెనీస్‌ ఫిలిం ఫెస్టివల్‌ ప్రత్యేక ఎంట్రీగా ఎంపికైంది.

పోరాట కళాకారుడు
రిత్విక్‌ మరణం తర్వాత, నా తండ్రి ఒక స్మారక సమావేశంలో ఈ విషయం చెప్పాడు. రిత్విక్‌ హత్య చేయబడ్డాడు. రిత్విక్‌ హత్య చేయబడ్డాడని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ హత్య అనేక విధాలుగా చేయవచ్చు. జాఫర్‌ పనాహికి ఇరవై సంవత్సరాలు సినిమాలు తీయలేమని లేదా స్క్రిప్ట్‌లు రాయలేమని చెప్పినప్పుడు, అది అతన్ని చంపడమే. వినాయక్‌ సేన్‌కు మీరు వైద్యం చేయలేరు లేదా ఏమీ చేయలేరు అని చెప్పినప్పుడు, అది కూడా అతన్ని చంపడమే. అలాగే రిత్విక్‌ సినిమాలు తీయడానికి అవరోధాలను ఎదుర్కొన్నాడు. ఆ కాలంలో కష్టపడుతున్న పోరాట కళాకారుడికి రిత్విక్‌ ఒక ఉదాహరణ.

ఇది సుబర్ణ రేఖ తీస్తున్నప్పుడు నేను చూశాను. ప్రతి రాత్రి 9:30 గంటలకు కోల్‌కతా నుండి ఒక రైలు వచ్చేది. ఆ 9:30 కి ముందు నేను రిత్విక్‌లో ఒక వింత ఉద్రిక్తతను గమనించాను. ఆ రైలు వస్తుందా, లేదా నాకు తెలిసిన ఎవరైనా రైలు దిగుతారా అనేది ఆ ఉద్రిక్తత. సినిమా స్టాక్‌ తెస్తాడా, లేదా? అది రాకపోతే, షూటింగ్‌ చేయలేము. ఒకనాడు స్టాక్‌ రాలేదు. షూటింగ్‌ రోజురోజుకూ ఆగిపోయింది. సుబర్ణరేఖ యొక్క ఆ విలువైన ఫుటేజ్‌ టాలీగంజ్‌లో కలపబడింది. మన దేశంలో నిజంగా ఏదైనా ఆర్కైవ్‌ ఉందా. నిజంగా ఏదైనా ఉంటే, అవి అమూల్యమైన ఆస్తులు.అందుకే ఆ కాలంలో పలు కారణాల చేత రిత్విక్‌ హత్య చేయబడ్డాడని (?) నేను చెప్పాను.
వరుణ్‌ భట్టాచార్య

చలనచిత్ర ఋషి
భారత దేశంలోని సామాజిక సమాంతర సినిమా చరిత్రలో రిత్విక్‌ ఘటక్‌ ది అత్యంత ప్రత్యేకమైన అధ్యాయం. అతడి ముద్ర, గాఢత, అతడి మార్గం అనితర సాధ్యం. చలనచిత్రానికి సంబంధించిన అన్ని విభాగాలలో అతడి ప్రావీణ్యత మరొకరికి సాధ్యం కాదు. రిత్విక ఘటక్‌ చిత్రాలు ఆయన అనుభవసారాలు. ఆయన సినిమాలు స్టకింగ్‌ గా మన వీపు మీద పడే కొరడా దెబ్బల వంటివి. భారత చలనచిత్ర రంగంలో రిత్విక్‌ ఘటక్‌ ఒక ఋషి లాంటి చలనచిత్రకారుడు. ఆ సంపూర్ణ చలనచిత్రకారుడికి జోహార్లు.
బి. నర్సింగరావు, న్యూ సినిమా ఫిలిం మేకర్‌

ఘటక్‌ -సత్యజిత్‌ రే
బారి తేకే పాలియే (1958)తో ప్రారంభించి, అతని అనేక చిత్రాలు అతని రాజీలేని స్ఫూర్తికి, నిరంతర పోరాటాలకు నిదర్శనం. 1963లో, నేను ఫిల్మ్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు, ఆయన మాతో వైస్‌ ప్రిన్సిపాల్‌ మరియు ఫిల్మ్‌ డైరెక్షన్‌ ప్రొఫెసర్‌గా చేరారు. నాటక రంగంలో ఆయన చేసిన అద్భుతమైన సాహసాలు, అతని సినిమా విజయాలు విస్మయంతో కూడిన ప్రశంసలతో నిండిపోయినవి. ఒకసారి ఆయన తరగతి గదిలో రే చిత్రం ”అపరాజిత”ను ప్రదర్శించినప్పుడు, ”ఇదిగో గొప్ప సినిమా!” అని చెప్పడానికి కొన్ని సన్నివేశాలను ఎత్తి చూపారు.

రే, ఘటక్‌ ప్రత్యర్థులు అనే తప్పుడు భావనలో ఉన్న ఫిలిం ఇన్‌ స్టిట్యూట్‌ విద్యార్థులకు తెలిసిన నిజం ఏమిటంటే ఇద్దరూ ఒకరినొకరు బాగా ఆరాధించుకున్నారని. ఘటక్‌ రే నుండి కూడా ప్రశంసలను పొందాడు. ”ఘటక్‌ అంటే సినిమా కథలు నడుస్తున్నాయి” అని రే ప్రశంసించారు. ఐతే బాధాకరమైన సందర్భం ఏమిటంటే కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో ఘటక్‌ మరణవార్త తెలుసుకున్న రే, చివరి నివాళులు అర్పించడానికి వెళ్ళాడు. మతదేహం క్షీణిస్తున్న ఆసుపత్రి వార్డు నుండి అతను బయటకు రాగానే, వరండాలో వేచి ఉన్న యువకుల గుంపు రే వైపు వేళ్లు చూపిస్తూ, ‘నువ్వు అతన్ని చంపావు’ అని అరిచింది.
ఆదూర్‌ గోపాలకృష్ణన్‌, ఘటక్‌ విద్యార్థి, ఫాల్కే అవార్డు గ్రహీత

  • హెచ్‌ రమేష్‌ బాబు, 7780736386
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -